KTR: రేవంత్ రెడ్డిని బీజేపీ కాపాడుతోంది
ABN, Publish Date - Jul 01 , 2025 | 04:06 AM
నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీట్‌లో పేరున్న రేవంత్ రెడ్డిని బీజేపీ కాపాడుతోందని, ఇది కుమ్మక్కు రాజకీయమేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
బీజేపీ, కాంగ్రె్‌సది కుమ్మక్కు రాజకీయం
అమిత్ షా... ఓ నయా గజిని: కేటీఆర్
హైదరాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీట్‌లో పేరున్న రేవంత్ రెడ్డిని బీజేపీ కాపాడుతోందని, ఇది కుమ్మక్కు రాజకీయమేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఢిలీలో కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారిందని అమిత్ షా గొంతుచించుకుంటున్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీయేనని ఆయన మరిచినట్లున్నారని ధ్వజమెత్తారు. ఆయన ఓ నయా గజిని అని ఎద్దేవా చేశారు. ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని స్వయంగా దేశ ప్రధాని మోదీనే విమర్శిస్తే, ఏ ఒక్క కేంద్ర సంస్థ అయినా విచారణ చేపట్టిందా? అని నిలదీశారు. బావమరిది సృజన్‌రెడ్డికి 1,137 కోట్ల విలువైన అమృత్ పనుల కాంట్రాక్టును ఎలాంటి నిబంధనలు పాటించకుండా రేవంత్ రెడ్డి కట్టబెడితే కేంద్ర ప్రభుత్వం కనీస విచారణ జరపలేదని గుర్తుచేశారు.
అన్ని సాక్ష్యాలతో తాము ఫిర్యాదుచేసినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. మిస్ వరల్డ్ పోటీలకు రూ.200 కోట్లు ఖర్చు పెట్టిన రేవంత్ ప్రభుత్వం.. గురుకులాల్లో చదివే పిల్లలకు యూనిఫాంలు, భోజనం అందించడానికి డబ్బుల్లేవని చెప్పడం సిగ్గుచేటు అంటూ రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తెలంగాణ ప్రజలు సరైన సమయంలో ఈ రెండు పార్టీలకు కర్రు కల్చి వాత పెడతారని హెచ్చరించారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన కర్మ తమకు పట్టలేదని, అది ఓ పనికిమాలిన కేసు అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తప్పులను కప్పి పుచ్చుకోవడానికి బీఆర్‌ఎ్‌సను బద్నామ్ చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో సోమవారం జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోదీ, చంద్రబాబు చేతిలో రేవంత్ కీలు బొమ్మ అని విమర్శించారు.
Updated Date - Jul 01 , 2025 | 04:06 AM