Nizamabad: రూ.40.5 లక్షలతో పరారైన సెక్యూరిటీ ఉద్యోగి
ABN, Publish Date - Jun 15 , 2025 | 04:40 AM
బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో నగదును జమచేసే ఓ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసే ఓ ఉద్యోగి ఆ డబ్బును ఏటీఎంలలో జమచేయకుండా అక్షరాల నలభై లక్షల యాభైవేల రూపాయలతో పరారయ్యాడు.
నిజామాబాద్ అర్బన్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో నగదును జమచేసే ఓ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసే ఓ ఉద్యోగి ఆ డబ్బును ఏటీఎంలలో జమచేయకుండా అక్షరాల నలభై లక్షల యాభైవేల రూపాయలతో పరారయ్యాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం జరిగింది. నగరంలోని న్యాల్కల్ రోడ్డులో నివాసం ఉండే రమాకాంత్ స్థానిక ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో ఉన్న ఈటాచీ అనే ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
రోజూ ఏటీఎంలలో నగదు జమ చేయడానికి వెళ్లే రమాకాంత్ శనివారం కూడా ఆఫీస్ నుంచి నగదును వాహనంలో తీసుకువెళ్లాడు. ఆ మొత్తాన్ని ఏటీఎంలలో జమచేయకుండా మొత్తం రూ.40,50,000 నగదుతో పరారైనట్లు ఏజెన్సీ మేనేజర్ 4వ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
Updated Date - Jun 15 , 2025 | 04:40 AM