NagarjunaSagar:నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల
ABN, Publish Date - Jul 29 , 2025 | 04:16 PM
భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నీరు కారణంగా.. నాగార్జున సాగర్ డ్యామ్ నిండు కుండలా తయారైంది. దీంతో ప్రాజెక్ట్‌లోని నీటిని కిందకి విడుదల చేశారు.
నాగార్జునసాగర్/ శ్రీశైలం జులై 29: ఒక వైపు భారీ వర్షాలు మరోవైపు ఎగువ నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తుంది. దీంతో మంగళవారం ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లను పలువురు ఉన్నతాధికారుల సమక్షంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 590.00 అడుగులకుగాను ప్రస్తుతం 586.60 అడుగులకు చేరింది.
ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిన నేపథ్యంలో.. దిగువ భాగంలోని నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అంతేకాకుండా దాదాపు 18 ఏళ్ల తర్వాత.. నెల ముందుగానే నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సాగర్ గేట్లు ఎత్తడం చాలా సంతోషంగా ఉందన్నారు.
నాగార్జునసాగర్ మనకు ఆధునిక దేవాలయమని అభివర్ణించారు. సాగర్‌కు అప్పటి ప్రధాని నెహ్రూ పునాది వేస్తే.. ఇందిరాగాంధీ ప్రారంభించారని చెప్పారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ద్వారా 26 లక్షల ఎకరాల ఆయుకట్టుకు నీరు అందుతుందని తెలిపారు.
మరోవైపు.. శ్రీశైలం జలాశయానికి సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఆరు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి స్పెల్‌వే ద్వారా నీటిని నాగార్జున సాగర్‌కు విడుద చేస్తున్నారు. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,29,743 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి ఔట్ ఫ్లో 2,48,900 క్యూసక్కులుగా ఉంది. ఇక ఆరు స్పిల్ వే గేట్ల ద్వారా 1,62,942 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు.
అలాగే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 20 వేల క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,643 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అదీకాక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204.78 టీఎంసీలుగా కొనసాగుతోంది.
Updated Date - Jul 29 , 2025 | 04:27 PM