వేసవిలో అడవుల సంరక్షణకు చర్యలు
ABN, Publish Date - Apr 19 , 2025 | 11:32 PM
వేసవిలో వన్యప్రాణులు నీరు దొరకక అల్లాడుతుంటాయి. అలాగే చిన్న పొరపాటుతో అడవిలో మంటలు చెలరేగి చెట్లు ఆహుతవుతాయి. మంటలు అంటుకోకుండా, వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
పెద్దపల్లిటౌన్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): వేసవిలో వన్యప్రాణులు నీరు దొరకక అల్లాడుతుంటాయి. అలాగే చిన్న పొరపాటుతో అడవిలో మంటలు చెలరేగి చెట్లు ఆహుతవుతాయి. మంటలు అంటుకోకుండా, వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నారు. అటవీ ప్రాంతంలో సాసర్ పిట్లు, ఫైర్‌లైన్స్, చెక్‌డ్యాంలో నీరు నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్డువైపు ఉన్న అడవుల్లో ఫైర్‌లైన్స్ తీశారు. జిల్లాలో మంథని, పెద్దపల్లి రెండు ఫారెస్టు రెంజర్లు ఉన్నాయి. మొత్తం 14 మండలాల్లో 10 మండలాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. పెద్దపల్లిలో 9 సాసర్ పిట్లు, మంథని రేంజ్‌లో 15 సాసర్ పిట్లు ఏర్పాటు చేశారు. అడవుల్లో ఉన్న వన్యప్రాణులు తాగు నీటి కోసం గ్రామాలు, పట్టణాలకు రాకుండా ఉండేందుకు సాసర్ పిట్లు ఏర్పాటు చేసి నీరు నింపుతున్నారు. రైతులు వేసిన పంటల నుంచి గడ్డి, పత్తి కట్టెలు, తదితర వ్యర్ధాలు తగులబెట్టడం వల్ల ఆ నిప్పులు అడవిలో పడి మంటలు చెలరేగుతున్నాయి, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్య పరుస్తున్నారు. బీడీ, సీగరేట్ తాగినప్పుడు ఆర్పి వేయాలని, పంటల నుంచి వెలువడే వేస్టేజీని తగుల బెట్టేటప్పుడు పూర్తిగా చల్లారేలా రైతులు చూడాలని సూచిస్తున్నారు. బీడీలు, సిగరేట్లు కాల్చినప్పుడు ఆర్పి వేయాలని ప్రచారం చేస్తున్నారు. అడవులు తగులబడడం వల్ల మొక్కలు, చెట్లు కాలిపోతాయి. వన్యప్రాణులకు హానీ కలిగే ప్రమాదం ఉంది. రోడ్ల వెంట సిగరేట్లు ఆర్పకుండా పడేయడం వల్ల చెట్ల నుంచి రాలిన ఎండిన ఆకులు అంటుకొని అడవులు తగులబడుతాయని, రోడ్డుకు అడవులకు మధ్య 5 మీటర్ల విస్తీర్ణంలో రోడ్డువెంట ఎండు ఆకులను తొలగిస్తున్నారు. ఇందుకోసం కిలోమీటర్ల ఫైర్ లైన్స్ చేస్తున్నారు. దీంతో మంటలు ఫైర్ లైన్స్ వరకు వెళ్ళి అక్కడే ఆగిపోతుంది. అడవుల్లో మంటలు ఏర్పడినప్పుడు చెక్‌డ్యాం నీటితో మంటలు ఆర్పే ఏర్పాటు చేశారు. అడవులు మంటల్లో అంటుకున్నప్పుడు సమాచారం రాగానే సిబ్బందిని మంటలను ఆర్పి వేస్తారు.
ప్రజలు, రైతులు సహకరించాలి
డీఎఫ్‌వో చిక్కుల్ల శివయ్య
అడవులు, వన్యప్రాణుల రక్షణకు ప్రజలు, రైతులు సహకరించాలి. పంటల నుంచి వెలువడే పనికిరాని వ్యర్ధాలను కాల్చినప్పుడు రైతులు చల్లారే వరకు అక్కడే ఉండాలి. సిగరేట్ బీడీలు కాల్చినప్పుడు ఆర్పి వేయాలి.
Updated Date - Apr 19 , 2025 | 11:32 PM