Mahesh Kumar Goud: బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు కట్టుబడి ఉన్నాం!
ABN, Publish Date - Jun 21 , 2025 | 03:45 AM
స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, తాను ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్నామని తెలిపారు.
స్థానిక ఎన్నికలపై కోర్టు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం
మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ అంశంపై మాట్లాడొద్దు: మహేశ్‌గౌడ్
కొండా మురళి వ్యాఖ్యలపై నివేదిక తెప్పించుకుంటానని వెల్లడి
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, తాను ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్నామని తెలిపారు. కోర్టు నిర్ణయం వెలువడాల్సి ఉందని, అలాగే పార్టీలో, క్యాబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకునే దాకా ఈ అంశంపై మాట్లాడొద్దని మంత్రులకు సూచించినట్లు చెప్పారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు సాంకేతిక అడ్డంకులు ఉన్నది వాస్తవమని, దీనిపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని తెలిపారు. వీలైనంత త్వరగా స్థానిక ఎన్నికలు నిర్వహించి కార్యకర్తలకు న్యాయం చేయాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. దీనిపై మూడు రోజుల్లో పార్టీ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. కోర్టు పరిధిలో ఉన్న స్థానిక ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడినందునే తాను అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వివరించారు. అయితే, పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకే మాట్లాడానని, వేరే ఉద్దేశం లేదని పొంగులేటి వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు. కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన అంశాన్ని మీడియా ప్రచురించిందని చెప్పారన్నారు. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా తమ పరిధిలో లేని అంశాల గురించి మాట్లాడొద్దని, ఇతరుల శాఖల్లో జోక్యం చేసుకోవడం తగదని సూచించారు. విధానపరమైన అంశాల విషయంలో పార్టీ పరంగా చర్చించి, క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్న తర్వాత మాట్లాడితే ఎలాంటి అభ్యంతరం ఉండబోదని స్పష్టం చేశారు. అంతర్గతంగా మాట్లాడుకున్న అంశాలను మీడియా ముందు మాట్లాడవద్దంటూ పార్టీ నేతలకు సూచించానన్నారు. కొండా మురళి వ్యాఖ్యలపై ఇరు వైపుల నుంచీ ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై తాను నివేదిక తెప్పించుకుంటానని తెలిపారు. అక్కడి డీసీసీ అధ్యక్షుడు, పరిశీలకుడి నుంచి నివేదిక వచ్చిన తర్వాత దానిపై స్పందిస్తానని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసినందున, మళ్లీ తనకే టికెట్ ఇస్తారన్న భావనతో అజారుద్దీన్ మాట్లాడి ఉంటారన్నారు.
24న టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ!
హాజరు కానున్న సీఎం రేవంత్‌రెడ్డి
కొత్తగా ఏర్పాటైన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) తొలిసారిగా ఈ నెల 24న గాంధీభవన్‌లో సమావేశం కానుంది. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. స్థానిక ఎన్నికల సన్నద్ధత, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే కార్యాచరణ, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. పీఏసీ భేటీ అనంతరం పార్టీ సీనియర్ నేతలతో ఏర్పాటైన టీపీసీసీ సలహా కమిటీ సమావేశం జరగనుంది. ఆ తర్వాత కొత్తగా నియమితులైన టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సీఎం రేవంత్‌రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు సమావేశమై, వారికి నియామక పత్రాలను అందజేస్తారు.
ఇవి కూడా చదవండి
విశాఖ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
మెట్రో రైలులో అలజడి సృష్టించిన పాము..
Updated Date - Jun 21 , 2025 | 03:45 AM