Supreme Court: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజనకు సుప్రీం తిరస్కృతి
ABN, Publish Date - Jul 26 , 2025 | 04:44 AM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
అసెంబ్లీ సీట్లు పెంచాలన్న పిటిషన్ కొట్టివేత
తెలుగు రాష్ట్రాల్ని కశ్మీర్‌తో పోల్చలేమని వెల్లడి
న్యూఢిల్లీ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2022లో పునర్విభజన జరిగిన జమ్ము కశ్మీర్‌తో సమానంగా ఏపీ, తెలంగాణను పరిగణించాలంటూ కె.పురుషోత్తమ్‌రెడ్డి చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ మూడో అధ్యాయం కిందకు జమ్ము కశ్మీర్ రాదని, ఆ రాష్ట్రంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను పోల్చలేమని న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్‌సింగ్ అభిప్రాయపడ్డారు. ఏపీ, తెలంగాణలో పునర్విభజన చేపడితే.. మిగిలిన అన్ని రాష్ట్రాల నుంచీ అవే డిమాండ్లు వస్తాయన్నారు.
2014 ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచాలని పిటిషనర్ కోర్టు తలుపు తట్టారు. అయితే.. రాజ్యాంగంలోని 170వ అధికరణకు లోబడి పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26ను అమలు చేస్తామని చెప్పిన విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేసింది. 2026 తర్వాత చేపట్టే తొలి జనగణన జరిగేంత వరకూ అసెంబ్లీల సీట్ల సర్దుబాటు చేయాల్సిన అవసరం లేదని 170(3) స్పష్టం చేస్తోందని పేర్కొంది. విస్తృత రాజ్యాంగ ప్రణాళిక ప్రకారమే పునర్విభజన తప్పనిసరిగా చేపట్టాల్సి ఉంటుందని తెలిపింది. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ము కశ్మీర్‌కు ఆర్టికల్ 170 వర్తించదని, 239(ఏ) వర్తిస్తుందని వివరించింది. ఈ రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్ చట్టాలు చేయాల్సి ఉందని గుర్తు చేసింది. ఏపీ, తెలంగాణలో పునర్విభజన చట్టానికి అనుగుణంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచాలన్న అభ్యర్థన న్యాయ సమ్మతమే అయినా.. రాజ్యాంగ ప్రణాళికకు అనుగుణంగానే ఈ విభజన జరగాల్సి ఉంటుందన్న కేంద్ర ప్రభుత్వ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. రాజ్యాంగ సూత్రాలకు భిన్నంగా విభజన చట్టాన్ని పరిగణించలేమని స్పష్టం చేసింది.
2026 ఎంతో దూరంలో లేదు: వినోద్‌కుమార్
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26ను సవరించి ‘సబ్జెక్ట్ టు’ అనే పదానికి బదులుగా ‘నాట్‌విత్ స్టాండింగ్’ అన్న పదాలు చేర్చి ఉంటే ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు ఎప్పుడో పెరిగి ఉండేవని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. అయినా 2026 ఎంతో దూరంలో లేదని, నియోజకవర్గాల పునర్విభజన జరిగిన వెంటనే ఏపీ, తెలంగాణలో సీట్లు పెరుగుతాయని తెలిపారు. కేంద్రం విభజన చట్టాన్ని సవరించేందుకు మొగ్గు చూపకపోవడం వల్లనే ఈ ఆలస్యం జరిగిందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..
బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..
For Telangana News And Telugu News
Updated Date - Jul 26 , 2025 | 04:44 AM