Aarogyasri Scheme: ఆరోగ్యశ్రీ మాటున.. ఆస్పత్రుల మోసం
ABN, Publish Date - Jun 24 , 2025 | 04:20 AM
అనారోగ్యం బారిన పడి.. తగిన చికిత్స చేయించుకునే స్థోమత లేని పేద ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు తప్పుదోవ పట్టిస్తున్నాయి.
రోగులను దగా చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు
ఎంప్యానెల్ కాకపోయినా తప్పుడు సమాచారం
తమ వద్ద ఆరోగ్యశ్రీ ఉందంటూ శస్త్రచికిత్సలు
సర్జరీ అయ్యాక ఆ పథకంలో వర్తించదంటూ..
రోగుల నుంచి పెద్దమొత్తంలో బిల్లుల వసూలు
ప్రైవేటు ఆస్పత్రులపై ఆరోగ్యశాఖకు ఫిర్యాదులు
అయినా పట్టించుకోని డీఎంహెచ్‌వోలు
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యం బారిన పడి.. తగిన చికిత్స చేయించుకునే స్థోమత లేని పేద ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఆరోగ్యశ్రీలో ఎంప్యానెల్ కాకపోయినా.. ఈ పథకం కింద ఉచితంగా చికిత్స అందిస్తామంటూ ప్రచారం చేసుకుంటూ రోగులను చేర్చుకుంటున్నాయి. తీరా చికిత్స పూర్తయ్యాక ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో సదరు చికిత్స లేదంటూ వారినుంచి పెద్దమొత్తంలో బిల్లు వసూలు చేస్తున్నాయి. ఎంప్యానెల్‌పై అవగాహన లేని ప్రజలు.. ఈ ఆస్పత్రులు చేస్తున్న మోసానికి నిలువునా బలి అవుతున్నారు. ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి తమ వద్ద ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలందిస్తామని పల్లెల్లో కరపత్రాల ద్వారా ప్రచారం చేసింది. దీంతో ఈ నెల మొదటి వారంలో ఆ జిల్లాకు చెందిన శ్రీనివాసరావు అనే పేషంట్ సదరు ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద చేరారు. ఆర్థో వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేశారు. అయితే. డిశ్చార్జి సమయంలో సదరు ఆపరేషన్ ఆరోగ్యశ్రీ పరిఽధిలోకి రాదంటూ రూ.69 వేల బిల్లు వేశారు. దీంతో ఈ మోసంపై బాధితులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా కొద్ది నెలల క్రితం ఇదే తరహా ఘటన జరిగింది. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తామని ఓ రోగిని ఆస్పత్రిలో చేర్చుకొని.. చికిత్స పూర్తయ్యాక పెద్దమొత్తంలో బిల్లు వేసి ముక్కుపిండి వసూలు చేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలోని చాలా ఆస్పత్రుల్లో చోటుచేసుకుంటున్నాయి. ఈ ఆస్పత్రులకు స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీ, పీఎంపీలు సహకరిస్తున్నారని, కొన్నిచోట్ల వారే స్వయంగా రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు పంపి కమీషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
సింగిల్ స్పెషాలిటీ అనుమతులతో మోసం
ప్రైవేటు ఆస్పత్రులు రోగులను ఆరోగ్యశ్రీ పేరుతో రెండు రకాలుగా మోసం చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. కొన్ని ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీలో సింగిల్ స్పెషాలిటీకే అనుమతులుంటే.. ఇతర శస్త్రచికిత్సలు చేసి, చివరికి పథకం వర్తించదంటూ డబ్బులు గుంజుతున్నాయి. మరికొన్ని ఆస్పత్రులు అసలు ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌నే కాకుండా ఆ పేరుతో వైద్యం చేసి, ఆపై రోగుల జేబులను గుల్ల చేస్తున్నాయి. శస్త్రచికిత్స అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎ్‌ఫ)కి దరఖాస్తు చేసుకొమ్మంంటూ ఉచిత సలహా ఇస్తున్నాయి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో 374 ప్రైవేటు ఆస్పత్రులు ఎంప్యానెల్ అయ్యాయి. కాగా, ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలోపాటు కొన్ని జిల్లాల్లో ప్రైవేటు ఆస్పత్రులు సింగిల్ స్పెషాలిటీతో ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్ అవుతున్నాయి. ఉదాహరణకు ఒక ఆర్థోపెడిక్ వైద్యుడు తన ఆస్పత్రిని కేవలం ఆర్థో సేవలకే పరిమితమయ్యేలా ఆరోగ్యశ్రీలో ఎంప్యానెల్ అవుతారు. అంటే ఆ ఆస్పత్రిలో కేవలం ఆర్థో సేవలు, సర్జరీలకే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్నమాట. ఒకవేళ అదే ఆస్పత్రిలో యూరాలజీ వైద్యుడు కూడా ఉండి, కిడ్నీ స్టోన్ ఆపరేషన్ చేస్తే.. దానికి ఆరోగ్యశ్రీ వర్తించదు. అయినా.. తమ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలున్నాయంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు రెండు, మూడేసి ఆస్పత్రులుంటున్నాయి. వాటిలో ఒకదానికే ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్ ఉంటుంది. ఎంప్యానెల్ లేని వాటిలో కూడా ఆరోగ్యశ్రీ సేవలందిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. అనుమతులు లేని ఆస్పత్రుల్లోనే సర్జరీలు చేస్తున్నారు. ఎంప్యానెల్ అయున ఆస్పత్రుల నుంచి ఆరోగ్యశ్రీ బిల్లులను క్లైయిమ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
ఆరోగ్యమిత్రద్వారా వివరాలు తెలుసుకునే వీలు
వాస్తవానికి ఒక రోగి ఏదైనా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే అక్కడ ఆరోగ్య మిత్ర ఉంటారు. వారితో మాట్లాడితే తనకు అవసరమైన చికిత్సకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందో, లేదో చెబుతారు. ఆ తరువాతే ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆస్పత్రిలో చేరగానే రోగి సెల్‌ఫోన్‌కు ఒక మెసేజ్ వస్తుంది. అలాగే శస్త్రచికిత్స అవసరమైతే రోగి ఫోన్‌కు మరో మెసేజ్ కూడా వస్తుంది. ప్రీ ఆథరైజ్డ్ అప్రూవల్ రావాల్సివుందని, అది రాగానే సర్జరీ చేస్తారంటూ సందేశం వస్తుంది. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఇలా జరగలేదంటే కచ్చితంగా రోగిని సదరు ఆస్పత్రి మోసం చేస్తుందనే భావించాలి. కానీ, చాలామందికి ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్ ఆస్పత్రులపై సరైన అవగాహన ఉండటం లేదు. దాంతో ఆస్పత్రుల మోసానికి బలవుతున్నారు. జిల్లాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ విషయంలో వస్తున్న ఫిర్యాదుల విషయంలో జిల్లా వైద్యాధికారి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, పలువురు డీఎంహెచ్‌వోలు ప్రైవేటు ఆస్పత్రుల నుంచి ముడుపులు తీసుకుంటూ రోగుల ఫిర్యాదులపై స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి.
Updated Date - Jun 24 , 2025 | 04:20 AM