Supreme Court: 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై ఒకేసారి వాదనలు వింటాం!
ABN, Publish Date - Feb 04 , 2025 | 05:02 AM
పార్టీ ఫిరాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది.
బీఆర్‌ఎస్ శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపులపై సుప్రీం స్పష్టీకరణ
ఏడుగురిపై చర్యలు కోరుతూ కేటీఆర్ పిటిషన్
ముగ్గురిపై అనర్హత వేయాలంటూ మరొకటి..
రెండింటినీ కలిపి విచారిస్తామన్న కోర్టు విచారణ 10కి వాయిదా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. అదే పార్టీకి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుతో కలిపి ఈ నెల 10న విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున కారు గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచిన పోచారం శ్రీనివా్‌సరెడ్డి, ఎం.సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరెకపూడి గాంధీలపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత నెల 15న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.
కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతుండగా.. మరో ముగ్గురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ఈ నెల 10న విచారణకు రానుందని, దాంతో కలిపి దీన్ని కూడా విచారిస్తామని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. కాగా, బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గత నెల 15న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు (ఎస్‌ఎల్పీ) దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై గత నెల 31న విచారణ జరిపిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం కేసును ఈ నెల 10కి వాయిదా వేసింది. అదే రోజున 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించిన వాదనలను సుప్రీంకోర్టు విననుంది.
ఇవి కూడా చదవండి..
KTR: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. వేటు తప్పదా..
Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు
Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Feb 04 , 2025 | 05:02 AM