Miss World 2025: నేడు బుద్ధవనానికి అందాల భామలు
ABN, Publish Date - May 12 , 2025 | 05:11 AM
మిస్ వరల్డ్-2025 పోటీల్లో పాల్గొంటున్న వివిధ దేశాల సుందరీమణులు సోమవారం బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు.
నాగార్జునసాగర్‌కు మిస్‌వరల్డ్ ప్రతినిధుల రాక.. ప్రత్యేక బస్సుల్లో తీసుకెళ్లనున్న అధికారులు... 2 వేల మంది పోలీసులతో బందోబస్తు
హైదరాబాద్/నాగార్జునసాగర్, మే 11(ఆంధ్రజ్యోతి): మిస్ వరల్డ్-2025 పోటీల్లో పాల్గొంటున్న వివిధ దేశాల సుందరీమణులు సోమవారం బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 110 దేశాలకు చెందిన అందగత్తెలు మిస్‌వరల్డ్ పోటీల్లో పాల్గొంటుండగా.. ఆసియా దేశాల నుంచి వచ్చినవారు మాత్రం బుద్ధవనం సందర్శనకు వెళ్లనున్నారు. బౌద్ధమతంపై విశ్వాసం, బుద్ధుని చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి గల 30 దేశాలకు చెందిన మిస్‌వరల్డ్ పోటీదారులు బౌద్ధ థీమ్‌పార్క్‌లోని స్తూపంలో బుద్ధుని విగ్రహాల చెంత జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రత్యేకించి ఆయా దేశాల ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి భారీ బందోబస్తు మధ్య పర్యాటక అభివృద్ధిసంస్థ ప్రత్యేక బస్సులో వీరిటి నాగార్జునసాగర్‌కు తీసుకువెళ్లనున్నారు. మధ్యలో నల్లగొండ జిల్లా చింతపల్లి సమీపంలోని అతిథిగృహం వద్ద కొంతసేపు ఆగుతారు. అక్కడ పర్యాటక సంస్థ విజయ్‌విహార్‌లో కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఫొటో సెషన్ తర్వాత అక్కడినుంచి నేరుగా బుద్ధవనం చేరుకుంటారు. లంబాడా కళాకారులు మిస్‌వరల్డ్ ప్రతినిధులకు సంప్రదాయ నృత్యంతో స్వాగతం పలుకుతారు.
ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల..
బుద్ధుని ప్రియశిష్యుడు ఆచార్య నాగార్జునుడు నడయాడిన కృష్ణా నదీతీరం నాగార్జునసాగర్ జలాల సమీపంలో 274 ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా బుద్ధవనం, బౌద్ధ థీమ్ పార్క్‌ను అభివృద్ధి చేశాయి. ఇక్కడ బుద్ధుని జీవితం, బోధనలు, బౌద్ధకళ, సంస్కృతిని ప్రదర్శించే పలు నిర్మాణాలు పూర్తి చేశారు. మిస్‌వరల్డ్ పోటీదారులు ఇక్కడ ధ్యానం చేసిన తర్వాత 25 మంది బౌద్ధ సన్యాసులు బైలికుప్ప మహాబోధి పూజలు నిర్వహిస్తారు. పురావస్తు నిపుణుడు శివనాగిరెడ్డి బుద్ధవనం ప్రాజెక్టు ప్రాముఖ్యత, ప్రాశస్త్యంను వివరిస్తారు. అందాల భామల రాక నేపథ్యంలో పర్యాటక శాఖ అధికారులు బుద్ధవనాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. మహాస్థూపం, బుద్ధ పాదాలవద్ద లేజర్ లైట్లు, జతాక వనం లో ఓపెన్ థియేటర్ ఏర్పాటు చేశారు. స్థానిక కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఐదు పడకలతో ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. కాగా, మిస్ వరల్డ్ పోటీదారుల రాక సందర్భంగా 2వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు.
పోలీసుల డ్రెస్ రిహార్సల్స్
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నేటి నుంచి మిస్‌వరల్డ్ పోటీదారులు పర్యటించనున్నారు. పర్యాటక, చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. 14 ప్రాంతా ల్లో మిస్ వరల్డ్ పోటీదారులు పర్యటించనున్న నేపధ్యంలో ఆయా జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. బుద్ధవనం, లాడ్‌బజార్, చౌమహల్లా ప్యాలెస్, రామప్పగుడి, యాదగిరిగుట్ట,పోచంపల్లి, ఏఐజీ ఆసుపత్రి, పిల్లలమర్రి, రామోజీ ఫిలింసిటీ, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఉప్పల్ స్టేడియం,శిల్పారామం తదితర ప్రాంతాల్లో మిస్ వరల్డ్ పోటీదారులు బృందాలుగా పర్యటించనున్నారు. ఒకొక్క పర్యటనలో కనీసం 25 మంది ఉండేలా షెడ్యూల్ ఖరారయినట్లు సమాచారం. ఈ క్రమంలో అత్యంత హైసెక్యూరిటీ ఏర్పాట్లు జరిగాయని, అనుక్షణం భద్రతను డీజీపీ జితేందర్ సమీక్షిస్తున్నారని తెలుస్తోంది.
నీరా సేవించిన భామలు
మిస్ వరల్డ్-2025 పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందాల భామలు కొంతమంది తెలంగాణలోని తాటి ముంజలు తిన్నారు. కల్లు నుంచి వచ్చే నీరాను కూడా సేవించారు. రుచి బాగుందంటూ లొట్టలేసుకుంటూ ముంజలు తినడం అక్కడున్నవారికి కూడా నోరూరించింది.
రేపు అందాల భామల హెరిటేజ్ వాక్
హైదరాబాద్ సిటీ/చార్మినార్: హైదరాబాద్ నగర వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో మిస్ వరల్డ్- 2025 హెరిటేజ్ వాక్ ను ఈ నెల-13న హైదరాబాద్ చార్మినార్‌లో నిర్వహించనున్నారు. ఇందు కోసం పర్యాటకశాఖ సంచాలకులు జెడ్.హన్మంతు, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అదనపు కమిషనర్ విక్రమ్‌సింగ్ మాన్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్, సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహరా, జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ, సమాచారం శాఖ అలాగే ఈవెంట్ భాగస్వాములతో కలిసి చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్ ప్రాంతాల్లో సందర్శించి ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించి, ట్రయల్‌రన్ నిర్వహించారు. హెరిటేజ్ వాక్ రూట్ మ్యాప్‌ను అధికారులతో కలిసి సీపీ సీవీ ఆనంద్ పరిశీలించారు.
ఇవి కూడా చదవండి
Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్‌తో రైడ్.. వీడియో వైరల్
Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 12 , 2025 | 05:11 AM