ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: రేవంత్‌ కౌంటర్‌ అటాక్‌!

ABN, Publish Date - Jun 12 , 2025 | 03:31 AM

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్‌ఎ్‌సపై సీఎం రేవంత్‌రెడ్డి ఎదురుదాడికి సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం, బ్యారేజీల వైఫల్యంపై బీఆర్‌ఎస్‌ చేస్తున్న వాదనేంటి? అసలు వాస్తవాలేంటి? అన్నది ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించుకున్నారు.

కాళేశ్వరంపై నేడో, రేపో ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్‌.. బీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని నిర్ణయం

  • కేసీఆర్‌, హరీశ్‌కు బదులివ్వనున్న సీఎం

  • పీపీటీ రూపంలోనే సమాధానం

  • పత్రాలన్నీ సిద్ధం చేస్తున్న అధికారులు

హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్‌ఎ్‌సపై సీఎం రేవంత్‌రెడ్డి ఎదురుదాడికి సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం, బ్యారేజీల వైఫల్యంపై బీఆర్‌ఎస్‌ చేస్తున్న వాదనేంటి? అసలు వాస్తవాలేంటి? అన్నది ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించుకున్నారు. కాళేశ్వరం కమిషన్‌ ముందు మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ వినిపించిన వాదనలు, చేసిన ప్రకటనలు, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపంలో చేస్తున్న ప్రచారానికి కౌంటర్‌ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఈ మేరకు గురువారం లేదా శుక్రవారం నాడు రేవంత్‌ కూడా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ఇందుకోసం బీఆర్‌ఎస్‌ ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను నీటిపారుదల శాఖ అధికారులకు పంపించిన ప్రభుత్వం.. అంశాల వారీగా కౌంటర్‌ ఇవ్వడానికి వీలుగా తగిన పత్రాలను సేకరించింది. మరోవైపు బీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రచారానికి వ్యతిరేకంగా రెండు కీలకమైన ఆధారాలు గత రెండు రోజుల్లో వెలుగులోకి వచ్చాయి. ప్రాజెక్టుల రీఇంజనీరింగ్‌ నిర్ణయం మంత్రివర్గ ఉపసంఘం తీసుకుందని కమిషన్‌ ముందు పలువురు సాక్ష్యం ఇవ్వగా.. వాస్తవం మరో విధంగా ఉంది. మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించాకే కాళేశ్వరం బ్యారేజీలపై, ప్రాజెక్టుల రీఇంజనీరింగ్‌పై నిర్ణయం తీసుకున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు చెబుతుండగా.. మంత్రివర్గ ఉపసంఘానికి, కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధం లేదని తేలింది.

సబ్‌కమిటీ కన్నా ముందే బ్యారేజీకి నిర్ణయం..

ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి రూ.2591 కోట్లతో పరిపాలన పరమైన అనుమతినివ్వాలని అప్పటి ఈఎన్‌సీ(ఇరిగేషన్‌) సి.మురళీధర్‌ 2016 ఫిబ్రవరి 18న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీకి పరిపాలనపరమైన అనుమతినిస్తూ 2016 మార్చి 1న జీవో నెం.231 జారీ చేసింది. అయితే ప్రాజెక్టుల రీఇంజనీరింగ్‌పై మేడిగడ్డకు అనుమతినిస్తూ జీవో విడుదలైన 14 రోజుల తర్వాత మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి 2016 మార్చి 15న జీవో నెం.655 జారీ అయింది. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చైర్మన్‌గా, మంత్రులు ఈటల రాజేందర్‌, తుమ్మల నాగేశ్వరరావును సభ్యులుగా నియమిస్తూ జీవో ఇచ్చారు. అయితే మంత్రుల సబ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకే మేడిగడ్డ నిర్మాణం జరిగిందని, కాళేశ్వరం నిర్మాణాన్ని క్యాబినెట్‌ ఆమోదించిందని కేసీఆర్‌, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌.. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. దీనిని నాటి సబ్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్న ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. మంత్రుల సబ్‌ కమిటీకి, మేడిగడ్డ నిర్మాణానికి సంబంధమే లేదన్నారు.

కోరినట్లుగా నివేదిక ఇచ్చేందుకే వ్యాప్కోస్‌..!

కేంద్ర జలవ నరుల సంఘం(సీడబ్ల్యూసీ) లేఖలతోపాటు వ్యాప్కోస్‌ నివేదిక తర్వాతే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం చేపట్టినట్లు కమిషన్‌ ఎదుట కేసీఆర్‌, హరీశ్‌రావు వాంగ్మూలం ఇచ్చారు. కానీ, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో ‘బ్యారేజీలు కట్టడానికి అనుగుణంగా’ నివేదిక ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం వ్యాప్కో్‌సకు పని అప్పగించినట్లు పత్రాలు వెల్లడయ్యాయి. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించేందుకు అవసరమైన డీపీఆర్‌ తయారీ బాధ్యతల్ని వ్యాప్కో్‌సకు అప్పగించడానికి అనుమతి కోరుతూ 2015 ఏప్రిల్‌ 2న నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శికి చీఫ్‌ ఇంజనీర్‌ లేఖ రాశారు. ఈ మేరకు ఆ బాధ్యతలను వ్యాప్కో్‌సకు అప్పగిస్తూ ప్రభుత్వం 2015 ఏప్రిల్‌ 13న ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో బ్యారేజీల నిర్మాణం కోసం ముందే నిర్ణయాలు తీసుకొని, ఆ ప్రాంతంలోనే బ్యారేజీలు కట్టడానికి అనువుగా డీపీఆర్‌ ఇవ్వాలని వ్యాప్కో్‌సను ప్రభుత్వం కోరినట్లు తేలింది. ఇదే అంశాన్ని బట్టబయలు చేసే యోచనలో సీఎం రేవంత్‌ ఉన్నారు. పైగా, కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలపై నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం వేసిన హైపవర్‌ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా వ్యాప్కోస్‌ సీఎండీ రజిందర్‌ గుప్తా ఉన్నట్లు వెల్లడైంది. 2023 మే 3న ఆయన నివాసంలో సీబీఐ దాడులు చేసి రూ.38కోట్లను జప్తు చేసింది. ఈ నగదు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సమర్థన ఇచ్చినందుకు, ఆ ప్రాజెక్టులోని బ్యారేజీలకు అనుగుణంగా నివేదిక ఇచ్చినందుకు ప్రతిఫలంగా పొందినదేనని తర్వాత తేలింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టికి అనుకూలంగా డీపీఆర్‌ ఇచ్చిన వ్యాప్కోస్‌.. ఆ తర్వాత మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు అనుకూలంగా డీపీఆర్‌ ఇవ్వ డం ఆ సంస్థ ప్రత్యేకత అని ప్రభుత్వం గుర్తించింది.

