ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BC Reservation: రాష్ట్రపతిని కలుద్దాం

ABN, Publish Date - Jul 29 , 2025 | 03:35 AM

బీసీ రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణను ఖరారు చేసింది.

బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రం మీద ఒత్తిడి పెంచుదాం.. మూడు రోజులు ఢిల్లీలోనే

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు తేదీలను ప్రకటిస్తోంది. కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి ద్వారా బిల్లులను ఆమోదింపజేయాలని కేంద్రాన్ని క్యాబినెట్‌ ముక్త కంఠంతో కోరుతోంది.

  • ఆగస్టు 5న పార్లమెంటులో వాయిదా తీర్మానాలు

  • 6న జంతర్‌ మంతర్‌ వద్ద ప్రజా ప్రతినిధుల ధర్నా

  • ఏడో తేదీన 200 మంది నాయకులతో రాష్ట్రపతి వద్దకు

  • బీసీ రిజర్వేషన్‌ బిల్లులను వెంటనే ఆమోదించాలని వినతి

  • కార్యాచరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

  • బీజేపీ బీసీ ఎంపీలూ బిల్లుల ఆమోదానికి సహకరించండి

  • అసెంబ్లీలో మద్దతిచ్చి.. ఢిల్లీలో మోకాలడ్డుతున్న బీజేపీ

  • ఆమోదించినప్పుడు పరిమితి గురించి తెలియదా!?

  • మీడియాతో మంత్రులు పొన్నం, వాకిటి, కొండా సురేఖ

  • ప్రతి బీసీ బిడ్డా ఢిల్లీకి తరలి రావాలని పిలుపు

హైదరాబాద్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణను ఖరారు చేసింది. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో చేపట్టాల్సిన కార్యాచరణకు ఆమోదం తెలిపింది. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఆగస్టు ఐదో తేదీన పార్టీ ఎంపీల ద్వారా పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇవ్వాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులందరితో ఆగస్టు 6న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని నిర్వహించి, జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే, ఆగస్టు ఏడో తేదీన ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా దాదాపు 200 మంది ప్రతినిధులతో రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోరుతూ వినతి పత్రం అందించాలని నిర్ణయించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది. ఇందుకు ముఖ్యమంత్రి సహా లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత, రాజ్యసభ పక్షనేత రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ కోరతారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో క్యాబినెట్‌ సమావేశం జరిగింది. నాలుగున్నర గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చర్చించారు.

అనంతరం మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరిలతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విలేకరులకు వివరాలు వెల్లడించారు. ‘‘రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుటుంబాలవారీగా సర్వే చేశాం. సర్వే నివేదికను సబ్‌ కమిటీ ద్వారా పరిశీలింపజేశాం. ఏడాదిలోపులోనే క్యాబినెట్‌ కూడా దానిని ఆమోదించింది. ఆ తర్వాత మార్చిలో.. స్థానిక సంస్థల్లో, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులను అన్ని పార్టీల సహకారంతో శాసనసభలో ఆమోదించాం. వాటిని మార్చి 22న గవర్నర్‌ ఆమోదం కోసం పంపాం. మార్చి 30న గవర్నర్‌ వాటిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. అదే సమయంలో, పంచాయతీరాజ్‌ చట్టంలో ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని తొలగిస్తూ ఈనెల 10న ఆర్డినెన్స్‌ను తయారు చేసి, 14న గవర్నర్‌కు పంపించాం. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతికి పంపినందున.. ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదించాల్సిందిగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాం. దీనిని కూడా ఆయన రాష్ట్రపతికి పంపించినట్లు మాకు సమాచారముంది. తప్పకుండా సానుకూల నిర్ణయం వస్తుందని వేచి చూస్తున్నాం’’ అని పొన్నం ప్రభాకర్‌ వివరించారు. అందుకే మూడు రోజులపాటు ఢిల్లీలో ఉండి, రాష్ట్రపతిని కలవాలని క్యాబినెట్‌లో నిర్ణయించామని తెలిపారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు, పార్టీకి చెందిన 100 మంది ఎంపీలం రాష్ట్రపతిని కలవాలనుకుంటున్నామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులందరం ఢిల్లీకి వెళుతున్నామని, బీసీ మేధావులు, బీసీ నాయకులు, కుల సంఘాల నాయకులందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. 42ు రిజర్వేషన్లు ఆశించే ప్రతి బీసీ బిడ్డా ఢిల్లీకి రావాలని విజ్ఞప్తి చేశారు.

