సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్‌పై ఆశలు..
ABN, Publish Date - Apr 19 , 2025 | 11:25 PM
చాలీచాలని పింఛన్‌తో బతుకులీడుస్తున్న సింగరేణి కార్మికుల్లో పింఛన్ పెంపుపై ఆశలు చిగురిస్తున్నాయి. పింఛన్ పెరిగే విధంగా సింగరేణి సంస్థ టన్ను బొగ్గు ఉత్పత్తిపై 20 రూపాయల చొప్పున కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ ట్రస్టు బోర్డుకు జమ చేస్తామని ప్రకటించింది. యేటా 140 కోట్ల రూపాయలు జమ కానున్నాయని అంచనా వేస్తున్నారు.
పెద్దపల్లి, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): చాలీచాలని పింఛన్‌తో బతుకులీడుస్తున్న సింగరేణి కార్మికుల్లో పింఛన్ పెంపుపై ఆశలు చిగురిస్తున్నాయి. పింఛన్ పెరిగే విధంగా సింగరేణి సంస్థ టన్ను బొగ్గు ఉత్పత్తిపై 20 రూపాయల చొప్పున కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ ట్రస్టు బోర్డుకు జమ చేస్తామని ప్రకటించింది. యేటా 140 కోట్ల రూపాయలు జమ కానున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ నిధితో పదవీ విరమణ పొందనున్న సింగరేణి కార్మికులకు ప్రస్తుతం అందుతున్న పింఛన్ పెరిగే అవకాశాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర పరిధిలో ప్రభుత్వ ఉద్యోగులకు నెల నెలా ఇచ్చే వేతనాల నుంచి ప్రావిడెంట్ ఫండ్ కింద పే స్కేల్‌ను బట్టి జమ చేస్తుంటారు. పదవీ విరమణ అనంతరం జమ చేసిన పీఎఫ్‌తోపాటు ఆ ఉద్యోగికి వేతనంలో సగం సొమ్ము పింఛన్ కింద అందజేస్తారు. పీఆర్సీ పెరిగినప్పుడు, డీఏలు పెరిగిన సమయంలో కూడా పింఛన్‌దారులకు పెన్షన్ పెరుగుతుంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సింగరేణి సంస్థలో పని చేసే ఉద్యోగులు, కార్మికులకు నెలనెలా ఇచ్చే వేతనంలో మూల వేతనాన్ని అనుసరించి ప్రావిడెంట్ ఫండ్ చెల్లిస్తున్నారు. వారు పీఎఫ్ కింద ఎంత సొమ్ము చెల్లిస్తారో, అంతే మొత్తంలో సంస్థ కూడా జమ చేస్తుంది. కార్మికులు పదవీ విరమణ పొందిన అనంతరం ప్రావిడెంట్ ఫండ్ అందజేస్తూ వచ్చారు. ఆ తర్వాత వారికి సింగరేణి సంస్థ నుంచి ఎలాంటి పింఛన్లు ఇచ్చే వారు కాదు. పదవీ విరమణ పొందిన అనంతరం సింగరేణి కార్మికులకు పింఛన్ వర్తింపజేయాలని కేంద్ర మాజీ కార్మిక శాఖ మంత్రి గడ్డం వెంకటస్వామి 1995 నుంచి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. బొగ్గు గనుల్లో పని చేస్తున్న కార్మికులు, ఇతర ఉద్యోగులకు కోల్ మైన్స్ పెన్షన్స్ స్కీమ్‌ను వర్తింపజేయాలని 1998లో పార్లమెంట్‌లో చట్టం తీసుక వచ్చారు. దీనిని కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (సీఎంపీఓ) నిర్వహిస్తూ వస్తున్నది. ప్రతీ ఐదేళ్లకోసారి పదవీ విరమణ పొందిన కార్మికులు ఇచ్చే పింఛన్ సొమ్మును పెంచాలని చట్టంలో పేర్కొన్నారు. కానీ ఏనాడు కూడా పింఛన్ పెరిగిన దాఖలాలు లేవు. పథకం అమల్లోకి వచ్చినప్పుడు ఎంతైతే పింఛన్ ఇచ్చారో అంతే పింఛన్ ఇస్తున్నారు.
