Hyderabad: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా భారీ నిరసన
ABN, Publish Date - Apr 14 , 2025 | 03:39 AM
వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం హైదరాబాద్‌లో ముస్లింలు భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమంటూ ట్యాంక్‌బండ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు.
అంబేడ్కర్ విగ్రహం వద్ద ముస్లింల దీక్ష
హాజరై సంఘీభావం తెలిపిన టీపీసీసీ చీఫ్
బషీర్‌బాగ్‌లో ముస్లింల ర్యాలీ
19న భారీ నిరసన సభ: అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్/బర్కత్‌పుర, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం హైదరాబాద్‌లో ముస్లింలు భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమంటూ ట్యాంక్‌బండ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. అలాగే లిబర్టీ చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నిరసన దీక్షకు టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్ గౌడ్ సంఘీభావం హాజరై సంఘీభావం తెలిపారు. ఎంపీ ఇమ్రాన్ మసూద్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్, టీజీఎంఆర్‌ఈఐఎస్ చైర్మన్ ఫహీం ఖురేషి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ ఖుష్రూ పాషా, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం, షేక్ అక్బర్, ఉస్మాన్ హల్ అజ్రీ తదితరులు పాల్గొన్నారు. వక్ప్ సవరణ చట్టంతో ముస్లింలకు తీవ్ర నష్టం జరుగుతుందని, దాన్ని రద్దు చేయాలని మాజీ ఎంపీ వీ హనుమంతరావు డిమాండ్ చేశారు.
కాగా, వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న సాయంత్రం ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో దారుల్‌సలాంలో భారీ నిరసన సభ నిర్వహించనున్నట్లు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బోర్డు అధ్యక్షుడు ఖలీద్ సైఫుల్లా రెహ్మనీ అధ్యక్షతన జరిగే సభలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముస్లిం మత నాయకులు, ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. వక్ఫ్ ఆస్తుల రక్షణ పేరుతో చేసిన చట్టం వక్ఫ్ విలువైన ఆస్తులను ఇతరులకు ధారాదత్తం చేసేలా ఉందని విమర్శించారు. టీటీడీలో హిందువులు తప్ప ఇతర మతస్థులు ఉండరాదని తొలగిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ముస్లింలకు సంబంధించిన ధార్మిక సంస్థలో ఇతర మతస్థులను సభ్యులుగా చేర్చే వక్ఫ్ సవరణ చట్టానికి ఎలా మద్దతు పలుకుతారని ఒవైసీ ప్రశ్నించారు. చంద్రబాబు, నితీశ్ తదితరులు ఈ చట్టానికి మద్దతు ప్రకటించి ముస్లింలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పులివెందుల అభివృద్ధి పేరుతో జగన్ మోసం
ఏపీలో ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్..
టీడీపీ కార్యకర్తపై కేసు.. మరికాసేపట్లో అరెస్టు..
For More AP News and Telugu News
Updated Date - Apr 14 , 2025 | 03:39 AM