ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఫిలిప్పీన్స్‌కు ఏటా 8 లక్షల టన్నుల బియ్యం!

ABN, Publish Date - May 20 , 2025 | 04:01 AM

తెలంగాణ, ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఏటా 8 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ఫిలిప్పీన్స్‌ అంగీకరించింది.

  • తెలంగాణ-ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వాల మధ్య ఎంవోయూ.. నాణ్యత బాగుండడంతో భారీగా దిగుమతికి ఒప్పందం

హైదరాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఏటా 8 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ఫిలిప్పీన్స్‌ అంగీకరించింది. ప్రాథమిక ఒప్పందంలో లక్ష టన్నుల బియ్యం దిగుమతికి అంగీకరించిన ఆ దేశం.. బియ్యం నాణ్యతపై సంతృప్తి చెందిన తర్వాత వార్షిక ఒప్పందం చేసుకుంది. తెలంగాణ-ఫిలిప్పీన్స్‌ మధ్య జరిగిన ఎంవోయూ ప్రకారం.. ఇకపై ఏటా 8 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఫిలిప్పీన్స్‌తో గత మార్చి నెలలో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే ఐఆర్‌-64, ఎంటీయూ-1010 రకాల బియ్యం ఎగుమతికి శ్రీకారం చుట్టింది. తొలి విడతలో 12,750 మెట్రిక్‌ టన్నులు, మలివిడతలో 10 వేల టన్నుల బియ్యాన్ని సముద్రమార్గంలో ఫిలిప్పీన్స్‌కు పంపించింది. మరో 6 వేల టన్నుల బియ్యాన్ని ఈ నెలాఖరున లేదా జూన్‌ మొదటివారంలో పంపనుంది. ప్రాథమిక ఒప్పందంలో ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం లక్ష టన్నుల బియ్యం దిగుమతికి అంగీకరించింది. అందులో భాగంగానే విడతలవారీగా బియ్యాన్ని పంపిస్తున్నారు. మన బియ్యం నాణ్యత బాగుండడంతో ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు మార్కోస్‌ దిగుమతి చేసుకునేందుకు అంగీకరించారు. తెలంగాణ బియ్యంతో వండిన అన్నం రుచి చూసిన తర్వాతే ఆయన ఏటా 8 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుమతికి ఆమోదం తెలిపారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. బియ్యం ఎగుమతికి ఆదిత్య బిర్లా కంపెనీ లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌వోసీ) ఇచ్చింది. తొలి విడతలో పంపిన బియ్యం బిల్లును కూడా ఫిలిప్పీన్స్‌ సర్కారు చెల్లించింది.


కేంద్ర ప్రభుత్వ పచ్చజెండా

తెలంగాణ రాష్ట్రం ‘వికేంద్రీకృత సేకరణ వ్యవస్థ (డీసీపీ)’లో ఉన్నందున కనీస మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) చేసి అప్పగించాల్సి ఉంటుంది. అయితే మిల్లర్లు సకాలంలో సీఎంఆర్‌ ఇవ్వకపోవడం, ఏళ్ల తరబడి బియ్యం బకాయిలు పేరుకుపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం బియ్యం ఎగుమతికి చేసిన ప్రయత్నం ఫలించింది. ఫిలిప్పీన్స్‌ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయగా.. బియ్యం ఎగుమతికి అనుమతి ఇచ్చింది.


వియత్నాం తర్వాత మనకే ప్రాధాన్యం

ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం ఆహార అవసరాలు తీర్చుకోవడానికి వియత్నాం దేశంపై ఆధారపడుతోంది. వియత్నాం బియ్యం నాణ్యత కూడా బాగుంటుందని ఎగుమతిదారులు, అధికారులు చెబుతున్నారు. ఫిలిప్పీన్స్‌ ఏటా 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని వియత్నాం నుంచి దిగుమతి చేసుకుంటోంది. తెలంగాణ బియ్యాన్ని పరిశీలించిన ఫిలిప్పీన్స్‌.. తర్వాతి ప్రాధాన్యం మన రాష్ట్రానికే ఇవ్వడం గమనార్హం. ఇదిలా ఉండగా భారత్‌ నుంచి 150 దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో ఫిలిప్పీన్స్‌ లేదు. ఆ లోటును తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

HYD Fire Accident: ఓల్డ్‌సిటీ ఫైర్ యాక్సిడెంట్‌కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్‌ కనెక్షన్లు.!

Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు

Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 20 , 2025 | 04:01 AM