Miss World 2025: తారలు దిగి వచ్చిన వేళ
ABN, Publish Date - May 11 , 2025 | 04:08 AM
దివిలో ఉండే తారలంతా భువికి దిగి వస్తే! అందులోనూ హైదరాబాద్‌కు వస్తే శనివారం సాయంత్రం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్-2025 పోటీల ప్రారంభ కార్యక్రమం సరిగ్గా అలాగే కనిపించింది.
వైభవంగా మిస్ వరల్డ్ పోటీల ప్రారంభం.. పాల్గొన్న 110 దేశాల సుందరీమణులు
భారత్ తరఫున నందినీ గుప్తా ప్రాతినిధ్యం.. వేడుకల్లో ఉట్టిపడిన తెలంగాణ సంస్కృతి
ఆకట్టుకున్న పేరిణి నృత్యం.. ‘భారత్ మాతాకీ జై’ నినాదంతో మార్మోగిన ప్రాంగణం
అత్యంత పటిష్ఠమైన భద్రత మధ్య పోటీలు.. ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మే 10 (ఆంధ్రజ్యోతి): దివిలో ఉండే తారలంతా భువికి దిగి వస్తే! అందులోనూ హైదరాబాద్‌కు వస్తే!! శనివారం సాయంత్రం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్-2025 పోటీల ప్రారంభ కార్యక్రమం సరిగ్గా అలాగే కనిపించింది. 110 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్న ఈ పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దాదాపు రెండున్నర గంటలపాటు ఈ కార్యక్రమం జరిగింది. ఈ పోటీలతో.. ఉద్యమగడ్డ తెలంగాణపై ప్రపంచ దేశాలన్నీ సాక్షాత్కరించాయి. ఆయా దేశాల జెండాలతో వారంతా కలిసి ఒకేసారి ర్యాంపుపైకి రాగా.. భారత్ తరఫున మిస్ ఇండియా నందినీ గుప్తా జాతీయ జెండాతో అందరికీ అభివాదం చేశారు. ఆ ఘట్టం ఉద్విగ్నభరితంగా సాగింది. పాకిస్థాన్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ప్రపంచ దేశాలు పాల్గొనే మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశ జెండా కనబడగానే ‘‘భారత్ మాతాకీ జై’’ అనే నినాదంతో స్టేడియం మార్మోగింది. తెలంగాణ గేయంతో ప్రారంభమైన 72వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ కార్యక్రమం.. జాతీయగీతం జనగణమనతోపాటు అంతకుముందు మిస్‌వరల్డ్ గీతం ఆలాపనతో ముగిశాయి. మరోవైపు అందాలబామల ప్రదర్శన మధ్యలో తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, వాటి ఔన్నత్యం తదితర అంశాలతో కూడిన కొన్ని వీడియో సందేశాలను ప్రదర్శించారు.
ఆకట్టుకున్న పేరిణి నృత్యం..
మిస్ వరల్డ్-2025 పోటీల సందర్భంగా తెలంగాణ సంస్కృతి, పాశ్యాత్య దేశాలకు చెందిన కొన్ని కళలను కూడా ప్రదర్శించారు. పలువురు కళాకారులతో తెలంగాణ రాష్ట్ర గేయం ఆలాపనతో కార్యక్రమం ప్రారంభం కాగా, ఆ తరువాత 250 మందితో ప్రదర్శించిన పేరిణి నృత్యం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ప్రదర్శించిన గుస్సాడి నృత్యం అలరించింది. తెలంగాణకు ప్రత్యేకమైన కొమ్ము నృత్యం ఆహుతులను ఎంతగానో ఆకర్షించింది. ఇక లంబాడ కళాకారుల డప్పు నృత్యం, ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ప్రదర్శన మధ్యలో కొంతమంది కళాకారులు పిరమిడ్ ఆకారంలోకి వచ్చి పైన నిల్చున్న వ్యక్తి జాతీయజెండాను చేతబూని అద్భుత ప్రదర్శన చేశారు. జాతీయ జెండా కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకులంతా ‘జై భారత్’ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు మిస్‌వరల్డ్ పోటీల ప్రారంభ సమావేశంలో లాటిన్ అమెరికా దేశాల పోటీదారులు తమ ఆహార్యంతోపాటు ఆయా దేశాల సంస్కృతి, సంప్రదాయ వేషధారణలతో ఆకట్టుకున్నారు.
ఖండాల వారీగా ప్రదర్శన..
మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ఖండాల వారీగా ప్రదర్శన నిర్వహించారు. కరీబియన్ లాటిన్ అమెరికా దేశాలకు చెందిన పోటీదారులతో ప్రదర్శన మొదలైంది. రెండో విడతలో ఆఫ్రికన్ దేశాలకు చెందిన 22 మంది అందగత్తెలు తమ సంప్రదాయ దుస్తులు, ప్రత్యేక వేషధారణతో ప్రదర్శన ఇచ్చారు. ఆ తరువాత యూరప్, ఆసియా ఖండాల వారీగా ప్రదర్శన ఇవ్వగా.. యూరప్ నుంచి అల్బేనియా ప్రతినిధితో మొదలైంది. యూరప్ నుంచి 32 దేశాలు ప్రాతినిధ్యం వహించాయి. ఆసియా నుంచి 22 దేశాలు ప్రాతినిధ్యం వహించగా.. మిస్ ఇండియా నందినీ గుప్తా ర్యాంపుపైకి రాగానే ప్రేక్షకులంతా కరతాళధ్వనులతో శుభాకాంక్షలు తెలిపారు. పోటీదారుల్లో అందరికంటే చివరిగా ర్యాంపుపైకి వచ్చిన మిస్ వియత్నాం తనదైన డ్యాన్స్‌తో అక్కడున్నవారిని ఆకట్టుకుంది.
పోటీలను ప్రారంభించిన సీఎం రేవంత్..
గచ్చిబౌలిలో మిస్‌వరల్డ్-2025 పోటీలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై ప్రారంభించారు. కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం రేవంత్ ప్రకటించగానే.. పోటీదారులంతా ఒకే వేదికపై నిలబడగా.. మిస్ వరల్డ్ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో మిస్‌వరల్డ్ క్రిస్టినా, మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, క్రీడల సలహాదారు జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలను ప్రపంచమంతా ఆసక్తిగా తిలకించింది. దేశ విదేశాల్లో కోట్లాది మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. దాదాపు వెయ్యి మందికిపైగా జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు ఆన్‌లైన్‌తోపాటు నేరుగా కవర్ చేశారు. కాగా, మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణకు గర్వకారణమని, ప్రపంచస్థాయి వేడుకలకు హైదరాబాద్ వేదికగా నిలిచిందని సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాల నుంచి ఈ పోటీల్లో పాల్గొంటున్నవారికి ఆహ్వానం. పోటీల్లో పాల్గొనేవారు తెలంగాణ ఘనమైన చరిత్ర, సంస్కృతిని ఆస్వాదిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. కిరీటం కోసం పోటీ పడుతున్న వారికి ఆల్ ది బెస్ట్’’ అని సీఎం పోస్టు చేశారు.
పెట్టుబడులకు కేరాఫ్ హైదరాబాద్..
ఓవైపు భారత్, పాకిస్థాన్ యుద్ధం కొనసాగుతుండడం, మరోవైపు హైదరాబాద్‌లో 72వ మిస్‌వరల్డ్ పోటీలు ఉండడంతో.. ఇవి ఎలా జరుగుతాయోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఉత్కంఠకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పటిష్ఠ బందోబస్తు నడుమ పోటీలను ప్రారంభించింది. ఎక్కడా చిన్న సమస్య లేకుండా భద్రతా ఏర్పాట్లు చేసింది. ఫలితంగానే శనివారం నిర్వహించిన ప్రారంభం రోజు పోటీలు సాఫీగా సాగాయి. దీంతో శాంతిభద్రతలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ అని, ఇతర దేశాల నుంచి తెలంగాణకు పెట్టుబడులు వచ్చేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయనే అభిప్రాయం కార్యక్రమానికి హాజరైన వారిలో వ్యక్తమైంది. ప్రపంచ శాంతికి, ఐక్యతకు మిస్ వరల్డ్ పోటీలు కూడా పాటుపడతాయని నిర్వాహకులు ప్రకటించారు.
చరిత్రాత్మకమైన రోజు: జయేశ్ రంజన్
72వ మిస్ వరల్డ్ ప్రారంభ వేడుక చరిత్రాత్మకమైన రోజు అని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ అన్నారు. ఈ రోజు ప్రపంచ శాంతికి చిహ్నంగా గుర్తుండిపోతుందని భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న దేశాల ప్రతినిధులు ప్రపంచ శాంతికి అంబాసిడర్లుగా నిలస్తారన్నారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ అంతర్జాతీయ పోటీలు తెలంగాణ, భారత్‌కు మాత్రమే కాకుండా.. ప్రపంచానికే ప్రత్యేకమని అభివర్ణించారు. తెలంగాణ పర్యాటకం గురించి ప్రపంచానికి చాటిచెప్పాలని పాల్గొన్నవారికి విజ్ఞప్తి చేశారు. ఈ పోటీలతో ప్రపంచానికి తెలంగాణ శాంతి సందేశం అందించిందన్నారు.