బీజేపీ ఎంపీలూ.. సహకరించండి

‘‘స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు తేదీలను ప్రకటిస్తోంది. కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి ద్వారా బిల్లులను ఆమోదింపజేయాలని కేంద్రాన్ని క్యాబినెట్‌ ముక్త కంఠంతో కోరుతోంది. రాష్ట్రంలో అర్వింద్‌, బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌, కృష్ణయ్య, లక్ష్మణ్‌ వంటి ఐదుగురు బీజేపీ బీసీ ఎంపీలున్నారు. పాయల్‌ శంకర్‌ బీసీ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్రపతి వద్ద ఉన్న బిల్లులను ఆమోదింపజేసుకురమ్మని వీరందరినీ అడుగుతున్నాం’’ అని పొన్నం విజ్ఞప్తి చేశారు. కానీ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వంటివారు విమర్శిస్తున్నారని, వాటిని బీజేపీ బీసీ నేతలు ఖండిస్తారనుకున్నామని వ్యాఖ్యానించారు. 90 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో శాసన సభ, ఇతర వేదికలపై అందరికీ విజ్ఞప్తి చేశామని, కానీ.. రాజకీయ పార్టీలు అహేతుకంగా ఉంటున్నాయని, నిజాయితీగా వ్యవహరించడం లేదని తప్పుబట్టారు. శాసన సభలో బిల్లులకు ఆమోదం తెలిపి.. ఢిల్లీకి వెళ్లేసరికి మోకాలడ్డుతున్నాయని, కడుపులో కత్తులు పెట్టుకుని, అలుముకుని చంపాలని ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయంగా బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని, అయినా... కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ‘‘ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు. కిషన్‌ రెడ్డి స్థానంలో బీసీకి మంత్రి పదవి ఇవ్వాలని అంటున్నారు. కిషన్‌రెడ్డే మంత్రిగా ఉండాలి. కానీ.. బీసీ రిజర్వేషన్లకు మద్దతివ్వాలి. దీనికి ఆర్‌.కృష్ణయ్య నాయకత్వం వహించాలి. మీ పార్టీ ఎంపీలను ఒప్పించి, ఢిల్లీకి తీసుకురావాలి. మాకు భేషజాలు లేవు. మీ వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంకంటే బీసీ నాయకులపైనే ఎక్కువ బాధ్యత ఉందని, దీనికి సహకరించాలని పేరుపేరునా కోరుతున్నామని అన్నారు. ‘‘మేం అవివేకంగా 42 శాతం కావాలని అడగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా సర్వే చేసింది. విమర్శలు రాకుండా మరోసారి నమోదు చేసింది. క్యాబినెట్‌ చర్చించింది. అయితే, బిల్లులకు రాష్ట్రపతి వద్ద కాలయాపన జరుగుతోంది. వాటిని త్వరగా ఆమోదించాలని కోరుతున్నాం’’ అని వ్యాఖ్యానించారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల కల్పనతోనే 50 శాతం పరిమితి తొలగిపోయిందని, ప్రస్తుతం బీసీలకు 29 శాతం, ఎస్సీలకు 15, ఎస్టీలకు 10 ు, ఈడబ్ల్యూఎ్‌సలకు 10 ు చొప్పున మొత్తం 64ు రిజర్వేషన్లు నడుస్తున్నాయని వివరించారు.

