మురిపించి ముఖం చాటేసి..
ABN, Publish Date - Jun 20 , 2025 | 12:47 AM
రోహిణి కార్తెతోనే వర్షాలు కురిసి మురిపించిన నైరుతి మొఖం చాటేసింది. ఎండల తీవ్రత తగ్గనంటున్నది. ఈసారి ముందస్తుగానే నైరుతి ఆగమనం అనడంతో రైతులు ఎంతో ఆనందంతో సాగు పనులు మొదలుపెట్టారు. వానాకాలం సీజన్ ప్రారంభమై పదిహేను రోజులు దాటినా వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన పడుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
రోహిణి కార్తెతోనే వర్షాలు కురిసి మురిపించిన నైరుతి మొఖం చాటేసింది. ఎండల తీవ్రత తగ్గనంటున్నది. ఈసారి ముందస్తుగానే నైరుతి ఆగమనం అనడంతో రైతులు ఎంతో ఆనందంతో సాగు పనులు మొదలుపెట్టారు. వానాకాలం సీజన్ ప్రారంభమై పదిహేను రోజులు దాటినా వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం సీజన్‌లో 2.43 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయడానికి సిద్ధమయ్యారు. తొలకరి జల్లులు పలకరించడంతో రైతులు దుక్కులు దున్నుకొని ఆరుతడి పంటలకు విత్తనాలు వేసుకున్నారు. జిల్లాలో ఇప్పటికే 25వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసుకున్నారు. 1.84 ఎకరాల్లో వరి సాగు కోసం ఐదు వేల ఎకరాలు నారుమడులు సిద్ధం చేసుకున్నారు. వర్షాలు లేక జిల్లాలో నాట్లు మొదలు కాలేదు. ముందస్తుగానే వేసుకున్న పత్తి విత్తనాలు భూమిలోనే మాడిపోతున్నాయి మొలక వచ్చిన పత్తి మొక్కలు వాడిపోతున్నాయి. భూగర్భ జలాలు అందుబాటులో లేకపోవడంతో పాటు జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర మిడ్ మానేరు, అన్నపూర్ణ అనంతగిరి ప్రాజెక్ట్‌లు, చెరువులు, కుంటల్లో నీళ్లు అడుగంటడంతో వరి సాగు వైపు రైతులు వెనకడుగు వేశారు.
జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో వానాకాలం సాగు..
జిల్లాలో వానాకాలంలో 2 లక్షల 43 వేల 773 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయడానికి రైతులు సిద్ధమయ్యారు. వరి సాగు లక్షా 84 వేల 860 ఎకరాలు, మొక్కజొన్న 1,600 ఎకరాలు, పత్తి 49,760 ఎకరాలు, కందులు 1,155 ఎకరాలు, పెసర 79 ఎకరాలు, ఇతర పంటలు 6,304 ఎకరాలు, ఇతర పంటలు 6,900 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనాలు వేశారు. వానాకాలం సాగుకు ఎరువులు 56,060 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. యూరియా 25,370 మెట్రిక్ టన్నులు, డీఏపీ 3,460 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 22,390 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 4,115 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 725 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు ప్రస్తుతం జిల్లాలో పత్తి 25 ఎకరాల్లో విత్తనాలు వేసుకున్నారు. నాట్ల కోసం ఐదు వేల ఎకరాల్లో నారుమడులు సిద్ధం చేసుకున్నారు. నారుమడులు వర్షాలు లేకుంటే ముదిరిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరికొందరు రైతులు విత్తనాలు తెచ్చుకున్నామని, వర్షాల కోసం ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు.
మొలక దశలోనే పత్తి..
జిల్లాలో వర్షాలు లేకపోవడంతో భూమిలో తేమ శాతం పూర్తిగా తగ్గిపోయి, పత్తి విత్తనాలు మొలకెత్తని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 49,760 ఎకరాల్లో పత్తిసాగుకు సిద్ధమైన రైతులు 25 వేల ఎకరాల్లో విత్తనాలు వేసుకున్నారు. ఇందులో ప్రధానంగా ఇల్లంతకుంట, గంభీరావుపేట, ముస్తాబాద్, సిరిసిల, తంగళ్లపలి, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, బోయినపలి, చందుర్తి, కోనరావుపేటలో, రుద్రంగి, వేములవాడ, వేములవాడ రూరల్‌లో పత్తి విత్తనాలు వేసుకున్నారు. కొన్ని చోట్ల విత్తనాలు మొలకెత్తినా వర్షాలు లేకపోవడంతో ఎదుగుదల ఆగిపోయింది. భూమిలో వేడి తగ్గకపోవడంతో విత్తనాలు మాడిపోయి. మళ్లీ విత్తనాలు వేసుకునే పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
లోటు వర్షపాతమే..
నైరుతి రుతుపవనాలు వచ్చి తొలకరి పలకరించినా వర్షాలు మాత్రం కురవకపోవడంతో జిల్లాలో 64 శాతం లోటు వర్షపాతమే నమోదైంది. గత సంవత్సరం 728.5 సాధారణ వర్షపాతానికి 896.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ సంవత్సరం జూన్ 1నుంచి 19వ తేది వరకు జిల్లాలో 64.0శాతం లోటు వర్షపాతమే నమోదైంది. తొమ్మిది మండలాల్లో అధిక లోటు వర్షపాతం ఉంది. జిల్లాలో ఇప్పటివరకు 80.3 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 29.2 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. కురిసిన వర్షపాతం కూడా రైతులకు ఉపయోగకరంగా లేకుండా పోయింది.
వానాకాలంలోనూ ఎండలు..
వర్షాకాలం వచ్చినా ఎండలు మాత్రం తగ్గడం లేదు. జిల్లాలో ఇప్పటికి పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 36.7 నుంచి 37.0 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు సతమతం అవుతూనే ఉన్నారు. వర్షాలు ఎప్పుడు పడుతాయా అని రైతులతో పాటు సామాన్య జనం కూడా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఎండాకాలాన్నే తలపిస్తోంది.
జిల్లాలో ఈనెల 19 వరకు నమోదైన వర్షపాతం(మిల్లీమీటర్లలో)
మండలం సాధారణం కురిసింది లోటు
రుద్రంగి 88.6 42.6 52.0
చందుర్తి 99.3 49.6 50.0
వేములవాడ రూరల్ 86.0 24.8 71.0
బోయినపల్లి 79.3 25.4 68.0
వేములవాడ 89.9 17.8 80.0
సిరిసిల్ల 84.3 22.1 74.0
కోనరావుపేట 75.5 38.0 50.0
వీర్నపల్లి 71..4 23.7 67.0
ఎల్లారెడ్డిపేట 75.0 24.1 68.0
గంభీరావుపేట 74.4 31.5 58.0
ముస్తాబాద్ 65.0 18.8 71.0
తంగళ్లపల్లి 89.8 25.1 72.0
ఇల్లంతకుంట 65.5 36.3 45.0
-----------------------------------------------------------------------------------------------------
సగటు వర్షపాతం 80.3 29.2 64.0
------------------------------------------------------------
Updated Date - Jun 20 , 2025 | 12:47 AM