ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: బనకచర్లపై ఏం చేద్దాం!

ABN, Publish Date - Jun 23 , 2025 | 03:58 AM

గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రాష్ట్రం తరఫున తీసుకోవాల్సిన చర్యలు, అవలంబించాల్సిన విధానాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.

  • ఇప్పటికే కేంద్రానికి అభ్యంతరాలు తెలిపాం

  • అధికారులు, మంత్రుల కమిటీ నియమించి చర్చిద్దాం

  • ఆ తరువాత ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం

  • ప్రభుత్వం యోచన.. నేడు క్యాబినెట్‌ భేటీలో చర్చ

  • స్థానిక ఎన్నికల నిర్వహణ.. కోర్టు కేసులపైనా

  • ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం అలైన్‌మెంట్‌కు ఆమోదం!

  • బాగ్‌ లింగంపల్లి హౌసింగ్‌ బోర్డు భూములపై నిర్ణయం

  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. పథకాలపై చర్చించే చాన్స్‌

  • రైతుభరోసా విజయోత్సవాల నిర్వహణకు నిర్ణయం

  • నేటి క్యాబినెట్‌ భేటీకి ముగ్గురు కొత్త మంత్రులు

హైదరాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రాష్ట్రం తరఫున తీసుకోవాల్సిన చర్యలు, అవలంబించాల్సిన విధానాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అసలు బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజబిలిటీ రిపోర్టు (పీఎ్‌ఫఆర్‌)ను కేంద్రానికి ఇచ్చే ముందే ఏపీ సర్కారు తెలంగాణతో చర్చించి ఉంటే ఈ వివాదమే ఉండేది కాదంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిలో వ్యాఖ్యానించి విషయం తెలిసిందే. గోదావరి, కృష్ణా జలాల వివాదాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులం కూర్చుని మాట్లాడుకుందామని కూడా ఆయన అన్నారు. కాగా, సోమవారం జరగనున్న రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో బనకచర్ల వ్యవహారంపై కీలకంగా చర్చించనున్నట్లు తెలిసింది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని 6వ అంతస్తులో క్యాబినెట్‌ భేటీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బనకచర్ల వ్యవహారంపై ఆదివారం ఇరిగేషన్‌ శాఖ ముఖ్య అధికారులు, మంత్రి కూడా కొంత చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగానే గోదావరి-బనక చర్ల ప్రాజెక్టు విషయంతోపాటు ఏపీతో నెలకొన్న మరికొన్ని వివాదాలపై కూడా చర్చించేందుకు ఇరు రాష్ట్రాల మంత్రులతో సమావేశం నిర్వహించాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది.

గతంలో సీఎంల భేటీ తరహాలోనే..

రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి గతంలో ప్రజాభవన్‌ వేదికగా రెండు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి సమావేశమైన విషయం తెలిసిందే. ఆ తరహాలోనే ఈసారి తొలుత అధికారులు, మంత్రులతో కమిటీని నియమించి చర్చించాలని, ఆ తరువాత ఇరువురు ముఖ్యమంత్రులు సమావేశమై సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునేలా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. మంత్రివర్గ సమావేశంలో ఇదే అంశంపై కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు తాము మిగులు జలాలనే వినియోగించుకుంటామని ఏపీ చెబుతున్న నేపథ్యంలో తెలంగాణ పరిఽధిలో గోదావరి, కృష్ణా నదులపై ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నింటికీ నిరభ్యంతర పత్రం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఇరు రాష్ట్రాల నీటి వాటాల కేటాయింపుల అంశంపైనా క్యాబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. దీనిపై తీసుకున్న నిర్ణయాల ప్రకారమే ఏపీతో చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటితోపాటు పాలమూరు-రంగారెడ్డిలో మూడు ప్యాకేజీల సవరణ, రాజీవ్‌ భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం సవరణ అంచనాలు, మేడిగుంట వాగు ప్రాజెక్టుల సవరణ అంచనాలపైనా చర్చించనున్నారు. కాళేశ్వరం విచారణ కమిషన్‌.. గత క్యాబినెట్‌ సమావేశ వివరాలను ఇవ్వాలని కోరిన నేపథ్యంలో దానిపైనా చర్చించ్చవచ్చని తెలుస్తోంది.

స్థానిక ఎన్నికల నిర్వహణపై చర్చ!

స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరగనుంది. ఈ ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. దీనికి సంబంధించి హైకోర్టులో ఉన్న కేసుల విషయంలోనూ ముందుకెళ్లాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు.. బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశాకే ఎన్నికలకు వెళ్లాలంటూ గతంలో దాఖలైన కేసుల్లో వాదనలు వినిపిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు సిద్ధమైంది. దీంతో కోర్టు కేసులు, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరిపేందుకు ఉన్న అవకాశాలు సహా పలు అంశాలపై క్యాబినెట్‌లో కీలకంగా చర్చించనున్నట్లు తెలిసింది. గతంలో స్థానిక ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్లపైనా చర్చించి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణభాగం అలైన్‌మెంట్‌కు క్యాబినెట్‌లో ఆమోదం తెలపనున్నట్టు సమాచారం. అనంతరం ఈ అలైన్‌మెంట్‌ను కేంద్రానికి నివేదించాలనే నిర్ణయం తీసుకోనున్నట్లు, ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగంతోపాటే దక్షిణభాగాన్నీ నిర్మించాలని మరోమారు కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నిర్ణయం తేలిన తరువాత ఈ రహదారి విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపైనా క్యాబినెట్‌లో చర్చించనున్నారు.

హౌసింగ్‌ బోర్డు భూములపైనా..

హౌసింగ్‌ బోర్డు పరిధిలో ఉన్న పలు భూముల వ్యవహారంపైనా ఈసారి మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇందులో భాగంగా బాగ్‌ లింగంపల్లి పరిధిలో బోర్డుకు ఉన్న భూములపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫైలును కూడా అధికారులు క్యాబినెట్‌కు పంపారు. రాష్ట్రంలో క్రీడల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న దృష్ట్యా క్రీడా పాలసీపైనా మంత్రివర్గం చర్చించనుంది. దీంతోపాటు భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను ఎలా పరిష్కరించాలనే అంశంపై చర్చించనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం రైతుభరోసా కింద దాదాపు రూ.9 వేల కోట్లను 9 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంది. ఆ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో విజయోత్సవాలు నిర్వహించాలని సర్కారు యోచిస్తున్నట్టు తెలిసింది. దీనిపై క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. మరోవైపు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, అమలు చేయాల్సిన పథకాలేంటి, ఏయే పథకాలకు ఎన్ని నిధులు కావాలి వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇందులో భాగంగానే రాజీవ్‌ యువ వికాసం పథకం అమలు అంశంపైనా చర్చించనున్నట్టు సమాచారం. ఇక ఈసారి ప్రణాళిక విభాగంపైనా క్యాబినెట్‌లో చర్చ జరపనున్నట్టు తెలిసింది. కాగా, ఈసారి మంత్రివర్గ సమావేశంలో ముగ్గురు కొత్త మంత్రులు జి.వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, వాకిటి శ్రీహరి తొలిసారి పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి..

మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..

అర్ధరాత్రి టెంట్‌‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 23 , 2025 | 03:58 AM