MP CM Ramesh: కవితను జైలు నుంచి విడిపిస్తే.. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామన్నది మరిచావా?
ABN, Publish Date - Jul 27 , 2025 | 04:17 AM
బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌పై బీజేపీ నేత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ సంచలన ఆరోపణలు చేశారు.
ఈడీ, సీబీఐ తమ దాకా రాకుండా చూడమని కోరింది ఎవరు
కమ్మవారు అవసరం లేదన్న మాట గుర్తు లేదా
కేటీఆర్‌పై అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ సంచలన ఆరోపణలు
తెలంగాణలో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకుంటే తప్పేంటని నిలదీత
అనకాపల్లి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌పై బీజేపీ నేత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలపడానికి సిద్ధంగా ఉన్నానని తనతో చెప్పిన మాటను మరిచిపోయావా? అంటూ కేటీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ దాడులు తమ దాకా రాకుండా చూడాలని, కవితను జైలు నుంచి బయటకు తీసుకురావాలని కోరింది గుర్తు లేదా? అంటూ నిలదీశారు. ఆంధ్రాకు చెందిన బీజేపీ ఎంపీకి రూ.1660 కోట్ల పనులను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారంటూ కేటీఆర్ పరోక్షంగా తనపై చేసిన ఆరోపణలకు సీఎం రమేశ్ స్పందించారు. అనకాపల్లిలో మాట్లాడిన సీఎం రమేశ్.. తమ ‘రిత్విక్ సంస్థ’ చట్ట బద్ధంగా, నిబంధనల మేరకు తెలంగాణలో పనులు దక్కించుకుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి తాను రుణాలు ఇప్పించినందుకే.. నామినేషన్ పద్ధతిలో పనులు ఇచ్చారన్న కేటీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ప్రభుత్వం కాంట్రాక్టు పనులు అప్పగించే సమయంలో ఎటువంటి నిబంధనలు పాటిస్తుందో పదేళ్లు మంత్రిగా చేసిన కేటీఆర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. కాగా, కవిత జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో తన ఇంటికి వచ్చిన కేటీఆర్ ఏం మాట్లాడారో గుర్తుచేసుకోవాలని సీఎం రమేశ్ ఈ సందర్భంగా అన్నారు.
సీబీఐ, ఈడీ దాడులు తమ వరకు రాకుండా చూడాలని, కవితను బయటకు తీసురావాలని కోరలేదా? అని ప్రశ్నించారు. అంతేకాదు. ఈ పనిచేస్తే బీఆర్‌ఎ్‌సను బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా వ్యాఖ్యానించారన్నారు. అలాగే, తుమ్మల నాగేశ్వరరావును ఎందుకు వదిలేసుకున్నారని అడిగితే కమ్మవారు అవసరం లేదని, రేవంత్ గెలిచిన తరువాత రెడ్లు ఆయన వెనుక వెళ్లిపోయారని చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేసుకోవాలన్నారు. తెలంగాణలో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటే తప్పేంటని రమేశ్ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో సుమారు రూ.7 లక్షల కోట్లు కాంట్రాక్టులు ఇచ్చారని, అందులో తెలంగాణ, ఆంధ్రాకు చెందినవారు ఎవరు ఎన్ని పనులు పొందారో వివరాలు తన దగ్గర ఉన్నాయన్నారు. అన్ని విషయాలపైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. కేటీఆర్ గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయని, కానీ సంస్కారం అడ్డొస్తోందన్నారు. కేటీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని సీఎం రమేశ్ హెచ్చరించారు.
Updated Date - Jul 27 , 2025 | 04:18 AM