Hyderabad: మోదీ సేవలు ఇంకొన్నాళ్లు అవసరం
ABN, Publish Date - Jul 21 , 2025 | 04:07 AM
దేశం కోసం ప్రధాని మోదీ ఎంతో శ్రమిస్తున్నారని, ఆయన సేవలు మరికొన్నాళ్లు అవసరమని బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు.
ఆయన ప్రపంచంలోనే అత్యుత్తమ నేత
ఏఐతో మహిళల కొలువులకు ముప్పు
బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): దేశం కోసం ప్రధాని మోదీ ఎంతో శ్రమిస్తున్నారని, ఆయన సేవలు మరికొన్నాళ్లు అవసరమని బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. భారత్ విశ్వగురుగా, బ్రాండ్ భారత్‌గా ఎదగాలంటే ఇంకా ఎంతో చేయాల్సింది ఉందని వ్యాఖ్యానించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దూరదృష్టి ఉండాలని, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన అడుగులు ఉండాలని అభిప్రాయపడ్డారు. రాంమాధవ్ రచించిన ‘ది న్యూ వరల్డ్- ట్వంటీ ఫస్ట్ సెంచరీ గ్లోబల్ ఆర్డర్ అండ్ ఇండియా’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో నిర్వహించారు. 21వ శతాబ్దంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన పరిణామాలు, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల్లో భారత్ పాత్రను పుస్తకంలో వివరించారు.
ఈ సందర్భంగా రాంమాధవ్ మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యుత్తమ నాయకుడని, ఆయనను ప్రపంచ దేశాలు సైతం గౌరవిస్తున్నాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిణామాల్లో సాంకేతిక పరిజ్ఞానమే కీలకపాత్ర పోషించబోతోందని చెప్పారు. అప్పుడే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(ఏజీఐ) కూడా అందుబాటులోకి వచ్చిందని, ఇది మరింత వాడుకలోకి వస్తే 30 శాతం ఉద్యోగాలు కోల్పోవడం ఖాయమని తెలిపారు. అందులో మహిళలే ఎక్కువ ఉంటారని, ఎందుకంటే వారికి సంబంధించిన ఉద్యోగాల్లోనే ఏజీఐ వినియోగం ఎక్కువ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎ్‌ఫఎస్ అధికారి వెంకటేశ్ వర్మ, నల్సార్ వీసీ ప్రొఫెసర్ కృష్ణదేవరావు, బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రూప వాసుదేవన్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 21 , 2025 | 04:07 AM