Srivari Construction: శ్రీవారి కన్‌స్ట్రక్షన్‌పై రెరా కొరడా!
ABN, Publish Date - Jul 11 , 2025 | 05:49 AM
ఒప్పందం ప్రకారం కొనుగోలుదారులకు ఫ్లాట్లు కేటాయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన శ్రీవారి కన్‌స్ట్రక్షన్ సంస్థపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కొరడా ఝళిపించింది.
‘శ్రీవారి బృందావనం’ ఫ్లాట్ల అమ్మకాలు చేయొద్దంటూ ఉత్తర్వులు
హైదరాబాద్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఒప్పందం ప్రకారం కొనుగోలుదారులకు ఫ్లాట్లు కేటాయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన శ్రీవారి కన్‌స్ట్రక్షన్ సంస్థపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కొరడా ఝళిపించింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మునిసిపాలిటీ పరిధిలోని పద్మశ్రీ హిల్స్‌లో పి.ఉమాదేవి సారథ్యంలో శ్రీవారి కన్‌స్ట్రక్షన్.. శ్రీవారి బృందావనం పేరుతో 80 ఫ్లాట్లను నిర్మించింది. వీటిని 2023 ఫిబ్రవరి నుంచి 2024 మేలోపు కొనుగోలుదారులకు అందజేస్తామని వారి నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసింది. సకాలంలో ఫ్లాట్లు అందజేయలేదని రెరాకు ఫిర్యాదులు వచ్చాయి.
విచారణ చేపట్టిన రెరా.. సంస్థ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడటంతో ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రాజెక్టు గురించి ప్రచారం చేయకూడని, అలాగే అమ్మకాలు, రిజిస్ర్టేషన్లు చేయొద్దని ఆదేశించింది. ఈ ప్రాజెక్టు తరుఫున రిజిస్ర్టేషన్‌కు వచ్చే లావాదేవీలను అనుమతించవద్దని రిజిస్ర్టేషన్ శాఖకు సమాచారం ఇచ్చింది. శ్రీవారి కన్‌స్ట్రక్షన్ చేపట్టే ప్రాజెక్టుల్లో ఎలాంటి కొనుగోళ్లు చేయవద్దని, వారితో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దని ప్రజలు, కొనుగోలుదారులకు రెరా సూచించింది.
Updated Date - Jul 11 , 2025 | 05:49 AM