సుల్తానాబాద్ ధాన్యం కుంభకోణం
ABN, Publish Date - Jul 12 , 2025 | 12:14 AM
సుల్తానాబాద్ లో భారీ ధాన్యం కుంభకోణం బయటపడిందని, రూ 18 కోట్ల 78 లక్షల విలువ గల ప్రభుత్వ ధాన్యం మాయమైందని రాష్ట్ర సివిల్ సప్లయిస్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డీ ప్రభాకర్ రావు అన్నారు. సుల్తానాబాద్ లో గురువారం రాత్రి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఐదు లారీల ధాన్యాన్ని పట్టుకున్నారు.
సుల్తానాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ లో భారీ ధాన్యం కుంభకోణం బయటపడిందని, రూ 18 కోట్ల 78 లక్షల విలువ గల ప్రభుత్వ ధాన్యం మాయమైందని రాష్ట్ర సివిల్ సప్లయిస్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డీ ప్రభాకర్ రావు అన్నారు. సుల్తానాబాద్ లో గురువారం రాత్రి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఐదు లారీల ధాన్యాన్ని పట్టుకున్నారు. ఈ కేసులో విచారణ జరిపిన రాష్ట్ర స్థాయి అధికారులకు విస్తుబోయే విషయాలు వెలుగు చూశాయి. శుక్రవారం ఇందుకు సంబందించిన వివరాలను ఓఎస్‌డీ విలేకరులకు వెల్లడించారు. పట్టుబడిన లారీల డ్రైవర్లను విచారించగా ధాన్యం సౌభాగ్యలక్ష్మి రైస్ మిల్లు నుంచి లోడింగ్ చేసుకున్నట్లు చెప్పారని తెలిపారు. తమ బృందాలు సాభాగ్యలక్ష్మితోపాటు సాయి మహాలక్ష్మి రైస్‌మిల్లులో గురు, శుక్రవారాల్లో తనిఖీలు నిర్వహించారన్నారు. ఈ రెండు మిల్లులకు బండారి మారుతి, శారద ఓనరుగా ఉన్నాయని, ఇటీవలే సంతోష్ రెడ్డి అనే మరో వ్యక్తి వీటిని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాయి మహాలక్ష్మి మిల్లుకు ప్రభుత్వం 2023-24 రబీ పంటకు సంబంధించి 80 వేల 966 క్వింటాళ్ళు ధాన్యం ఇచ్చింది. ఇందుకు వారు 35 వేల క్వింటాళ్ళ బియ్యంను తిరిగి ప్రభుత్వంకు అప్పగించాలి. కానీ 10 వేల 84 క్వింటాళ్లు మాత్రమే ఇచ్చారు.
64 వేల 922 క్వింటాళ్ల ధాన్యం ఆ మిల్లులో నిలువ ఉండాలి. తనిఖీలలో కేవలం 3 వేల 266 క్వింటాళ్లు మాత్రమే ఉన్నాయి. 61 వేల 53 క్వింటాళ్ల ధాన్యం మాయం అయినట్లు గుర్తించామని ఓఎస్‌డీ ప్రభాకర్ రావు తెలిపారు. అలాగే సౌభాగ్యలక్ష్మి మిల్లుకు ప్రభుత్వం సీఎంఆర్ కింద 2023 - 24 రబీలో 31 వేల 160 క్వింటాళ్ళ దాన్యం ఇచ్చిందని ఇందుకు గా ఈ మిల్లు వారు తిరిగి ప్రభుత్వానికి 21 వేల 190 క్వింటాళ్ల బియ్యంను పెట్టాలి. కానీ ఇప్పటి వరకు కేవలం 5 వేల 151 క్వింటాళ్ళ బియ్యం మాత్రమే పెట్టారని, ఇంకా మిల్లులో 23 వేల 500 క్వింటాళ్ళ ధాన్యం నిలువ ఉండాల్సి ఉండగా అందులో 10 వేల 880 క్వింటాళ్ళ మాయమైనట్లు గుర్తించామని ఓఎస్‌డీ వివరించారు.
72 వేల 533 క్వింటాళ్ళ ధాన్యం అక్రమ తరలింపు
సాయి మహాలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి రైస్‌మిల్లుల నుంచి 72 వేల 533 వేల క్వింటాళ్ల ధాన్యం ఇతర ప్రాంతాల మిల్లులకు తరలిపోయినట్లు విచారణలో మిల్లు సిబ్బంది ద్వారా తేల్చామని అఽధికారులు తెలిపారు. దీని విలువ 18 కోట్ల 78 లక్షలు ఉంటుందని ఓఎస్‌డీ ప్రభాకర్ రావు తెలిపారు. పది రోజుల్లో ఈ రెండు మిల్లుల నుంచి 3 వేల క్వింటాళ్లు చొప్పదండిలోని శ్వేత ఇండస్ట్రీస్‌కు, మరో 16 వేల 560 క్వింటాళ్ళు కరీంనగర్ జిల్లాలోని రఘురామ రమేష్ రైస్‌మిల్లుకు, 1500 క్వింటాళ్ళు శంకరపట్నం మండలం తాడికల్ రాజరాజేశ్వర మిల్లుకు, హన్‌మాన్, రాజరాజేశ్వర మిల్లులకు చేర్చారని వివరించారు. కాగా సుల్తానాబాద్‌లో గురువారం రాత్రి పట్టుబడ్డ ఐదు లారీలలో రెండు లారీల ధాన్యం చొప్పదండిలోని శ్వేత ఇండస్ట్రీస్‌కు, మరో మూడు లారీల ధాన్యంను జమ్మికుంట ప్రాంతంలోని మిల్లుకు తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. పట్టుబడిన ధాన్యం విలువ రూ.35 లక్షలు ఉంటుందని ఓఎస్‌డీ ప్రభాకర్ రావు తెలిపారు. ఉన్నతాదికారులకు నివేదికలు పంపామన్నారు. తనిఖీలలో పలు రాష్ట్ర విభాగాల అధికారులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 12 , 2025 | 12:14 AM