లోపాలను ఎత్తిచూపిన ఎన్‌డీఎ్‌సఏ..

జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) కూడా కాళేశ్వరం బ్యారేజీల లోపాలను ఎత్తిచూపింది. మేడిగడ్డ వైఫల్యానికి, కుంగుబాటుకు.. కారణాలనూ గుర్తించింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం 2019లో పూర్తికాగా.. తొలి వరదలకే ఆ బ్యారేజీతోపాటు అన్నారం, సుందిళ్ల దిగువ భాగంలోనూ రక్షణ వ్యవస్థలన్నీ కొట్టుకుపోయాయి. ఇందుకు తగిన కారణాలు అన్వేషించి డిజైన్లు ఇస్తే వాటికి తగ్గట్లుగా పనులు చేస్తామని మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ కోరినప్పటికీ ఐదేళ్లపాటు గత ప్రభుత్వం స్పందించలేదని వెల్లడైంది. ఎల్‌ అండ్‌ టీ లేఖలు కూడా దీనికి సాక్ష్యాలుగా ప్రభుత్వం సేకరించింది. మరోవైపు అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణ స్థలాలను తగిన భూభౌతిక/భూసాంకేతిక పరీక్షలు చేయకుండానే ఎంపిక చేసి నిర్మించారని ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీ తేల్చింది. ఇక మేడిగడ్డ నిర్మాణంలో కాంక్రీట్‌ వినియోగం అడ్డదిడ్డంగా జరిగిందని, కాంక్రీట్‌ నుంచి ఉద్భవించే వేడిని చల్లార్చడానికి క్యూరింగ్‌ విధానం చేపట్టలేదని, దీనికి సంబంధించిన ఏ సాక్ష్యాలు లేవని గుర్తించారు.

ఐదేళ్లలో ఎత్తిపోసిన నీళ్లు 162 టీఎంసీలే..

కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ గుండెకాయ అని తొలుత చెప్పిన బీఆర్‌ఎస్‌.. ఆ తర్వాత కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలే కాదని, రిజర్వాయర్లు, టన్నెల్‌లు అంటూ ప్రచారం చేస్తోంది. ‘మేడిగడ్డ మాత్రమే గుండెకాయ’ అని గత ప్రభుత్వం పలు సందర్భాల్లో అన్న మాటలను ఎత్తిచూపేందుకు సీఎం రేవంత్‌ సిద్ధమవుతున్నారు. బ్యారేజీల వైఫల్యానికి మరో కారణం.. నీటి నిల్వ కాగా, ‘‘బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసి, వంద కిలోమీటర్లు గోదావరిని సజీవంగా చేసిన అపర భగీరథుడు కేసీఆర్‌’’ అని ప్రచురించిన కథనాలను కూడా రేవంత్‌ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా బీఆర్‌ఎస్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రె డ్డి వ్యాఖ్యలను కూడా ప్రస్తావించిన విషయం విదితమే. దీనికి కౌంటర్‌గా కాళేశ్వరం బ్యారేజీలపై బీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని ప్రభుత్వం తిప్పికొట్టనుంది. ఇక మేడిగడ్డ 2019లో పూర్తికాగా.. ఆ బ్యారేజీ నుంచి 2019-20లో 61 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. అనంతరం 2020-21లో 31.82 టీఎంసీలు, 2021-22లో 33 టీఎంసీలు, 2022-23లో 25.97 టీఎంసీలు, 2023-24లో 8.93 టీఎంసీల చొప్పున ఇప్పటివరకు మొత్తం 162 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. అయితే ఎత్తిపోసిన వెంటనే వరదలు రావడంతో 63 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలారు. దీంతో ఐదేళ్లలో 99 టీఎంసీలతో 22 లక్షల ఎకరాలకు నీళ్లు ఎలా ఇచ్చారని ప్రభుత్వం ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్‌ జంట నగరాలకు తాగునీరు అందించడానికి మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌లే దిక్కు అని బీఆర్‌ఎస్‌ చెబుతోంది. అయితే 2014 నాటికే గోదావరి నుంచి హైదరాబాద్‌కు తాగునీటిని అందించే పనులు దాదాపుగా పూర్తయ్యాయని, ఇవే నీటిని మిషన్‌ భగీరథలో చూపించి.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసింది వాస్తవమా? కాదా? అని ప్రభుత్వం నిలదీసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

రాజీవ్‌ యువ వికాసం మరింత జాప్యం

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల కల సాకారమయ్యేనా

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 12 , 2025 | 03:32 AM