మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి
ABN, Publish Date - Jun 06 , 2025 | 11:56 PM
ఆపరేషన్ కగార్ పేరుతో మావో యిస్టులపై బూటకపు ఎన్‌కౌంటర్లు ఆపాలని, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ వామపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేశారు.
పెద్దపల్లిటౌన్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ కగార్ పేరుతో మావో యిస్టులపై బూటకపు ఎన్‌కౌంటర్లు ఆపాలని, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ వామపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎరవెల్లి ముత్యంరావు, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమో క్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈదునూరి నరేష్, పౌర హక్కుల సంఘం నాయకులు మాదారపు కుమారస్వామి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతో బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తోందని, మావోయిస్టు పార్టీ చర్చలకు వస్తామని ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామని, డెడ్‌లైన్ పెట్టడం బీజేపీ ప్రభుత్వ రాక్షసత్వానికి నిదర్శనమన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో అడవి, ఖనిజాలు, సహజ వనరులను కార్పొరేట్, మల్టీనేషన్ కంపె నీలకు ధారాధత్తం చేయడం దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశమన్నారు. ఎన్‌కౌంటర్ల పేరుతో అమాయకులైన ఆదివాసి ప్రజలను చంపుతున్నార న్నారు. శత్రువు దేశమైన పాకిస్తాన్‌తో చర్చలు జరిపి కాల్పుల విరమణ చేసిన ప్రభుత్వం, మావోయిస్టు పార్టీతో చర్చలు జరపడానికి వచ్చిన ఆటం కం ఏమిటని ప్రశ్నించారు. ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కల్లేపల్లి అశోక్, జి,జ్యోతి, ప్రశాంత్, కె,కనకరాజు, మల్లయ్య, సూర్య, అశోక్, మల్లేష్, లెనిన్, మానస్ కుమార్, నవీన్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 06 , 2025 | 11:56 PM