ముగింపు దశకు ధాన్యం కొనుగోళ్లు
ABN, Publish Date - May 27 , 2025 | 12:40 AM
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకు న్నాయి. గడిచిన రెండు సీజన్ల కంటే ఈ సీజన్‌లో కొనుగోళ్లు వేగంగా సాగాయి. యాసంగిలో జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా, ఆశించిన మేరకు దిగుబడులు వచ్చాయి.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకు న్నాయి. గడిచిన రెండు సీజన్ల కంటే ఈ సీజన్‌లో కొనుగోళ్లు వేగంగా సాగాయి. యాసంగిలో జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా, ఆశించిన మేరకు దిగుబడులు వచ్చాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 812 కోట్ల 36 లక్షల రూపా యల విలువైన 3,51,925 టన్నుల ధాన్యాన్ని 50,108 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. రెండు యాసంగి సీజన్ల కంటే ఎక్కువ ధాన్యాన్ని కొనుగోలు చేయడం గమనార్హం. ఇంకా 10 వేల నుంచి 15 వేల టన్నుల వరకు ధాన్యం రావొచ్చని పౌరసరఫరాల శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది జూన్ 15వ తేదీ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈసారి కొనుగోళ్లలో వేగం పెంచారు. 46,648 మంది రైతులకు 727 కోట్ల 62 లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశారు.
అయితే సన్న ధాన్యానికి ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా ప్రభుత్వం బోనస్ చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ సీజన్‌లో 315 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధి కారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. యాసంగి సీజన్‌లో 2 లక్షల 15 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేయగా, ఇందులో అత్యధికంగా 2 లక్షల ఎక రాల్లో వరి పంటను సాగు చేశారు. 50 వేల ఎకరాలకు పైగా విత్తనోత్పత్తి సాగు చేశారు. ఆడ, మగతోపాటు బ్రీడర్ 2 కోసం వరి సాగు చేశారు. తద్వారా వచ్చే పంట దిగుబడులను ఆయా విత్తన కంపెనీలు రైతుల నుంచి కొనుగోలు చేశారు. కొంత సాధారణ ధాన్యాన్ని రైతులు సీజన్ ఆరంభంలోనే విక్రయించారు. అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసినా కూడా మద్దతు ధరకే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
వేగంగా ధాన్యం కొనుగోళ్లు..
ఈ ఏడాది మొదట కాస్త మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు సాగినప్పటికీ కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్, వేణు, డీఎస్‌వో రాజేందర్, సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్‌రెడ్డి చొరవ తీసుకుని కొనుగోళ్లలో వేగం పెంచారు. రైస్‌మిల్లర్ల నుంచి 10 శాతం బ్యాంక్ గ్యారం టీలు తీసుకుని ధాన్యం కేటాయించారు. కాంటా అయిన వెంటనే ఎలాంటి కోతలు లేకుండా రైతులకు వెంట వెంటనే ట్రక్ షీట్లను ఇచ్చారు. మిల్లులకు ఎప్ప టికప్పుడు వాహనాల ద్వారా ధాన్యాన్ని తరలించారు. హమాలీల కొరత ఉన్న చోట బీహార్ కూలీలను పెట్టి కాంటాలు పెట్టారు. ఈ సీజన్‌లో 3,51,925 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డు రకం 2,92,752 టన్నులు, సన్నరకం 59,173 టన్నులు కొనుగోలు చేశారు. 2022-23 యాసంగిలో 3,49,350 టన్నుల ధాన్యాన్ని జూన్ 15వ తేదీ వరకు కొనుగోలు చేశారు. ఇదే సమయానికి 1,85,670 టన్నులు కొను గోలు చేశారు. గతేడాది ఇదే సీజన్‌లో మొత్తం 3,35,616 టన్నుల ధాన్యాన్ని జూన్ 10వ తేదీ వరకు కొనుగోలు చేయగా, ఈ సమయానికి 2,75,826 టన్ను లు కొనుగోలు చేశారు. ఈసారి రోజుకు 15 వేల టన్ను ల వరకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం 145 కేంద్రాలు మూసి వేయగా, 170 కేంద్రాలు తెరిచిఉన్నాయి. ఈ నెలాఖరు వరకు కొనుగోళ్లు ముగుస్తాయని అధికారులు చెబుతున్నారు.
బోనస్ డబ్బుల కోసం నిరీక్షణ...
రాష్ట్రంలో సన్న రకం ధాన్యం సాగును ప్రోత్సహిం చేందుకు వానాకాలం సీజన్ నుంచి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నది. బోనస్‌ను యాసంగి సీజన్‌కు కూడా ఇస్తామని ప్రకటించడంతో జిల్లాలో 30 వేల ఎకరాలకు పైగా సన్నరకం పంటను సాగు చే శారు. ఇప్పటి వరకు ప్రభుత్వం రైతుల నుంచి 59.173 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసింది. కానీ ఇంత వరకు బోనస్ డబ్బులు విడుదల చేయక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభు త్వం నుంచి 29 కోట్ల 58 లక్షల 65 వేల రూపాయలు బోనస్ రైతులకు చెల్లించాల్సి ఉంది. గత వానాకాలం సీజన్‌లో ఎక్కువ మొత్తం సన్న రకం పంటను సాగు చేసి ప్రభుత్వానికి విక్రయించడంతో 104 కోట్ల రూపా యల బోనస్ చెల్లించింది. కొనుగోళ్లు ముగుస్తున్నా కూడా ప్రభుత్వం బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. ప్రభుత్వం బోనస్ డబ్బుల గురించి ఏమి మాట్లాడక పోవడంతో ఇస్తారా, ఇవ్వరా అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బోనస్ డబ్బులు చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఆంధ్రజ్యోతి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఫోన్‌లో స్పందించగా ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదని తెలిపారు.
Updated Date - May 27 , 2025 | 12:40 AM