అప్పుడు తెలియదా?

‘‘50 శాతం పరిమితి గురించి రాంచందర్‌రావు మాట్లాడుతున్నారు. కానీ, ఎంపిరికల్‌ డేటా ఉంటే.. రాష్ట్రాలు ముందుకు వెళ్లొచ్చని ఇందిరా సాహ్ని కేసులో స్పష్టంగా చెప్పారు’’ అని మంత్రి పొన్నం గుర్తు చేశారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని రాంచందర్‌రావు వంటివారు ఇప్పుడు మాట్లాడుతున్నారని, మరి, శాసన సభలో బిల్లులను ఆమోదించినప్పుడు ఆ విషయం బీజేపీ నాయకులకు తెలియదా? అని నిలదీశారు. అసెంబ్లీలో మద్దతు ఇచ్చినందుకు రాంచందర్‌రావు అయినా బీజేపీ ఎమ్మెల్యేలైనా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీ సీఎం అంటూ ప్రకటించారని, శాసనసభాపక్ష నేత పదవిని బీసీకి ఇవ్వలేదని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నేత ఉంటే తొలగించారని తప్పుబట్టారు. కిషన్‌ రెడ్డిని రాజీనామా చేయాలని అడగడం లేదని, రిజర్వేషన్లకు మద్దతివ్వాలని కోరుతున్నామని అన్నారు.

క్యాబినెట్‌ తీసుకున్న ఇతర నిర్ణయాలు

  • రవాణా శాఖకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టులను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సరిహద్దుల్లో మొత్తం 15 చెక్‌ పోస్టులు ఉన్నాయి. జాతీయ రహదారులపై రవాణాకు ఇబ్బంది లేకుండా వాటిని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఇకపై సిబ్బందితో కాకుండా వాహన్‌, అడ్వాన్స్‌డ్‌ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్‌ కొనసాగుతుంది.

  • కోర్‌ తెలంగాణ అర్బన్‌ సిటీ ఏరియాతోపాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. మైక్రో బ్రూవరీస్‌ చట్టానికి పలు సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

బీసీలకు కేసీఆర్‌ ద్రోహం చేశారు

గతంలో పదేళ్లు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ బీసీలకు తీరని ద్రోహం చేశారని క్యాబినెట్‌ ఆక్షేపించింది. ‘‘అన్ని సామాజిక వర్గాల రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటకూడదని 2018లో పంచాయతీరాజ్‌ చట్టంలో ప్రత్యేక నిబంధనను పొందుపర్చారు. కేసీఆర్‌ తెచ్చిన ఈ చట్టం బీసీల రిజర్వేషన్ల పెంపునకు ప్రధాన అడ్డంకిగా మారింది. కేసీఆర్‌ బీసీలకు చేసిన ద్రోహాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. జూలై 10న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఆ చట్టాన్ని సవరించాలని నిర్ణయం తీసుకుంది. చట్ట సవరణ చేస్తూ ఆర్డినెన్సు తీసుకురావాలని తీర్మానించింది. చట్టంలో ఉన్న 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్‌ నిబంధనను ఎత్తివేసేలా సవరణ ఆర్డినెన్స్‌ ఫైలును ఈనెల 14న గవర్నర్‌కు పంపింది. గవర్నర్‌ దీనిని రాష్ట్రపతి పరిశీలనకు పంపించినట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. అందుకే, రెండు బిల్లులు, ఆర్డినెన్సును వెంటనే ఆమోదించాలని రాష్ట్రపతికి క్యాబినెట్‌ విజ్ఞప్తి చేస్తోంది’’ అని ప్రభుత్వం ఓ ప్రకటనలో వివరించింది. కాగా, వ్యక్తిగత కారణాలతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమావేశానికి హాజరు కాలేదు.

ఇవి కూడా చదవండి..

కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 03:35 AM