ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CSR Funds: ప్రైవేటుకు దీటుగా

ABN, Publish Date - Apr 21 , 2025 | 03:39 AM

తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలలను ప్రైవేటు స్థాయి సేవలతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎస్ఆర్‌ నిధులతో ఆస్పత్రుల సమగ్ర అభివృద్ధి, ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభం అనుకోబడింది.

  • ప్రభుత్వ ఆస్పత్రులు.. పాఠశాలల అభివృద్ధి

  • సీఎస్ఆర్‌ నిధులతో ఆస్పత్రులకు కొత్తకళ

  • జిల్లా దవాఖానాల్లో ఆన్‌లైన్‌ సేవలు

  • అందుబాటులో ఎమర్జెన్సీ వైద్యులు

  • ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ

  • ప్రత్యేక టీచర్ల నియామకం.. సౌకర్యాలు

  • రెండు శాఖల అధికారులతో బృందాలు

  • ఎయిమ్స్‌, చండీగఢ్‌ పీజీఐఎంఈఆర్‌

  • కేంద్రం, ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం

  • త్వరలో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్య, వైద్యం విషయంలో ప్రైవేటు దందా రోజురోజుకూ పెరిగిపోతోంది. పాఠశాలల ఫీజులు, ఆస్పత్రుల బిల్లుల విషయంలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో జనం ప్రైవేటుకు వెళ్లాల్సి వస్తోంది. దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు యాజమాన్యాలు ధనార్జనగా మార్చుకుంటున్నాయి. దీంతో ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా అభివృద్ధి చేయాలని సర్కారు భావిస్తోంది. తద్వారా సర్కారీలో ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని యోచిస్తోంది. ఇందుకోసం ఆయా శాఖల్లోని పలువురు అధికారులతో బృందాలను ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయా బృందాలు ఈ రెండు అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలు ఇవ్వాలని సర్కారు సూచించింది. ఈ మేరకు అధికారుల బృందాలు పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేయనున్నాయి.


ఆస్పత్రుల విషయంలో ఎయిమ్స్‌, చండీగఢ్‌లో ఉన్న పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, రీసెర్చ్‌ సెంటర్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలవుతున్న విధానాలను అధికారుల బృందం సేకరించనుంది. వైద్యఆరోగ్య శాఖలోని బృందం ఇప్పటికే కొన్ని వివరాలు సేకరించినట్లు, త్వరలోనే ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికలు సమర్పించనున్నట్లు తెలిసింది. మరోవైపు పాఠశాలల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ అధికారులు కేరళ సహా మరికొన్ని రాష్ట్రాల్లో పర్యటించి వివరాలు సేకరించనున్నారు.

సీఎస్ఆర్‌ నిధుల వినియోగంతో..

రాష్ట్రంలో వైద్యరంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వరంగల్‌తోపాటు హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌, ఎల్‌బీ నగర్‌, అల్వాల్‌లో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించింది. వీటిలో హైదరాబాద్‌లోని మూడు తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)లను కార్డియాక్‌, గ్యాస్ట్రో, న్యూరో విభాగాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటితోపాటు జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులను కూడా మరింతగా బలోపేతం చేయాలని భావిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆన్‌లైన్‌లో ఓపీ ఇస్తున్నారు. ఇకపై ఏ వ్యాధితో ఆస్పత్రికి వచ్చారు, పరీక్ష కోసం డాక్టర్‌ మళ్లీ ఎప్పుడు రమ్మన్నారు అనే వివరాలన్నింటినీ పొందుపర్చుతూ ప్రత్యేకంగా రశీదు కూడా ఇవ్వాలని భావిస్తున్నారు.


పేషంట్‌ మొబైల్‌ నంబరును ఆస్పత్రి కంప్యూటర్‌లో ఒక్కసారి నమోదు చేశాక.. మళ్లీ గడువులోపు సదరు పేషంట్‌ వచ్చి మొబైల్‌ నంబరు చెప్పగానే వారి వివరాలతో కూడిన రశీదును, సంబంధిత డాక్టర్‌ దగ్గరకు పంపించే విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. దీంతోపాటు ఇన్‌పేషంట్‌గా ఉన్నవారి వద్దకు వైద్యులు రోజులో ఒకటి, రెండుసార్లు వెళ్లి పరిశీలించేలా మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు. ఎమర్జన్సీ వైద్యులబృందాన్ని కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూడనున్నట్టు సమాచారం. ఆసుపత్రిలో శుభ్రతను పాటించేలా చూడనున్నారు. మొత్తంగా ప్రభుత్వ ఆస్పత్రులను చూడగానే ‘ప్రొఫెషనల్‌ అవుట్‌లుక్‌’వచ్చేలా తీర్చిదిద్దాలన్నది సర్కారు భావన. ఈ మొత్తం వ్యవహారాలకు ఖర్చు కోసం కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్‌) నిధులను సేకరించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం.


సర్కారులో ప్రీ ప్రైమరీ స్కూళ్లు..

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో భాగంగా.. ఆయా స్కూళ్లలో విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటికితోడు మరికొన్ని సేవలను అందుబాటులోకి తెస్తే పాఠశాలలు బలోపేతమయ్యే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్‌ సూచించింది. ఈ నేపథ్యంలో ప్రీ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. మహిళా శిశు సంక్షేమశాఖ పరిధిలోని అంగన్‌వాడీల్లోనూ ప్రీ ప్రైమరీని ప్రవేశపెట్టాలని ఆ శాఖ నిర్ణయించింది. ఇదే విధానాన్ని ప్రభుత్వపాఠశాలల్లోనూ ప్రవేశపెడితే బాగుంటుందన్న నిపుణుల సూచనమేరకు రాష్ట్ర వ్యాప్తంగా 990 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రీ ప్రైమరీల్లో 4వ ఏటనే పిల్లలను చేర్చుకోవడం, ప్లే స్కూల్‌ తరహాలో ఏర్పాట్లు చేయడం, ప్రత్యేకంగా టీచర్లను నియమించడం వంటి చర్యలు చేపట్టనుంది. ప్రీ ప్రైమరీలో చేరినవిద్యార్థి పదో తరగతి పూర్తయ్యేవరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకునేలా స్కూళ్లను తీర్చిదిద్దాలని సర్కారు భావిస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యా విధానంలో పలు కీలక మార్పులు చేపట్టనున్నట్టు తెలిసింది. ఇందుకోసం ఏయే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయనే దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.


Also Read:

క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడి.. యువకులు మృతి

థాకరే, రాజ్ మధ్య సయోధ్యపై బీజేపీ ఆసక్తికర వ్యాఖ్యలు

గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి

For More Telangana News and Telugu News..

Updated Date - Apr 21 , 2025 | 03:39 AM