ట్యాపింగ్ ముఠా.. వసూళ్ల వేట!
ABN, Publish Date - Jul 01 , 2025 | 05:23 AM
నేను ఓ వ్యక్తికి భూమి అమ్మాను. ఆ వ్యక్తి వద్దకు ట్యాపింగ్ ముఠా వెళ్లి బెదిరించింది. బలవంతంగా రూ.12 కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు ఎలక్టోరల్ బాండ్లను కొనిపించింది.
ట్యాపింగ్ మాటున బెదిరింపులు, దోపిడీలు
ఎంపీ కొండా నుంచి భూమి కొన్న వ్యక్తి నుంచి వసూళ్లు
13కోట్ల ఎలక్టోరల్ బాండ్లకుతోడు 4-5కోట్లకు కుచ్చుటోపీ
ఎన్నికలవేళ ఎంపీ ఈటల అనుచరులకు బెదిరింపులు
వీరందరి వాంగ్మూలాల నమోదుకు తాజాగా సిట్ కసరత్తు
బాండ్లు ఏ పార్టీకి, ఎవరు కొనిపించారని ఆరా తీసే చాన్స్
పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకు.!
హైదరాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను ఓ వ్యక్తికి భూమి అమ్మాను. ఆ వ్యక్తి వద్దకు ట్యాపింగ్ ముఠా వెళ్లి బెదిరించింది. బలవంతంగా రూ.12 కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు ఎలక్టోరల్ బాండ్లను కొనిపించింది. మరో రూ.4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు అదనంగా వసూలు చేసింది. నా దగ్గర భూమి కొన్న వ్యక్తి వివరాలు వారికెలా తెలుస్తాయి? ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్ప?’’
.. ఫోన్ ట్యాపింగ్ విచారణ తర్వాత ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్న మాటలివి!
మునుగోడు, హుజూరాబాద్ ఎన్నికలప్పుడు నా ఫోన్ ట్యాప్ చేశారు. ఎవరెవరితో మాట్లాడుతున్నానో తెలుసుకున్నారు. నా అనుచరులను బెదిరించారు.
.. ఫోన్ ట్యాపింగ్‌పై ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రెండో కోణంపై సిట్ అధికారులు తాజాగా దృష్టి సారించారు. ట్యాపింగ్ మాటున స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ)లోని స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్‌వోటీ) సభ్యులు బెదిరింపులు, దోపిడీలు, వేధింపులు, బ్లాక్ మెయిలింగ్, రికార్డులను తారుమారు చేయడం వంటి నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. వారి నేరాలను పక్కాగా నిరూపించేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వద్ద భూమి కొన్న సదరు వ్యక్తి వాంగ్మూలాన్ని సేకరించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎలక్టోరల్ బాండ్లను ఏ పార్టీ తరఫున కొనుగోలు చేశారు? ఆ పార్టీ తరఫున కొనుగోలు చేయాలంటూ ఎవరు బెదిరించారు!? ఎవరి పేరు చెప్పి వసూలు చేశారు!? అదనంగా డబ్బులు వసూలు చేశారా!? అయితే ఎంత!? వాటిని ఎవరికి ఇచ్చారు!? తదితర వివరాలను సేకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అలాగే, అప్పట్లో బెదిరింపులకు గురైన ఈటల అనుచరుల వాంగ్మూలాలను కూడా సిట్ సేకరించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఉన్న అనుచరుల వివరాలు వారికి ఎలా తెలిశాయి? ఏమని బెదిరించారు? ఎవరెవరు రంగంలోకి దిగారు? తదితర వివరాలతో వాంగ్మూలాలు సేకరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి బాధితుల చిట్టా పెద్దగానే ఉందని తెలుస్తోంది. పక్కాగా సాక్ష్యాధారాలను సేకరించాలని సిట్‌ను ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో.. ఈ కేసులో బాధితుల వాంగ్మూలాలే కీలకమని అధికారులు భావిస్తున్నారు. ఎస్‌వోటీ అధికారులు చేసిన అరాచకాలకు సంబంధించి పకడ్బందీ సాక్ష్యాధారాలను కోర్టులకు సమర్పించి, అభియోగాలను రుజువు చేయాలని సిట్ భావిస్తోంది. ఇది సిట్ వ్యూహాత్మక ఎత్తుగడ అని విశ్రాంత పోలీసు అధికారులు, న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్‌తోపాటు దాని మాటున జరిగిన అరాచకాలూ బయటకు వస్తాయని వివరిస్తున్నారు.
4 వేలకుపైగా నంబర్ల ట్యాపింగ్!
సీఎం రేవంత్ సైతం.. తాను విపక్ష నేతగా ఉన్నప్పుడు తనతోపాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికితోడు, ఫోన్ ట్యాపింగ్ బాధితుల సంఖ్య కూడా భారీగానే బయట పడుతోంది. ఈ క్రమంలో ప్రభాకర్ రావు నేతృత్వంలోని ఎస్‌వోటీ బృందంలోని సభ్యులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు నాలుగు వేలకుపైగా ఫోన్ నంబర్లను ట్యాప్ చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటిలో రాజకీయ నాయకులు, వ్యాపారులు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సల నంబర్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మావోయిస్టులు, వారి సానుభూతిపరుల పేరుతో అధికారికంగా కొందరివి.. అనధికారికంగా మరికొందరివి ట్యాపింగ్ చేసినట్లు వివరిస్తున్నారు. అధికారికంగా కాల్ డిటైల్ రికార్డ్స్‌ను తెప్పించుకున్నారు. ఇందులో 615 నంబర్లు ఉన్నట్లు సిట్ గుర్తించిన విషయం తెలిసిందే. వేల నంబర్లను ట్యాపింగ్ చేసిన నేపథ్యంలో వీటిలో రాజకీయ ట్యాపింగ్ ఏవి.. వసూళ్ల ట్యాపింగ్ ఏవేవి అనే వివరాలను ఆరా తీయాలని కూడా సిట్ భావిస్తోంది.
Updated Date - Jul 01 , 2025 | 05:23 AM