Damodara Rajanarasimha: జీవో ఇచ్చినంత మాత్రాన మెడికల్ కాలేజీ అవదు
ABN, Publish Date - Jun 17 , 2025 | 05:54 AM
మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయటం అంటే కేవలం జీవో జారీ చేయడం కాదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఘాటుగా వ్యాఖ్యానించారు.
భవనాలు, సిబ్బంది, మౌలిక వసతులు ఉండాలి
హరీశ్ రావుకు మంత్రి దామోదర కౌంటర్
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయటం అంటే కేవలం జీవో జారీ చేయడం కాదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఘాటుగా వ్యాఖ్యానించారు. వైద్య కళాశాల అంటే భవనాలు, ఎంబీబీఎస్ సీట్లకు తగ్గట్టుగా ఆస్పత్రి, బోధన సిబ్బంది, ఇతర మౌలిక వసతులు ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. నూతన వైద్య కళాశాలలపై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలకు బదులిస్తూ సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం గాల్లో మేడలు కట్టి, కాగితాలపై కాలేజీలను చూపించి, వైద్య విద్యను నాసిరకంగా చేసింది మీరు కాదా? అంటూ నిలదీశారు.
సౌకర్యాలు లేవంటూ ఇప్పుడు నోటీసులు రాగానే దొంగ ఏడుపులు ఏడుస్తూ, పిల్లలను తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేసేలా ట్వీట్లు చేస్త్తున్నారని మండిపడ్డారు. హరీశ్‌రావు హయాంలో సరైన ప్రణాళిక లేకుండా కాలేజీలు ప్రారంభించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని మంత్రి ఆరోపించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఈ లోపాలను సరిదిద్దేందుకు కృషి చేస్తోందని తెలిపారు. ‘‘ప్రతి మెడికల్ కాలేజీకి అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే కాకుండా, ఒక్క ఎంబీబీఎస్ సీటు కూడా నష్టపోకుండా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది’’ అని ఆయన స్పష్టం చేశారు.
Updated Date - Jun 17 , 2025 | 05:54 AM