మాతృ మరణాల్లో స్వల్ప పెరుగుదల
ABN, Publish Date - Jun 24 , 2025 | 03:35 AM
కరోనా కాలంలో రాష్ట్రంలో మాతృ మరణాలు స్వల్పంగా పెరిగాయి. ప్రసవ సమయంలో ప్రతి లక్షమందిలో 50మంది మృత్యువాతపడ్డారు.
కరోనా టైంలో రాష్ట్రంలో పెరిగిన మరణాలు
శిశుమరణాల్లో స్వల్ప తగ్గుదల నమోదు
ఎస్‌ఆర్‌ఎస్ బులెటిన్ 2020-22లో కేంద్రం వెల్లడి
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): కరోనా కాలంలో రాష్ట్రంలో మాతృ మరణాలు స్వల్పంగా పెరిగాయి. ప్రసవ సమయంలో ప్రతి లక్షమందిలో 50మంది మృత్యువాతపడ్డారు. మెటర్నల్ మోర్టలిటీ రేషియో(ఎంఎంఆర్)లో రాష్ట్రం ఐదోస్థానంలో, ఇన్‌ఫ్యాంట్ మోర్టలిటీ రేటు (ఐఎంఆర్) పరంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ మేరకు 2020-22కు సంబంధించి కేంద్రం శాంపిల్ రిజిష్ట్రేషన్ సిస్టమ్ (ఎస్‌ఆర్‌ఎస్) విడుదల చేసింది. ఎస్‌ఆర్‌ఎస్ బులెటిన్ 2018-20 ప్రకారం తెలంగాణలో మాతృమరణాల సంఖ్య 45గా నమోదు కాగా, 2020-22లో అది 50కు పెరిగింది. ఎంఎంఆర్ జాతీయ సగటు 88గా నమోదైంది. ఎంఎంఆర్ అతి తక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో కేరళ అగ్రస్థానంలో నిలిచింది. అక్కడ ప్రతి లక్ష ప్రసవాలకు 18 మంది మృత్యువాతపడ్డారు.
ఐఎంఆర్ విషయంలో తెలంగాణ కాస్త మెరుగుపడింది. 2021లో రాష్ట్రంలో పుట్టిన ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 20 మంది మృత్యువాత పడ్డారు. 2022 నాటికి ఆ సంఖ్య 18కు తగ్గింది. శిశుమరణాల జాతీయ సగటు 26గా నమోదైంది. కేరళలో శిశుమరణాల రేటు ప్రతి వెయ్యికి 12గా ఉంది. కాగా ఉత్తరాది రాష్ట్రాల్లో జాతీయ సగటు (88)కు మించి మాతృమరణాలు సంభవించాయి. ఆ రాష్ట్రాల్లో ఎంఎంఆర్ 120గా నమోదైనట్లు ఎస్‌ఆర్‌ఎస్ బులెటిన్ పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సగటు 42గా రికార్డు అయినట్లు వెల్లడించింది. దేశంలోనే అత్యధిక మాతృ మరణాలు మధ్యప్రదేశ్‌లో సంభవించాయి. అక్కడ ప్రతి లక్ష ప్రసవాల్లో 159 మంది మృత్యువాతపడ్డారు. అత్యధిక శిశుమరణాలు కూడా మధ్యప్రదేశ్‌లోనే నమోదయ్యాయి. అక్కడ పుట్టే ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 40 మంది మృతిచెందారు.
ఇవి కూడా చదవండి..
అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్
సీఎం సారూ.. స్కూలు సీటు కావాలి
For National News And Telugu News
Updated Date - Jun 24 , 2025 | 03:35 AM