ఉపాధి పనుల్లో పొదుపు మంత్రం
ABN, Publish Date - Jul 06 , 2025 | 12:13 AM
గ్రామీణ ప్రాంత కూలీలకు వరంగా మారిన మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో గతంలో కంటే సగం వరకు పని దినా లను కేంద్ర ప్రభుత్వం తగ్గించడంతో ఉపాధి కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పని దినాలను ప్రాధా న్యతా కార్యక్రమాలకు వాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పొదుపు మంత్రం పాటిస్తున్నది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
గ్రామీణ ప్రాంత కూలీలకు వరంగా మారిన మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో గతంలో కంటే సగం వరకు పని దినా లను కేంద్ర ప్రభుత్వం తగ్గించడంతో ఉపాధి కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పని దినాలను ప్రాధా న్యతా కార్యక్రమాలకు వాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పొదుపు మంత్రం పాటిస్తున్నది. జిల్లాకు కేటాయించిన 13.99 లక్షల పని దినాల్లో 10.14 లక్షల పని దినాలు 72.49 శాతం పూర్తి కాగా, ఇంకా 3.85 లక్షల పని దినాలు మిగిలి ఉన్నాయి. మిగిలిన పని దినాలను వన మహోత్సవం కార్యక్రమానికి సద్వినియోగం చేసుకోవ డంతోపాటు కూలీల సగటు కూలీ 300 రూపాయలకు పైగా వచ్చే విధంగా వారిని ప్రోత్సహించాలని ఉన్నతా ధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సగటు కూలీ 247.47 రూపాయలు వస్తున్నది.
పని దినాలు తక్కువగా కేటాయించడం వల్ల తద్వారా మెటీరియల్ కంపొనెంట్ కింద తక్కువ నిధులు సమకూరనున్నాయి. దీంతో గ్రామాల్లో శాశ్వత నిర్మాణాలకు నిధుల కొరత ఏర్పడే ప్రమాదం నెలకొ న్నది. పని దినాలు తక్కువైనా, దినసరి కూలీ సగటున 300 రూపాయలకు పైగా వచ్చే విధంగా కూలీలు పని చేస్తే మెటీరియల్ కంపొనెంట్ నిధులు పెరగనున్నా యని అధికారులు భావిస్తున్నారు. ఉపాధిహామీ చట్టం ప్రకారం కేటాయించిన నిధుల్లో తప్పనిసరిగా 60 శాతం కూలీలకు పనులు కల్పిస్తే, తద్వారా ఖర్చు అయ్యే నిధుల్లో 40 శాతం నిధులను మెటీరియల్ కంపొనెంట్ పనులకు కేటాయిస్తారు. జిల్లాలోని 269 గ్రామ పంచాయతీల పరిధిలో లక్షా 19 వేల జాబ్ కార్డులు జారీ చేయగా, 2 లక్షల 44 వేల మంది కూలీలు నమోదై ఉన్నారు. కానీ రెగ్యులర్‌గా 71 వేల మంది వరకు కూలీలు ఉపాధిహామీ పనులకు వస్తుంటారు.
10.14 లక్షల పని దినాలు పూర్తి..
ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జిల్లాకు 13.99 లక్షల పని దినాలను కేటాయించింది. ఇప్పటి వరకు 10.14 లక్షల పని దినాలు పూర్తి కాగా, ఇంకా 3.85 పని దినాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పని దినాలను ప్రభుత్వం జాగ్రత్తగా వాడుకోవాలని భావిస్తున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 25.55 లక్షల పని దినాలు కేటాయిస్తే, ఆ తర్వాత అదనపు పని దినాలను కలుపుకుని 27.07 లక్షల పని దినాలను కూలీలు సద్వినియోగం చేసుకున్నారు. కూలీలకు 58 కోట్ల 68 లక్షల 93 వేల రూపాయలు వేతనాల కింద చెల్లించారు. తద్వారా మెటీరియల్ కంపొనెంట్ కింద 30 కోట్ల 44 లక్షల రూపాయలు కేటాయించారు. ఈ నిధులతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, మురికి కాలువలు, గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు, ఇతరత్రా పనులు చేపట్టారు. ఈ ఏడాదికి జిల్లాలో చేపట్టిన 10.14 లక్షల పని దినాలను సద్వినియోగం చేసుకున్న కూలీలకు వేతనాల కింద 27 కోట్ల 35 లక్షల 18 వేల రూపాయలు చెల్లించారు. తద్వారా మెటీరియల్ కంపొనెంట్ కింద 16 కోట్ల 72 లక్షల 62 రూపాయలు సమకూరగా, వివిధ పనుల కోసం 3 కోట్ల 83 లక్షల 59 ఖర్చు చేయగా, 12 కోట్ల 89 వేల రూపాయలు జనరేట్ అయి ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయానికి జిల్లాలో 15 లక్షలకు పైగా పని దినాలను పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం పని దినాలను తగ్గించడం వల్ల ఉపాధి కూలీలకు పనులు కల్పించే పరిస్థితి లేకుండా పోతున్నది. ప్రస్తుతం ఉన్న 3 లక్షల 85 వేల పని దినాలు ఈ నెలలో చేపట్టనున్న వన మహోత్సవం మొక్కలు నాటే కార్యక్రమానికే సద్వినియోగం చేసుకోను న్నారు. మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వడంతో పాటు వాటి సంరక్షణకు నీళ్లు పోయడం, ఆ మొక్కల చుట్టూ గడ్డి, ఇతర కలుపు మొక్కలను తొలగించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మున్నెన్నడూ లేని విధంగా ఉపాధి పని దినాలను 40 శాతానికి పైగా తగ్గించడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. కూలీలకే కల్పించే పని దినాల వల్ల గ్రామాల్లో కూడా శాశ్వత నిర్మాణ పనులకు నిధుల కొరత ఉండేది కాదు. కానీ పని దినాలు తగ్గించడం అటు.. రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు.. కూలీలకు శరాఘాతంగా మారింది.
Updated Date - Jul 06 , 2025 | 12:13 AM