కొప్పుల అక్రమ ఆస్తుల చిట్టాను బయటకు తీస్తాం
ABN, Publish Date - May 20 , 2025 | 11:52 PM
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాష్ట్ర వ్యాప్తంగా కూడగట్టిన అక్రమ ఆస్తుల చిట్టాను బయటకు తీస్తామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ధర్మారం, మే 19 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాష్ట్ర వ్యాప్తంగా కూడగట్టిన అక్రమ ఆస్తుల చిట్టాను బయటకు తీస్తామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధర్మారం, వెల్గటూర్ మండలాల కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలతో గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్లను సందర్శిద్దామని, అక్కడి మంత్రులు చేసిన అభివృద్ధిని తోటి మంత్రిగా ధర్మపురి నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారో చెప్పాలని ప్రశ్నించారు. ధర్మపురి నియోజకవర్గ డీఎంఎఫ్‌టి నిధులు 15 వందల కోట్లు సిద్దిపేటకు, 2 వేల కోట్లు గజ్వెల్‌కు తీసుకుపోతుంటే ఎందుకు మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్‌రావు మేడారంలో రాత్రిళ్లు బస చేసి మన నీళ్లను సిద్దిపేటకు తీసుకపోతుంటే కొప్పుల ఎందుకు అడ్డుకోలేదని అడ్లూరి ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రిగా ఉండి నియోజక వర్గానికి చేసిన ఒక్క పని చూపించాలని ఎద్దేవా చేశారు. మీ పాలనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతీ ఒక్కరిపై అక్రమ కేసులు పెట్టారని, సామాన్య ప్రజలనుంచి నీకు వ్యతిరేకంగా వార్తలు రాసిన రిపోర్టర్ల దాక కేసులు పెట్టి వేధించావని గుర్తుచేశారు. ప్రభుత్వం వచ్చి 15 నెలల కాలంలోనే మీకు ప్రభుత్వంపై, నాపై అంతా ఆక్రోశం ఎందుకని, మరో మూడు సంవత్సరాల వరకు 10 ఏండ్లలో నీవు చేయని అభివృద్ధిని నేను చేసి చూపిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. వెల్గటూర్ మండలంలోని పాశిగామలో ఇథనాల్ ప్రాజెక్ట్‌ను ప్రతిపక్ష నాయకుడిగా నేను వ్యతిరేకిస్తే నాపై అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్లూరిపై పెట్టిన నాన్ బేయిలేబుల్ కేసుల ప్రతులను పత్రిక సమావేశంలో ప్రదర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో భూములు కోల్పోయిన రైతులకు చొప్పదండి నియోజకవర్గంలో ఎకరాకు 20 లక్షలు ఇప్పిస్తే, ఇక్కడి రైతులకు 7 లక్షల నష్టపరిహారం ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని, మీకు మెగా కంపెనీకి ఉన్న లోపాయికార ఒప్పందం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004 నుంచి 2023 వరకు కొప్పుల రాష్ట్ర వ్యాప్తంగా సంపాదించిన అక్రమ ఆస్తులను, హైదరాబాద్ శివారులోని స్టోన్ మెటల్ క్వారీస్ సంబంధించిన అన్ని వివరాలు ప్రజలు ముందు పెడుతామని తెలిపారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టి మాజీ మంత్రి మనపై ఉసిగొల్పుతున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు సంయమనం పాటించి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తె స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలే బుద్ది చెప్తారని కార్యకర్తలకు హితకు పలికారు.
Updated Date - May 20 , 2025 | 11:52 PM