Mallikarjun Kharge: ఆచితూచి మాట్లాడండి!
ABN, Publish Date - Jun 27 , 2025 | 03:49 AM
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి భేటీ అయినట్టు తెలిసింది. బుధవారం కుటుంబ సమేతంగా ఢిల్లీకి వచ్చిన పొంగులేటి సాయంత్రం సమయంలో ఒక్కరే ఖర్గే నివాసంలో ఆయనను కలిసినట్టు సమాచారం.
రాష్ట్ర పార్టీతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లండి
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖర్గే హితవు
ఢిల్లీలో పార్టీ జాతీయాధ్యక్షుడితో గంటపాటు మంత్రి భేటీ
న్యూఢిల్లీ, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి భేటీ అయినట్టు తెలిసింది. బుధవారం కుటుంబ సమేతంగా ఢిల్లీకి వచ్చిన పొంగులేటి సాయంత్రం సమయంలో ఒక్కరే ఖర్గే నివాసంలో ఆయనను కలిసినట్టు సమాచారం. సుమారు గంటకుపైగా సాగిన సమావేశంలో రాష్ట్ర రాజకీయాలపై చర్చించుకున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తీరుపై కాంగ్రెస్ పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిసి కొందరు ఎమ్మెల్యేలు పొంగులేటి తీరుపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీనే ప్రధానమని, రాష్ట్ర పార్టీ నాయకత్వంతో పాటు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయంతో ముందుకెళ్లాలని పొంగులేటికి ఖర్గే హితబోధ చేసినట్టు తెలిసింది.
పొంగులేటి గతంలో ఒకసారి రాష్ట్ర రాజకీయాల్లో బాంబులు పేలతాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బహిరంగ ప్రకటన చేశారు. స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ పొంగులేటి తీరును బహిరంగంగానే తప్పు బట్టారు. ఈ నేపథ్యంలో ఖర్గేతో భేటీలో ఈ అంశాలన్నింటిపైనా చర్చ జరిగినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే, ఫోన్ ట్యాపింగ్ అంశంలో పొంగులేటి క్యాంపు ఆఫీసు సిబ్బందికి సిట్ నోటీసులు ఇవ్వడం పైనా చర్చ జరిగినట్టు సమాచారం. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో సమన్వయంతో ఉండాలని, బహిరంగ వేదికలపై ఆచితూచి మాట్లాడాలని పొంగులేటికి ఖర్గే సూచించినట్టు తెలిసింది. పొంగులేటిని అధిష్ఠానమే పిలిచిందా? ఆయనే సంజాయిషీ ఇచ్చుకోవడానికి వచ్చారా? అనే దానిపై స్పష్టత లేదు. పొంగులేటిని సంప్రదించడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
ఇవి కూడా చదవండి:
ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
For More AP News and Telugu News
Updated Date - Jun 27 , 2025 | 03:49 AM