తగ్గిన సన్న బియ్యం అమ్మకాలు
ABN, Publish Date - Jul 27 , 2025 | 12:10 AM
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో రైస్‌మిల్లులు, రైస్‌డిపోలు, కిరాణ షాపుల్లో సన్న బియ్యం అమ్మకాలు తగ్గాయి. దొడ్డు బియ్యాన్ని పాలిషింగ్ చేసి ఇస్తున్నారని, వండితే అన్నం దొడ్డుగా ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ, ప్రతి వినియోగదారుడు రేషన్ సన్న బియ్యాన్ని తీసుక వెళుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో రైస్‌మిల్లులు, రైస్‌డిపోలు, కిరాణ షాపుల్లో సన్న బియ్యం అమ్మకాలు తగ్గాయి. దొడ్డు బియ్యాన్ని పాలిషింగ్ చేసి ఇస్తున్నారని, వండితే అన్నం దొడ్డుగా ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ, ప్రతి వినియోగదారుడు రేషన్ సన్న బియ్యాన్ని తీసుక వెళుతున్నారు. గతంలో 30 నుంచి 40 శాతం వరకు దొడ్డు బియ్యాన్ని వినియోగదారులు రేషన్ డీలర్లకే విక్రయించగా, మరో 30 శాతం బయట బియ్యం దందా చేసే వారికి విక్రయించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జైశ్రీరామ్, హెచ్‌ఎంటీ, చిట్టి ముత్యాలు బియ్యం వండు కుని తినే వాళ్లు 20 శాతం మంది వినియోగదారులు మాత్రమే బయట అమ్ముకుంటున్నారని సమాచారం. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నది. ఎక్కువగా సోనామసూరి, బీపీటీ బియ్యం రేషన్ షాపుల ద్వారా సరఫరా అవుతున్నాయి. జిల్లాలో 2,23,553 రేషన్ కార్డులు ఉండగా, కొత్తగా మరో 12,257 రేషన్ కార్డులను మంజూరు చేశారు. ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తాయని భావించిన కేంద్ర ప్రభుత్వం ఒకేసారి మూడు మాసాలకుగాను రేషన్ భియ్యం పంపిణీ చేయాలని ఆదేశించింది. జూన్, జూలై, ఆగస్టు మాసాలకు కలిపి ఒకేసారి జూన్ నెలలో బియ్యం పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 12,046 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వినియోగదారులకు పంపిణీ చేశారు. ఒక్కో వ్యక్తి పేరిట 6 కిలోల సన్న బియ్యాన్ని ఇస్తున్నారు. ఏప్రిల్, మే నెలలకు నెలనెలా ఇవ్వగా, మూడు నెలల బియ్యం ఒకేసారి ఇవ్వడంతో ప్రతీ కుటుంబంలో సన్న బియ్యం నిల్వలు ఉన్నాయి. గతంలో దొడ్డు బియ్యంలో విటమిన్లు, సూక్ష్మ పోషకాలు గల ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ (ఎఫ్‌ఆర్‌కే) కలిపి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి రెండు నెలలు పంపిణీ చేసిన బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ కలిపి ఇవ్వలేదు. మూడు నెలలకు కలిపి ఒకేసారి ఇచ్చిన సన్న బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ కలిపి ఇవ్వడంతో వినియోగదారులు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో మార్కెట్‌లో సన్న బియ్యం అమ్మకాలు తగ్గిపోయాయి.
మార్కెట్‌లో పడిపోయిన సన్న బియ్యం అమ్మకాలు
రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో బహిరంగ మార్కెట్‌లో అమ్మకాలు 60 శాతానికి పైగా పడి పోయాయి. ప్రైవేట్ విద్యా సంస్థల హాస్టళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, మెస్‌లు నడిపించే వాళ్లు వానాకాలం సీజన్ ముగిసిన తర్వాత డిసెంబర్, జనవరి మాసాల్లో ఒకేసారి రైస్ మిల్లుల నుంచి కొందరు, పెద్ద రైతుల నుంచి కొందరు ఏడాదికి సరిపడా సన్న బియ్యం కొనుగోలు చేశారు. పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉండే రైస్ డిపోలు, కిరాణ షాపుల్లో రిటెయిల్ అమ్మకాలు పడిపోయాయి. బియ్యం ధరలను తగ్గించినా కూడా అమ్మకాలు సాగడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. జైశ్రీరాం బియ్యం మాత్రమే అమ్ముడు పోతున్నాయని చెబుతున్నారు. సోనా మసూరి, బీపీటీ రకం పాత సన్న బియ్యం రెండు నెలల క్రితం వరకు క్వింటాల్‌కు 5,200 నుంచి 5,500 రూపాయలకు, జైశ్రీరాం బియ్యం 7 వేల నుంచి 7,500 రూపాయల వరకు విక్రయించారు. ఒకే సారి మూడు నెలల బియ్యం పంపిణీ చేసిన తర్వాత సన్న బియ్యం అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో బీపీటీ, సాంబమసూరి బియ్యం 4,800 నుంచి 5 వేల వరకు, జైశ్రీరాం బియ్యం 6,400 నుంచి 6,600 రూపాయల చొప్పున ధర తగ్గించినా కూడా అమ్ముడు పోవడం లేదని, తమ వద్ద ఉన్న స్టాకును అమ్ముకోవ డానికే తంటాలు పడుతున్నామని వ్యాపారులు చెబుతు న్నారు. ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీ చేస్తుండడం తో ప్రజలపై బియ్యం కొనుగోలు భారం తప్పినట్ల య్యింది.
Updated Date - Jul 27 , 2025 | 12:10 AM