నంబర్-1 మిస్ ఫిలిప్పీన్స్.. నంబర్-2 మిస్ ఇండియా
మిస్ వరల్డ్ వస్త్రధారణ పోటీలు.. ప్రారంభ వేడుకను వీక్షించిన 145 దేశాల ప్రజలు
హైదరాబాద్, మే 10 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్న మిస్ వరల్డ్-2025 పోటీల ప్రారంభ వేడుకల్లో శనివారం వస్త్రధారణ విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో పాల్గొన్న 110 దేశాలకు చెందిన సుందరీమణులు తమ దేశ సంస్కృతి ఉట్టిపడేలా వస్ర్తాలు ధరించి విశేషంగా ఆకట్టుకున్నారు. ప్రారంభ వేడుకల వస్త్రధారణకు ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ డిజైనర్లు ర్యాంకులు కేటాయిస్తారు. ధరించిన వస్ర్తాలతోపాటు వారి బాడీ లాంగ్వేజ్, చురుకుదనం కూడా పరిగణనలోకి తీసుకుంటారు. శనివారం నాటి వేడుకల్లో టాప్-12 ర్యాంకులు ప్రకటించగా.. ఇందులో మిస్ ఫిలిప్పీన్స్ ప్రతినిధి నెంబర్-1 స్థానాన్ని దక్కించుకున్నారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నందితా గుప్తా ద్వితీయ స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఈక్వెడార్, పెరూ, వెనిజులా, బ్రెజిల్, కోట్ డిల్వోర్, థాయ్‌లాండ్, ఫ్రాన్స్, పర్టోరికో, కొలంబియా, శ్రీలంక సుందరీమణులు నిలిచారు. శనివారం జరిగిన ప్రారంభ వేడుకను 145 దేశాల ప్రజలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారని మిస్ వరల్డ్ అధికార ప్రతినిధి తెలిపారు.
సంప్రదాయ దుస్తుల్లో..
సుమారు 109 దేశాల నుంచి అందాల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన సుందరాంగునులు తమ సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. సంగీతానికి అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఆయా దేశాల సంస్కృతుల వైవిధ్యాన్ని ప్రదర్శించారు. మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన నందిని గుప్తా.. ఆఫ్ శారీలో ఆకట్టుకుంది. జాతీయ జెండా పట్టుకుని స్టేడియంలోకి వచ్చిన వెంటనే హర్షధ్వానాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది... నేపాల్ నుంచి వచ్చిన ప్రతినిధి చీరకట్టులో మెరిసింది.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది గచ్చిబౌలి స్టేడియం ఆవరణలో అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. మూడంచెల విధానంలో వాహనాలను కూడా నిశితంగా పరిశీలించారు. ముందే జారీ చేసిన పాస్‌ల ఆధారంగా ఆయా గేట్ల వద్ద తనిఖీ బృందాలు పూర్తి స్థాయిలో పరిశీలించాకే లోపలికి అనుమతించారు. పోలీసు ఎస్కార్ట్ వాహనాలను సైతం తనిఖీ చేశాకే అనుమతించడం గమనార్హం. భారత్, పాక్ కాల్పుల విరమణ గురించి ప్రకటన వచ్చాక.. వేడుకల ప్రారంభానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
పేరిణి లాస్య నృత్యంలో మిస్‌వరల్డ్ ఆకారాలు
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన కళాకారులు తమ ప్రాంతీయ కళలను విశ్వసుందరీమణుల వేదిక మీద ప్రదర్శించారు. మిస్‌వరల్డ్ ప్రారంభ వేడుకల్లో 250 మంది పేరిణి లాస్య కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నృత్యంలో నక్షత్ర ఆకారం, సీతాకోకచిలుకలు, మిస్ వరల్డ్ లోగో వంటి ఆకారాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శన మహిళా శక్తిని, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. కాగా, వేడుకలు నిర్వహించిన స్డేడియంలో ఉన్న ప్లాస్టిక్ కుర్చీలను కనీసం తుడిచిన దాఖలాలు కనిపించలేదు. చాలా మంది అసౌకర్యానికి గురయ్యారు. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసినా నిర్వహణ సరిగా లేక అక్కడి వరకు వెళ్లి మహిళలు వెనక్కి వచ్చారు. గ్యాలరీలో తాగునీరు అందుబాటులో పెట్టలేదు. చాలా మంది నీటి కోసం బయటకు, లోపలకు తిరిగారు.. ఏసీ కూడా సరిగా సరిపోకపోవడంతో వేడుకలకు వచ్చిన అతిథులు వారి వద్ద ఉన్న వీఐపీ పాస్‌లనే విసనకర్రల్లా వినియోగించారు. మరోవైపు, వేడుకల ప్రారంభానికి ముందు 7వ నంబరు బ్లాక్ వద్ద ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఓ వ్యక్తి తన సూటికేసు వదిలేసి వెళ్లడం కలకలం రేపింది. ఆయన కెమెరామాన్ అని పోలీసులు గుర్తించారు.
జూలియామోర్లితో సీఎం మాటామంతి
మిస్‌వరల్డ్ వేడుకల ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం రేవంత్ మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్‌పర్సన్ జూలియాతో మాట్లాడారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులంతా రేవంత్ వచ్చాక ఆయా దేశాల జాతీయ జెండాలతో ప్రదర్శన చేశారు. భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన నందిని గుప్తా చివరలో రావడంతో గ్యాలరీ మార్మోగిపోయింది.
తెలంగాణ సంప్రదాయ నృత్య రీతులు
Updated Date - May 11 , 2025 | 05:52 AM