ఉపకులాల మధ్య అసమానతల అంచనాకు.. సమష్టి వెనకబాటుతనం సూచిక
ABN, Publish Date - May 23 , 2025 | 05:11 AM
తెలంగాణలో 243 ఉప కులాల మధ్య అసమానతలను అంచనా వేసేందుకు.. కుల గణన సమాచారాన్ని ఉపయోగించి సమష్టి వెనకబాటుతనం సూచిక(సీబీఐ)ను రూపొందించాలని దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుచేసిన నిపుణుల బృందం నిర్ణయించింది.
రూపొందించాలని నిపుణుల బృందం నిర్ణయం
నెలలో నివేదిక: బృందం కన్వీనర్
న్యూఢిల్లీ, మే 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 243 ఉప కులాల మధ్య అసమానతలను అంచనా వేసేందుకు.. కుల గణన సమాచారాన్ని ఉపయోగించి సమష్టి వెనకబాటుతనం సూచిక(సీబీఐ)ను రూపొందించాలని దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుచేసిన నిపుణుల బృందం నిర్ణయించింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ నిపుణుల బృందం.. 2024లో తెలంగాణలో జరిగిన సామాజిక, విద్యా, ఉపాధి, ఆర్థిక, రాజకీయ పరమైన సర్వే (సమగ్ర ఇంటింటి సర్వే) పేరుతో సేకరించిన డేటాను అధ్యయనం చేసి విశ్లేషించింది. ఈమేరకు నిపుణుల బృందం చేసిన సిఫారసులను గురువారం ఢిల్లీలో ఆ బృందం కన్వీనర్ ప్రవీణ్ చక్రవర్తి విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 243 ఉపకులాలు ఉండగా.. రాష్ట్ర జనాభాలో 96ు మంది వాటిలో 73 ఉపకులాల్లోనే ఉన్నట్టు సర్వేలో తేలింది. అందులో షెడ్యూల్డ్ కులాలకు చెందిన 10 ఉప కులాలు, షెడ్యూల్డ్ జాతులకు చెందిన ఏడు ఉప కులాలు, వెనకబడిన జాతులకు చెందిన 45 ఉప కులాలు, ఇతరులు 11 ఉప కులాలు ఉన్నాయని.. ఈ ఉప కులాల్లో ఒక్కొక్క దానికీ సమష్టి వెనకబాటుతనం సూచికను రూపొందించాలని నిపుణుల బృందం నిర్ణయించిందని ప్రవీణ్ చక్రవర్తి తెలిపారు.
రాజ్యాంగంలో పొందుపరిచిన మౌలిక, సమానత్వ సూత్రాలకు అనుగుణంగా ఈ సూచికను రూపొందిస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సామాజిక వెనకబాటుతనం, విద్య, జీవన ప్రమాణాలు, వృత్తి, ఆదాయం, స్థిర అస్థిర ఆస్తులు, బ్యాంకింగ్ ఫైనాన్స్ సౌకర్యాలకు అందుబాటు అనేఏడు అంశాలకు సంబంధించి 43 ప్రాతిపదికలను ఉపయోగించి మొత్తం వెనకబాటుతనాన్ని సమగ్రంగా అంచనా వేస్తారు. ఉప కులాల సాపేక్ష వెనకబాటుతనాన్ని అంచనా వేసేందుకు మండల్ కమిషన్ నివేదిక 11 ప్రాతిపదికలను ఉపయోగిస్తే.. నిపుణుల బృందం 43 ప్రాతిపదికలను ఉపయోగించడం గమనార్హం. గురువారం జరిగిన సమావేశంలో ఈ నిపుణుల బృందం గణాంక పరమైన, డేటా పరమైన పనిని పూర్తి చేసిందని, సమష్టి వెనకబాటుతనం సూచిక (సీబీఐ) నిర్ధారణలపై సమగ్రంగా చర్చించిందని కన్వీనర్ తెలిపారు. త్వరలో ఈ నివేదిక తదుపరి దశను రూపొందించి, నెలరోజుల్లోనే నివేదికను సమర్పిస్తామని చెప్పారు. కాగా, కుటుంబాలకు సంబంధించి నిర్దిష్టమైన సమాచారాన్ని వెల్లడించకుండానే సామాజిక సర్వే డేటాను విశ్లేషించేందుకు వీలుగా కృత్రిమమేధను ఉపయోగించే నేచురల్ లాంగ్వేజ్ ఇంటర్‌ఫే్‌సను అందజేయాలని నిపుణుల బృందం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 23 , 2025 | 05:11 AM