CM Revanth Reddy: ధాన్యం మొత్తం కొంటాం
ABN, Publish Date - May 28 , 2025 | 04:03 AM
తెలంగాణలో రైతుల నుండి మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కల్తీ విత్తనాలు, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను ఆదేశించారు.
రైతులెవరూ ఆందోళన చెందవద్దు
కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లాలి
కల్తీలు, బ్లాక్‌మార్కెటింగ్‌పై ఉక్కుపాదం
జూన్ 3-20 వరకు 3వ దశ రెవెన్యూ సదస్సులు
ఇందిరమ్మ ఇళ్లకు సకాలంలో ఉచిత ఇసుక
ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
మంత్రులు రేపు, ఎల్లుండి జిల్లాల్లో పర్యటించాలి
ఈ అంశాలపై 1 నాటికి సమగ్ర నివేదికలివ్వాలి
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్
‘‘ఈ ఏడాది దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 2.75 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇది మన రైతులు సాధించిన విజయం. ఇందులో భాగస్వామ్యమైన వ్యవసాయ శాఖ, పౌర సరఫరా విభాగాల అధికారులకు అభినందనలు. కలెక్టర్లు ధాన్యం సేకరణను నిరంతరం పర్యవేక్షించాలి. అవసరమైతే స్థానికంగా గోదాములు అద్దెకు తీసుకోవాలి. ఎక్కడైనా మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బందిపెడితే కఠిన చర్యలు తీసుకోవాలి’’
- వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): యాసంగిలో రైతులు పండించిన ధాన్యం మొత్తాన్నీ కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ విషయంలో అన్నదాతలు ఆందోళనపడొద్దని సూచించారు. ఈ ఏడాది రుతుపవనాలు 15 రోజులు ముందుగానే రాష్ట్రంలోకి వచ్చాయని, దీనికి అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధాన్యం ేసకరణ, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, రుతుపవనాలు, వానాకాలం పంటల సాగు అంశాలపై సమీక్షించారు. ముందస్తు వానల కారణంగా సీజనల్ వ్యాధులు, జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖను సీఎం ఆదేశించారు. ఏజెన్సీ, అటవీ ప్రాంతాలున్న జిల్లాల కలెక్టర్లు ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
కేసులు పెట్టేందుకు వెనుకాడొద్దు..
‘‘గతంలో ఎన్నడూ లేనంత ధాన్యాన్ని ప్రభుత్వం ఈసారి యాసంగిలో కొనుగోలు చేసింది. గతేడాది 42 లక్షల టన్నులు కొంటే.. ఈసారి ఇప్పటికే 64.50 లక్షల టన్నులు కొనుగోలు చేశాం. రైతులకు 48 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తున్నాం. ఈ సీజన్లో ఇప్పటికే రూ.12,184 కోట్లు చెల్లించాం. ముందస్తు వానలతో అక్కడక్కడా ధాన్యం సేకరణకు ఆటంకం కలిగింది. సుమారు 4-5 లక్షల టన్నుల ధాన్యం రైతుల వద్ద ఉంది. ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి’’ అని కలెక్టర్లను సీఎం రేవంత్ ఆదేశించారు. 21 జిల్లాల్లో ధాన్యం సేకరణ విజయవంతంగా జరిగిందని, మరో 12 జిల్లాల్లో అక్కడక్కడా ఆందోళనలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళితే సమస్యలన్నీ అక్కడికక్కడే పరిష్కారమవుతాయని తెలిపారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు కొనుగోలు వివరాలను వెల్లడించాలని, వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలని ఆదేశించారు.
విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉండాలి..
ఈసారి వానాకాలం సీజన్ ముందుగానే వచ్చిందని, రాష్ట్రంలో ఇప్పటికే 29 శాతం అధిక వర్షపాతం నమోదైందని సీఎం చెప్పారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎరువులు, విత్తనాలు అవసరమైన మేర సిద్ధంగా ఉన్నాయా, లేదా అన్నది ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. నకిలీ విత్తనాలు, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. ఈ అంశంపై పర్యవేక్షణ కోసం ఇక ప్రత్యేక అధికారిని నియమించుకోవాలని సూచించారు.
జూన్ 3 నుంచి మూడో దశ రెవెన్యూ సదస్సులు..
పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న భూభారతిని త్వరలోనే రాష్ట్రమంతా అమలు చేస్తామని రేవంత్ తెలిపారు. భూభారతిని ప్రజలకు చేరువ చేయాలని, రైతుల సమస్యలకు పరిష్కారం సూచించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. జూన్ 3 నుంచి 20 వరకు రాష్ట్రమంతటా మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక కూపన్లు..
ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల తుది జాబితాలు సిద్ధం చేయాలని కలెక్టర్లను సీఎం రేవంత్ ఆదేశించారు. మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. తహసీల్దార్, ఎంపీడీవో, కార్మిక అధికారితోపాటు స్వయం సహాయక సంఘం సభ్యులతో ఈ కమిటీలను ఏర్పాటు చేయాలని.. మేస్త్రీల చార్జీలు, కంకర ధరలను కట్టడి చేేస బాధ్యతను ఈ కమిటీలు చేపడతాయని తెలిపారు. లబ్ధిదారులకు ఉచిత ఇసుక కూపన్లను సకాలంలో అందించాలని ఆదేశించారు. ఇటుకల తయారీ, సెంట్రింగ్ యూనిట్ల కోసం ఇందిరా మహిళా శక్తి, రాజీవ్ యువవికాసం ద్వారా రుణాలు ఇప్పించాలని సూచించారు.
ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం..
బుధ, గురువారాల్లో జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు ఆయా జిల్లాల్లో పర్యటించాలని సీఎం సూచించారు. ధాన్యం సేకరణ, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు ప్రణాళికపై కలెక్టర్లతో సమీక్షించాలని చెప్పారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. జూన్ 1 నాటికి ఈ అంశాలన్నింటితో పూర్తి నివేదికలను అందించాలని మంత్రులు, కలెక్టర్లకు సూచించారు.
వానలపై అప్రమత్తంగా ఉండండి
రాష్ట్రవ్యాప్తంగా వానలు పడుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, పోలీస్, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్‌ను ఆదేశించారు.
Updated Date - May 28 , 2025 | 04:05 AM