రిజర్వేషన్లు అనుకూలించేనా...?
ABN, Publish Date - Jul 08 , 2025 | 12:29 AM
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. గతంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు 50శాతం ఉండేవి. ఈ ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్ ఉంది. దీంతో రిజర్వేషన్లు ఏ విధంగా ఖరారు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆశావహులు మాత్రం ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నారు.
గోదావరిఖని, జూలై 7(ఆంధ్రజ్యోతి): యాభై డివిజన్లుగా ఉన్న రామగుండం కార్పొరేషన్ ఇప్పుడు 60వార్డులుగా మారింది. వెంకట్రావ్‌పల్లి, లింగాపూర్, ఎల్కలపల్లి గేట్, అక్బర్‌నగర్ తదితర ప్రాంతాలను కార్పొరేషన్‌లో విలీనం చేసి వార్డుల సంఖ్యను పెంచారు. జనవరిలో కార్పొరేషన్ పాలకమండలి పదవి ముగిసింది. ఆరు మాసాలుగా ప్రత్యేకాధికారి పాలనలోనే పరిపాలన కొనసాగుతున్నది. వార్డుల విభజన ఖరారుతో కార్పొరేటర్లుగా పోటీచేసే ఆశావాహులు ఇప్పటికే ప్రజల చెంతకు చేరుతున్నారు. వార్డుల రిజర్వేషన్‌పై కూడా చర్చ జరుగుతున్నది. ప్రధానంగా మేయర్ పదవి రిజర్వేషన్లపై ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. రిజర్వేషన్ ఎస్‌సీలకే కొనసాగుతుందా, మారుతుందా అనే అంశంపై ఇక్కడి రాజకీయాలు కేంద్రీకతమై ఉన్నాయి. రాష్ట్రంలోని కార్పొరేషన్‌ల అన్నీంటిని పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్ల దామాషా పద్ధతిలో మేయర్ రిజర్వేషన్ నిర్ణయం జరిగేది. మున్సిపల్ యాక్ట్ 2019ను కొత్త చట్టం అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ యాక్ట్ రిజర్వేషన్లు రెండు పర్యాయాలు ఖచ్చితంగా ఉండాలనే నిబంధనను పెట్టారు. రామగుండం కార్పొరేషన్‌లో 2019లో ఎన్నిక జరిగింది. అప్పుడు మేయర్ పదవి ఎస్‌సీకి కేటాయించారు. ఈ దామాషాలో మళ్లీ జరిగే ఎన్నికల్లో సైతం రామగుండం కార్పొరేషన్ మేయర్ పదవి ఎస్‌సీలకే ఉంటుంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ చట్టాన్ని మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. 2019 చట్టంలో చేసిన కొన్ని సవరణలపై గవర్నర్ ఆమోద ముద్ర పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు తీసుకువచ్చి పదేళ్ల రిజర్వేషన్‌ను ఐదేళ్లకు మార్చారు. మున్సిపల్ చట్టాన్ని మార్చి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ కేటాయింపు విషయంలో ఐదేళ్లకు కుదిస్తే రామగుండం కార్పొరేషన్ మేయర్ పదవి రిజర్వేషన్ కూడా మారే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో కార్పొరేషన్లు పెరగడం వల్ల కూడా రిజర్వేషన్లలో మార్పులు కలిగే అవకాశం లేకపోలేదు. దీనికి తోడు జీహెచ్‌ఎంఎసీ పరిధిలోని కార్పొరేషన్‌లను మహానగరంగా మార్చి, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలను వేరు చేసే ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నట్టు తెలుస్తున్నది. ఇది జరిగితే మున్సిపాలిటీల రిజర్వేషన్లలో మార్పులు, చేర్పులు జరుగుతాయి. రామగుండం కార్పొరేషన్‌లో పది డివిజన్లు పెరగడంతో మేయర్ పదవి రిజర్వేషన్‌పై ప్రభావం చూపనున్నది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కూడా మేయర్ పీఠం రిజర్వేషన్‌పై మార్పు చేర్పులకు అవకాశం ఏర్పడనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థానిక సంస్థల్లో 42శాతం బీసీలకు రిజర్వేషన్‌ను అమలు చేస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి న్యాయ, సాంకేతికమైన అంశాలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. బీసీ రిజర్వేషన్ అమలులోకి వస్తే కార్పొరేషన్ బీసీ ఖాతాలో పడే అవకాశం లేకపోలేదు. ఇక 2009లో కార్పొరేషన్‌గా ఏర్పడిన రామగుండం తొలిసారి మేయర్ పదవి షెడ్యూల్డ్ కులాలకు కేటాయించారు. అయితే 2014వరకు ఎన్నికలు జరుగలేదు. 2014లో జరిగిన ఎన్నికల సందర్భంలో కూడా మేయర్ పదవి ఎస్‌సీకే రిజర్వు అయ్యింది. 2019లో కూడా ఎస్‌సీ రిజర్వుడుగానే మేయర్ పదవి ఉంది. వరుసగా మూడు దఫాలుగా రామగుండం మేయర్ ఎస్‌సీల ఖాతాలోనే ఉన్నది. 2019 మున్సిపల్ యాక్ట్ వచ్చిన తరువాత రెండు సార్లు ఎస్‌సీలకే రిజర్వు కావాల్సి ఉంది. రాబోయే ఎన్నికల్లో కూడా మేయర్ పదవి ఎస్‌సీలకే కేటాయించాల్సి ఉంటుంది. వార్డుల పెరుగుదల, 42శాతం బీసీల రిజర్వేషన్, 50శాతం మహిళల రిజర్వేషన్ అంశాలతోపాటు మున్సిపల్ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు తీసుకువస్తే రిజర్వేషన్‌లలో మార్పులు కలిగే అవకాశం ఉన్నది. రిజర్వేషన్లు మారితే మేయర్ పదవికి ఎవరు ఏ పార్టీ నుంచి పోటీలో ఉంటారనే ముందస్తు ఊహాగానాలు కూడా రామగుండంలో చక్కర్లు కొడుతున్నాయి.
Updated Date - Jul 08 , 2025 | 12:29 AM