Operation Kagar: ‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేయండి
ABN, Publish Date - Apr 30 , 2025 | 05:07 AM
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను వెంటనే నిలిపివేయాలని మంత్రి ధనసరి సీతక్క డిమాండ్ చేశారు. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని నిలువరించేలా చొరవ చూపాలని కోరారు.
మావోయిస్టులతో శాంతి చర్చలు జరపండి
కేంద్రానికి మంత్రి ధనసరి సీతక్క డిమాండ్
శాంతి చర్చల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం
2న సదస్సు నిర్వహిస్తాం: వామపక్ష పార్టీలు
హైదరాబాద్ సిటీ, హైదరాబాద్, మహబూబాబాద్ టౌన్, వడ్డెపల్లి, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను వెంటనే నిలిపివేయాలని మంత్రి ధనసరి సీతక్క డిమాండ్ చేశారు. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని నిలువరించేలా చొరవ చూపాలని కోరారు. భారత్ బచావో ప్రతినిధులు డాక్టర్ ఎమ్‌ఎఫ్ గోపీనాథ్, గాదె ఇన్నయ్య, జంజర్ల రమే్‌షబాబు మంగళవారం ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను కలిశారు. వేల సంఖ్యలో కేంద్ర భద్రతా బలగాలు కర్రెగుట్టల్లో సంచరిస్తుండడంతో ఆదివాసీలు భయాందోళనలకు లోనవుతున్నారని, మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చూడాలని సీతక్కకు విన్నవించారు. దీనిపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. ‘కేంద్ర బలగాల మోహరింపుతో అడవిబిడ్డలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. బలప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారమయ్యేలా కేంద్రం వ్యవహరించాలని ఓ ఆదివాసీ బిడ్డగా కోరుతున్నాను. ఆ జాతి బిడ్డగా వారికి అండగా నిలుస్తాను. ఆదివాసీల హక్కులు ఎవరూ కాలరాయొద్దు’ అని కేంద్రానికి సూచించారు. మావోయిస్టులతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఆదివాసీ జాతిని అంతమొందించేందుకు చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని కోరాయి. మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వామపక్ష నేతలు మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మే 2వ తేదీన హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తున్నామని, ఇందులో శాంతి చర్చల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. సమావేశంలో సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నుంచి వేములపల్లి వెంకట్రామయ్య, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నుంచి కేజీ రాంచందర్, ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ (ఎంఎల్) నుంచి ప్రసాదన్న, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నుంచి రమేశ్ రాజా, ఎస్‌యూసీఐ నుంచి మురహరి, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మావోయిస్టులతో చర్చలు జరపాలి: ప్రజా సంఘాల డిమాండ్
ఛత్తీ్‌సగఢ్‌లోని కర్రెగుట్టల్లో నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని, మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని దళిత, గిరిజన, ఆదివాసీ ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కర్రెగుట్టల్లో కేంద్ర బలగాలను వెనక్కి మళ్లించాలంటూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, కో-కన్వీనర్లు జైసింగ్ రాథోడ్, సోమా రామ్మూర్తి మాట్లాడారు. ఆదివాసీలపై జరుగుతున్న దాడిని ఆపేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
శాంతి చర్చలకు ముందుకు రావాలి: అద్దంకి దయాకర్
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేసి శాంతి చర్చలకు ముందుకు రావాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సూచించారు. మహబూబాబాద్‌లో జాతీయ మాలమహానాడు (జేఎంఎం) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడారు. సదస్సులో టీజీవో రాష్ట్ర నాయకుడు హరికోట్ల రవి, జేఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన
Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి
Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు
PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ
Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్
For Telangana News And Telugu News
Updated Date - Apr 30 , 2025 | 05:07 AM