అమ్మకు సాయం అందేనా?
ABN, Publish Date - Jun 02 , 2025 | 04:50 AM
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవానంతరం బాలింతలకు అందజేసే మాతా శిశు సంరక్షణ కిట్ (గతంలో కేసీఆర్ కిట్) పంపిణీ నిలిచిపోయి సరిగ్గా నాలుగేళ్లు అవుతోంది.
2021 మే నుంచి నిలిచిన కేసీఆర్ కిట్ పథకం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎంసీహెచ్ కిట్‌గా పేరు మార్పు
ఆ తర్వాతా అమలు కాని వైనం నాలుగేళ్లలో రూ.862 కోట్లకు చేరిన పథకం బకాయిలు
పేరు మార్చాల్సి వస్తుందని కేంద్ర పథకంలో చేరని గత ప్రభుత్వం
‘మాతృ వందనం’లో చేరే యోచనలో కాంగ్రెస్ సర్కారు
హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవానంతరం బాలింతలకు అందజేసే మాతా శిశు సంరక్షణ కిట్ (గతంలో కేసీఆర్ కిట్) పంపిణీ నిలిచిపోయి సరిగ్గా నాలుగేళ్లు అవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడం, ప్రసూతి మరణాలను తగ్గించడమే లక్ష్యంగా గత ప్రభుత్వం ‘కేసీఆర్ కిట్’ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రసవానంతరం బాలింతలకు కేసీఆర్ కిట్, నగదు బదిలీ చేసేవారు. ఇవి ఆ తల్లులకు ఎంతగానే ఉపయోగపడేవి. కానీ, 2021 మే నెల నుంచి కేసీఆర్ హయాంలోనే ఈ పథకం అమలు నిలిచిపోయింది. ఆ తర్వాత రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్.. కేసీఆర్ కిట్ పథకం పేరును ఎంసీహెచ్ కిట్‌గా మార్చింది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటికీ పథకం అమలు కావడం లేదు. మరోపక్క, విశ్వసనీయ సమాచారం మేరకు బీఆర్‌ఎస్ హయంలో కేసీఆర్ కిట్ నగదు బదిలీ కింద రూ.721 కోట్లు బకాయిలు పెట్టింది. వైద్య ఆరోగ్యశాఖ తాజా గణాంకాల ప్రకారం పాత, కొత్త కలిపి ఎంసీహెచ్ కిట్ బకాయిలు రూ.862 కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలో ఎంసీహెచ్ కిట్ పథకం తిరిగి అమలయ్యేనా, అమ్మకు సాయం అందేనా.. అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
కిట్‌లో ఏమిచ్చేవారంటే..
2017 జూన్ 3న అప్పటి సీఎం కేసీఆర్ ఈ కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించారు. గర్భధారణ, ప్రసవానంతర కాలంలో మహిళలకు ఈ పథకం కింద రూ.12 వేలు, అదే ఆడపిల్ల పుడితే రూ.13 వేల ఆర్థిక సాయం ఇచ్చేవారు. అలాగే ప్రసవ సమయంలో కేసీఆర్ కిట్‌ను అందించేవారు. బాలింతకు, నవజాత శిశువుకు 3 నెలలకు సరిపోయేలా దుస్తులు, సబ్బులు, బేబీ ఆయిల్, పౌడర్, దోమ తెర, న్యాప్‌కిన్లు, డైపర్లు వంటి 16 రకాల వస్తువులు కిట్‌లో ఉండేవి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికే ఈ పథకం వర్తింపజేశారు. అలాగే ఒక మహిళకు రెండు ప్రసవాలకే దీన్ని పరిమితం చేశారు.
కేంద్ర సాయం తీసుకోని వైనం
రాష్ట్ర ప్రభుత్వం కన్నా ముందే 2017 జనవరి 1న కేంద్రం ప్రధాన మంత్రి మాతృవందన యోజన (పీఎంఎంవీవై) పేరిట ఇదే తరహా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రూ.5 వేల నగదు బదిలీ చేస్తా రు. ఈ పథకం కింద కేంద్రం అన్ని రాష్ట్రాలకు సాయం అందిస్తోంది. అయితే, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ పథకం కింద వచ్చే నిధులను తీసుకోలేదు. కేంద్ర సాయం తీసుకుంటే వారు సూచించిన పేరునే పథకానికి కచ్చితంగా పెట్టాలి. అందుకు ఇష్టపడని నాటి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం తామే భరిస్తామని చెప్పి కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేసిం ది. కానీ, పథకం ప్రారంభించిన మూడేళ్ల పది మాసాలకే చేతులెత్తేసింది. నగదు బదిలీని పూర్తిగా నిలిపివేసింది. .
కొత్త కిట్‌పై కసరత్తు...
ఇక, రాష్ట్రంలోని ప్రస్తుత ప్రభుత్వం కేసీఆర్ కిట్ స్థానంలో కొత్త పేరుతో కిట్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు అధికారులు కూడా ప్రతిపాదనలు పంపారు. గత సర్కారు కేసీఆర్ కిట్‌తో పాటు కేసీఆర్ న్యూట్రియంట్ కిట్‌ను కూడా ఇచ్చింది. గర్భిణుల్లో రక్తహీనతను తగ్గించేందుకు రెండుసార్లు కిట్ ఇచ్చేవారు. ఆ పథకంలో కోట్ల రూపాయల కుంభకోణం జరగడంతో కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే దానిని నిలిపివేసింది. ప్రస్తుతం కేసీఆర్ కిట్, న్యూట్రియంట్ కిట్ రెండూ కలిసి ఉండేలా కొత్త కిట్‌ను వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు డిజైన్ చేశారు. అందుకు సంబంధించి ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. అయితే ఆ ఫైల్‌కు సీఎంవో ఆమోదం ఇంకా లభించలేదు. ఇక కేంద్రం ఇచ్చే పీఎంఎంవీవై పథకంలో భాగస్వామి అయి కేంద్రం ఒక్కో గర్భిణికి ఇచ్చే రూ.5 వేల సాయాన్ని తీసుకోవాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో కేంద్ర సాయం తప్పకుండా తీసుకునే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణ లా, ప్రొస్ట్‌గ్రాడ్యుయేషన్ లా సెట్ అడ్మిట్ కార్డుల విడుదల..
మల విసర్జన చేయడానికి మంచి టైం ఏది.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..
Updated Date - Jun 02 , 2025 | 04:50 AM