Ponguleti: కేవలం తెలంగాణలోనే పేదోడి ఇంటికి 5 లక్షలు
ABN, Publish Date - May 04 , 2025 | 03:42 AM
పేదోడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు చేపట్టిన ఇందిరమ్మ ఇంటి పథకం అమలులో అవినీతికి తావు లేకుండా నిజాయితీగా, నిబద్ధతతో భాగస్వాములు కావాలని గృహ నిర్మాణశాఖ అసిస్టెంట్ ఇంజనీర్ల (ఏఈ)కు రెవెన్యూ, గృహ నిర్మాణశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హితవు చెప్పారు.
మూడేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
350 మంది హౌసింగ్ ఏఈలకు నియామక పత్రాలు
21 మంది సబ్ రిజిస్ట్రార్లకు పదోన్నతి పత్రాల పంపిణీ
హైదరాబాద్/ రంగారెడ్డి అర్బన్, మే 3 (ఆంధ్రజ్యోతి): పేదోడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు చేపట్టిన ఇందిరమ్మ ఇంటి పథకం అమలులో అవినీతికి తావు లేకుండా నిజాయితీగా, నిబద్ధతతో భాగస్వాములు కావాలని గృహ నిర్మాణశాఖ అసిస్టెంట్ ఇంజనీర్ల (ఏఈ)కు రెవెన్యూ, గృహ నిర్మాణశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హితవు చెప్పారు. గృహ నిర్మాణశాఖలో ఔట్ సోర్సింగ్ విభాగంలో ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న 350 మంది ఏఈలకు శనివారం రంగారెడ్డి జిల్లా హెచ్‌సీసీలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్రక్షన్ (న్యాక్)లో ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పేదవాడి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.22 వేల కోట్ల అంచనా వ్యయంతో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అసిస్టెంట్ ఇంజినీర్లుగా విధుల్లో చేరగానే క్షేత్రస్థాయిలో అర్హులను ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులుగా ఎంపికపై దృష్టి సారించాలని సూచించారు. ఏఈలుగా ఎంపికైన వారిలో 45 శాతం మంది మహిళలే ఉండటం సంతోషకరమైన విషయమని పొంగులేటి అన్నారు. కాగా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో 10 మంది గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్లుగా, 11 మంది సీనియర్ సహాయకులకు గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్‌లుగా పదోన్నతి పొందిన వారికి ప్రమోషన్ సర్టిఫికెట్లను మంత్రి అందజేశారు.
ఇవి కూడా చదవండి..
ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 04 , 2025 | 03:42 AM