ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Phone Tapping Case: నేడు సిట్‌ ఎదుటకు పీసీసీ చీఫ్‌

ABN, Publish Date - Jun 17 , 2025 | 05:22 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణను వేగవంతం చేసింది. దాదాపు 600 మంది ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితులు ఉన్నట్లు ఇప్పటికే తేలటంతో, వారి నుంచి సిట్‌ అధికారులు వాంగ్మూలాలు సేకరిస్తున్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో వాంగ్మూలం.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్‌ ట్యాప్‌ అయ్యిందని మహేశ్‌ ఆరోపణ

  • వివరాలు తెలియజేయాలని సిట్‌ నోటీసు

  • వాంగ్మూలం ఇవ్వనున్న కాంగ్రెస్‌ నేత

  • సిట్‌ విచారణకు హాజరైన మహిపాల్‌రెడ్డి

  • గత ప్రభుత్వం 8 నెలల పాటు తన ఫోన్‌ను ట్యాపింగ్‌ చేయించిందని వెల్లడి

  • నేడు విచారణకు ప్రభాకర్‌రావు, సరిత

హైదరాబాద్‌, వికారాబాద్‌, గద్వాల, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణను వేగవంతం చేసింది. దాదాపు 600 మంది ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితులు ఉన్నట్లు ఇప్పటికే తేలటంతో, వారి నుంచి సిట్‌ అధికారులు వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. దీంట్లో భాగంగానే టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ నుంచి వాంగ్మూలం సేకరించేందుకు సిట్‌ సిద్ధమైంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్‌ ట్యాపింగ్‌ అయినట్లు మహేశ్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే, తమ ఎదుట విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా సిట్‌ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో మంగళవారం జూబ్లీహిల్స్‌లోని సిట్‌ కార్యాలయానికి మహేశ్‌కుమార్‌ వెళ్లనున్నారు. కాగా, బాధితుల నుంచి వాంగ్మూలాల సేకరణలో భాగంగా వికారాబాద్‌కు చెందిన ఉమ్మడి రంగారెడ్డి జడ్పీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు పట్లోళ్ల మహిపాల్‌ రెడ్డిని సిట్‌ అధికారులు సోమవారం 45 నిమిషాలపాటు విచారించారు. తొలుత ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు ఎస్సైలు ప్రాథమికంగా ప్రశ్నించి వివరాలు సేకరించగా, ఆ తర్వాత ఏసీపీ వెంకటగిరి సుమారు అరగంటపాటు విచారించారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ పట్నం మహేంద్‌ రెడ్డి, అప్పటి పీసీసీ చీఫ్‌, ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డితో తరచూ మాట్లాడిన కాల్‌ డేటాను ఆయన ముందు ఉంచి ప్రశ్నించారు. ఆయా సమయాల్లో వారితో మాట్లాడింది వాస్తవమేనని మహిపాల్‌ రెడ్డి అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. ఎన్నికల ముందు ఒక ఫోన్‌ నెంబరు ఉపయోగిస్తూ, మరో ఫోన్‌లో వాట్సాప్‌ ఎందుకు వాడాల్సి వచ్చిందని సిట్‌ బృందం ప్రశ్నించగా... అప్పటికే తన ఫోన్‌ ట్యాపింగ్‌ అవుతున్నట్లు సందేహం కలగటంతో భద్రతా కారణాల రీత్యా అలా చేశానని మహిపాల్‌ రెడ్డి సిట్‌ తెలిపినట్లు సమాచారం.

నేడు మరోసారి ప్రభాకర్‌రావు విచారణ

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు మంగళవారం మరోసారి సిట్‌ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. బుధవారం ప్రణీత్‌ రావును సిట్‌ విచారించనుంది. ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైన వారి జాబితాలో ఉన్న గద్వాల జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇంచార్జి సరితను కూడా వాంగ్మూలం ఇవ్వటానికి మంగళవారం తమ ఎదుట హాజరుకావాలని సిట్‌ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు, సిట్‌ ఎదుట హాజరుకానున్నట్లు సరిత తెలిపారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితుడు విష్ణువర్దన్‌రెడ్డి స్టేట్‌మెంట్‌

2023 నవంబర్‌ 15 నుంచి 30వ తేదీ వరకు కొనసాగిన ఫోన్‌ ట్యాపింగ్‌ జాబితా బాధితుల్లో నాటి ఎన్నికల్లో షాద్‌నగర్‌ నుంచి పోటీ చేసిన పాలమూరు విష్ణువర్దన్‌రెడ్డి పేరు ఉంది. ఈ నేపథ్యంలో స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని పోలీసులు కోరడంతో ఆయన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. ఎన్నికల ప్రచారంలో ఆయనపై జరిగిన దాడులు, కేసులపై ప్రశ్నించి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ తేదీలకు, జరిగిన దాడుల కేసులకు సరిపోతుందని విష్ణువర్దన్‌రెడ్డి వెల్లడించారు.

కోర్టులో సాక్ష్యం చెబుతా: మహిపాల్‌ రెడ్డి

సిట్‌ అధికారుల ఎదుట వాంగ్మూలం ఇచ్చి వెళ్తున్న సమయంలో మహిపాల్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వం 8 నెలలపాటు నా ఫోన్‌ ట్యాప్‌ చేసింది. ఎన్నికల సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 14 మంది ఎమ్మెల్యేల ప్రచారాన్ని నేను పర్యవేక్షించా. నా ఫోన్‌ ట్యాప్‌ చేసి నన్ను ఇబ్బందులు పెట్టారు. నా ఫోన్‌లో ఉన్న నంబర్ల ఆధారంగా ఎంతో మంది ఫోన్లు ట్యాప్‌ చేశారు. నా వాహనం వెంట నెంబర్‌ప్లేట్‌ లేని పోలీస్‌ వాహనంలో నిరంతరం పోలీసులు తిరిగేవాళ్లు. అప్పటి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. తప్పు చేసిన వారిని వదలొద్దు. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతానని సిట్‌ అధికారులకు చెప్పాను’ అని తెలియజేశారు.

Updated Date - Jun 17 , 2025 | 05:22 AM