అన్నదాతల ‘భగీరథ’ యత్నం
ABN, Publish Date - Jul 20 , 2025 | 11:36 PM
వానాకాలం ప్రారంభమైనా ఆశించిన వర్షాలు కురవడం లేదు. సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా కూడా మండల వ్యాప్తంగా వరినాట్లు పూర్తికాలేదు. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వ్యవసాయ బావుల్లో, ఊర చెరువుల్లో, కుంటల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి.
ఓదెల, జూలై 20 (ఆంధ్రజ్యోతి): వానాకాలం ప్రారంభమైనా ఆశించిన వర్షాలు కురవడం లేదు. సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా కూడా మండల వ్యాప్తంగా వరినాట్లు పూర్తికాలేదు. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వ్యవసాయ బావుల్లో, ఊర చెరువుల్లో, కుంటల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. గతేడాది వానాకాలంలో ఇదే సమయంలో 60 శాతం నాట్లు పూర్తికాగా, ప్రస్తుతం 20 శాతం కూడా కాలేదు. దీంతో అన్నదాతలు సాగు నీటి భగీరథ యత్నాలు చేస్తున్నారు. దీంతో రైతులు అప్పులు చేసి యంత్రాలతో బావులు తవ్విస్తున్నప్పటికీ చుక్క నీరు కూడా కనబడడం లేదు. ఓదెల, పొత్కపల్లి, కనగర్తి, కొలనూర్, గుంపుల, గూడెం, ఇందూర్తి, జీలకుంట, కొమిర, మడకలో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలకు గురైనప్పటికీ యంత్రాలతో వ్యవసాయ బావులు తవ్విస్తున్నారు. లక్షల కొద్ది ఖర్చు చేసినప్పటికీ చుక్కనీరు కనబడక పోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.
సాగులో లేని 19 వేల ఎకరాలు
మండల వ్యాప్తంగా 27వేల ఎకరాల మేరకు సాగు భూములు ఉండగా, ఇందులో ప్రస్తుతం 3,950 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అలాగే 3,800 వేల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. మిగతా 19,250 ఎకరాల వ్యవసాయ భూములకు నీరు లేక సాగుకు నోచుకోలేదు. ప్రస్తుతం ఎగువ ప్రాంతంలోని కుంటల సమీపంలో ఉన్న బావుల్లో కొంతమేరకు భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండడంతో వీటి ఆధారంగా సన్న రకం వరినాట్లు పూర్తి కావస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షం పత్తి పంటకు కొంత ఊరట నిచ్చింది. మరో కొద్ది రోజుల వరకు అనావృష్టి ఇలాగే ఉంటే సాగు చేసిన వరి పంటలకు సైతం నీరందక ఇవి కూడా చేతికందే పరిస్థితి లేకుండా పోతుంది
వ్యవసాయ బావుల తవ్వకానికి లక్షల్లో ఖర్చు
వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో భూగర్భ జలాల కోసం ఆశలతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. లక్షల రూపాయలు వెచ్చిస్తున్నా భూగర్భ జలాలు కనబడకపోవడంతో రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. ఒక్కో బావికి రూ.1.50 లక్షల నుంచి రూ.2.20 లక్షల మేరకు ఖర్చు చేస్తున్నారు. ఆశించిన ఫలితాలు లేకపోవడంతో పెట్టిన ఖర్చులు వృథా అయి అప్పులు మిగులుతున్నాయి. ప్రస్తుతం నీరు సమృద్ధిగా ఉన్న బావుల్లో కేవలం రెండు నుంచి ఐదు గంటలపాటు సరిపడ నీరు లభిస్తుంది. తర్వాత బావుల్లో నీటి జాడలు కనబడడం లేదు.
Updated Date - Jul 20 , 2025 | 11:36 PM