ఉదాహరణకు సీనియర్ పంప్ ఆపరేటర్‌గా 2006లో పదవీ విరమణ పొందిన కార్మికుడికి రూ. 1,140 పింఛన్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అంతే మొత్తంలో పింఛన్ ఇస్తూ వస్తున్నారు. ఒకప్పుడు సింగరేణి సంస్థలో ఆరు లక్షల మంది కార్మికులు పని చేయగా, ప్రస్తుతం అందులో 30 శాతం కూడా కార్మికులు లేరు. ప్రస్తుతం సింగరేణిలో 80 వేల మంది వరకు పింఛన్ పొందుతున్నారు. ఇందులో 15 వేల నుంచి 20 వేల మంది కార్మికులకు నెలకు 1500 రూపాయల పింఛన్ రావడం లేదు. 2010 వరకు సింగరేణి సంస్థలో పని చేసిన కార్మికులకు వేతనాలు తక్కువే. దీంతో నెల నెలా ఇచ్చే పింఛన్ 2 వేలకు దాట లేదు. ఈ మధ్యకాలంలో పదవీ విరమణ పొందుతున్న వారికి రూ.20 వేల వరకు పింఛన్ వస్తున్నది. కోల్ మైన్స్ పెన్షన్స్ స్కీమ్ గురించి చట్టంలో పేర్కొన్న ప్రకారం తమకు ఇచ్చే పింఛన్ సొమ్మును పెంచాలని రిటైర్డ్ కార్మికులు ఎంతగా మొత్తుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలుపొందిన కాకా వెంకటస్వామి మనువడు గడ్డం వంశీకృష్ణ కోల్ మైన్స్ పెన్షన్స్ స్కీమ్ గురించి పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకవచ్చారు. దీని ఫలితంగా సింగరేణి సంస్థ యేటా ఉత్పత్తి చేసే బొగ్గుపై టన్నుకు 20 రూపాయల చొప్పున కోల్‌మైన్స్ పెన్షన్స్ స్కీమ్ ప్రావిడెంట్ ఫండ్‌కు జమ చేస్తామని సింగరేణి సంస్థ అంగీకారం తెలుపుతూ లేఖ జారీ చేసింది. సింగరేణి సంస్థ యేటా 70 వేల మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో యేటా 140 కోట్ల రూపాయల వరకు కార్పస్ ఫండ్ జమ కానున్నది. ఈ ఫండ్‌తో పింఛన్ పెరగనున్నది. దీనిపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ప్రతీ కార్మికుడికి కనీసం 10 వేల రూపాయలు వచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. సింగరేణి సంస్థ కార్పస్ ఫండ్ ప్రకటించడంతో రిటైర్డ్ కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ఎంపీ చిత్రపటానికి క్షీరాభిషేకం
గోదావరిఖని, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంపునకు కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటానికి శనివారం గోదా వరిఖని చౌరస్తాలో క్షీరాభిషేకం చేశారు. కాంగ్రెస్ నాయకుడు కామ విజయ్ మాట్లాడుతూ సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రూ.10వేలు పెన్షన్ ఇవ్వాలని పార్లమెంట్‌లో మాట్లాడి కార్మికుల పెన్షన్ కోసం ప్రతీ టన్నుకు సింగరేణి యాజమాన్యం రూ.20 సీఎంపీఎఫ్ ట్రస్ట్ బోర్డుకు చెల్లించడానికి అంగీకరించడం హర్ష నీయమన్నారు. రూ.140కోట్ల నిధులు సింగరేణి ట్రస్ట్ బోర్డుకు ఇవ్వనున్నదని, దివంగత కేంద్ర మాజీ మంత్రి వెంకట స్వామి ప్రవేశపెట్టిన పెన్షనే ప్రస్తుతం సింగరేణిలో వస్తుందని, దశాబ్దాలు అవుతున్నా పెన్షన్ సవరణ జరుగలే దని, రిటైర్డ్ కార్మికులకు కనీసం రూ.10 వేలు ఇవ్వాలని పార్లమెంట్‌లో గడ్డం వంశీ గళమెత్తారని, దీంతో దిగివచ్చిన సింగరేణి యాజమాన్యం రూ.140కోట్లు కేటాయించిం దన్నారు. బొగ్గుగనులశాఖ మంత్రిని కలిసి సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించామని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి సింగరేణి యాజమాన్యానికి లేఖ రాశారన్నారు. నాయకులు రాచకొండ కోటేశ్వర్లు, బోయిని మల్లేష్, తిప్పారపు మధు, నరేందర్‌రెడ్డి, జావిద్, సంపత్, మహేష్, రాకేష్, వినోద్, రవి, మహబూబ్, తిప్పారపు మధు పాల్గొన్నారు.
Updated Date - Apr 19 , 2025 | 11:25 PM