ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Yellow Alert: మరో 4 రోజులు వానలు

ABN, Publish Date - May 22 , 2025 | 04:45 AM

రాష్ట్రంలో మరో 4 రోజులు వానలు కొనసాగనున్నాయి. ఎల్లో అలర్ట్ జారీ చేసి, పిడుగుపాటుకు నలుగురు మరణించారు.

  • నేడు 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

  • అరేబియా సముద్రంలో అల్పపీడనం

  • వాయుగుండంగా మారే అవకాశం

  • హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి

  • వర్షాలపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్‌

  • బుధవారం విస్తారంగా వానలు.. పిడుగుపాటుకు నలుగురు బలి

హైదరాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌): రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. బుధవారం పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యాయి. కొన్ని పట్టణాల్లో కాలనీలు నీట మునిగాయి. రోడ్లు జలమయం అయ్యాయి. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలుల ధాటికి చెట్లు కూలిపడ్డాయి. ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. మరోవైపు అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది ఉత్తర దిక్కులో కదులుతూ క్రమేపీ బలపడి వాయుగుండంగా మారుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు పడతాయని వెల్లడించింది. గురువారం కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. గంటకు 40-50 కి.మీ.వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మిగతా అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలోని 612 మండలాలకుగాను 306 మండలాల్లో వర్షం కురిసినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో 8.6, నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లిలో 7.6, కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో 7.2, బాన్స్‌వాడలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు బుధవారం కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కనిపించింది. నల్గొండ జిల్లా దేవరకొండలో అత్యధికంగా 43.6, నిర్మల్‌ జిల్లా పెంబిలో 41.1, ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ టీలో 40.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణం అనుకూలంగా ఉండటంతో.. నైరుతి రుతుపవనాలు వేగంగా పురోగమిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.


రాష్ట్రవ్యాప్తంగా వానలు..

ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా బుధవారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అనుముల మండలంలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. నార్కట్‌పల్లిలో గాలివాన ధాటికి ట్రాన్స్‌ఫార్మర్‌ దిమ్మె కూలిపడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కోదాడ, హుజూర్‌నగర్‌లోని పలు ఇళ్లలో విద్యుత్‌ పరికరాలు కాలిపోయాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. లోతట్టు కాలనీలు, రహదారులు జలమయం అయ్యాయి. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి ఆ కాలనీలను సందర్శించారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లో భారీ వర్షం పడింది. గాలి దుమారానికి మేడారం- తాడ్వాయి రోడ్డులో చెట్టు విరిగిపడింది. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో భారీ వర్షంతో ప్యాలవరం వాగు పొంగిపొర్లింది. నారాయణఖేడ్‌ మండలంలో ఈదురుగాలి దాటికి పలు ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని పలు ఇళ్ల పైకప్పులు కూలిపడ్డాయి. నిజామాబాద్‌ జిల్లా నవీపేట, మోపాల్‌ మండలాల్లో చెట్లు విరిగిపడ్డాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలో బొబ్బిలి వాగు ఉప్పొంగింది.

హైదరాబాద్‌లో కుండపోత

హైదరాబాద్‌లో బుధవారం రాత్రి కుండపోత కురిసింది. బండ్లగూడ, సైదాబాద్‌, అస్మాన్‌ఘడ్‌, అంబర్‌పేట, మలక్‌పేట, సరూర్‌నగర్‌, ఉప్పల్‌, హిమాయత్‌నగర్‌, సైదాబాద్‌, చార్మినార్‌, ముషీరాబాద్‌ ప్రాంతాల్లో లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. ముసారాం బ్రిడ్జిని వరద నీరు ముంచేయడంతో ట్రాఫిక్‌ను మళ్లించారు. మలక్‌పేట రైల్వే బ్రిడ్జి వద్ద నీరు నిలవడంతో గంటకుపైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కోఠి, చాదర్‌ఘట్‌, ఎల్‌బీనగర్‌ ప్రధాన రహదారిలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. రాత్రి 11 గంటల వరకు అత్యధికంగా బండ్లగూడలో 8.8 సెం.మీ, మలక్‌పేట 8.5, ఆస్మాన్‌ఘడ్‌లో 8.3, అంబర్‌పేటలో 8.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది.


పిడుగుపాటుకు నలుగురు బలి

పిడుగుపాటు కారణంగా బుధవారం రాష్ట్రవాప్తంగా నలుగురు బలయ్యారు. నల్లగొండ జిల్లా అప్పాజీపేటలో నిమ్మతోటలో పనిచేస్తున్న మహిళారైతు భిక్షమమ్మ(46), మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయిలో గొర్రెల కాపరి ఏశబోయిన చేరాలు (55), ఇదే జిల్లా గూడూరు మండలం గుండెంగలో మైదం ప్రవీణ్‌కుమార్‌ (27), వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం మియాపూర్‌లో గొర్రెల కాపరి గోపాల బాలరాజు (20) పిడుగుపాటుకు గురై మృతి చెందారు.

అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్‌

రాష్ట్రవ్యాప్తంగా వానలు పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన చర్యలు చేపట్టాలని.. కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్‌లో రోడ్లపై వాన నీరు నిలవకుండా చూడాలని ట్రాఫిక్‌ ఇబ్బందులు, విద్యుత్‌ సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, పోలీసుశాఖ, హైడ్రా, ట్రాఫిక్‌, విద్యుత్‌ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్‌ రామకృష్ణారావును ఆదేశించారు.

ఉత్తమ్‌ హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌

ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో వాతావరణం అనుకూలించకపోవడంతో.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని మేళ్లచెర్వుకు వెళ్లారు.


  • అప్రమత్తంగా ఉండండి

  • కలెక్టర్లకు విపత్తుల నిర్వహణ శాఖ

  • స్పెషల్‌ సీఎస్‌ అర్వింద్‌కుమార్‌ ఆదేశం

నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే వస్తాయని, రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసిన నేపథ్యంలో ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసింది. ఎలాంటి విపత్తులు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సారి ముందస్తుగానే 12 రాష్ట్ర విపత్తు సహాయక (ఎస్డీఆర్‌ఎఫ్‌) బృందాలను సిద్ధం చేశామని.. ఒక్కో బృందంలో తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌కు చెందిన 100 మంది సుశిక్షితులైన పోలీసులు ఉంటారని వివరించారు. ఆ బృందాలను రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచామని, వాటి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా మూడు ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలను సిద్ధం చేశామని.. భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో ఈసారి ప్రత్యేకంగా అదనపు ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలను ఏర్పాటు చేయాలని ఎన్‌డీఆర్‌ఎఫ్ ఉన్నతాధికారులను కోరామని వివరించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని అన్ని ఫైర్‌స్టేషన్లలో అగ్నిమాపక సిబ్బందికి ప్రత్యేకంగా విపత్తుల నిర్వహణ చర్యలపై శిక్షణ ఇప్పించామన్నారు. హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల విషయంలో తక్షణమే స్పందించేలా హైడ్రా బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కలెక్టర్లు అన్ని విభాగాలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.

Updated Date - May 22 , 2025 | 04:50 AM