వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట
ABN, Publish Date - Apr 20 , 2025 | 11:43 PM
వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఆదివారం ధూళికట్ట, ముప్పిరితోట, రాములపల్లి, ర్యాకల్‌దేవ్‌పల్లి, ఎలిగేడు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఎలిగేడు, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఆదివారం ధూళికట్ట, ముప్పిరితోట, రాములపల్లి, ర్యాకల్‌దేవ్‌పల్లి, ఎలిగేడు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయన్నారు. ఎలాంటి కటింగ్‌లు లేకుండా ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్ ప్రకటించడంతో సీడ్ కంపెనీలు వరి విత్తనాలను ఉచితంగా ఇవ్వడంతోపాటు పంట చేతికి అందేవరకు సీడ్ కంపెనీలు ఖర్చులు భరిస్తున్నాయన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో కటింగ్‌ల పేరిట రైతులను నిలువునా ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. సెంటర్లోకి ధాన్యం తీసుకువచ్చి తక్‌పట్టీలను పొంది రైతులు నిర్భయంగా ఉండవచ్చని, 48గంటల్లోనే వారిఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు. పీఏసీఎస్ చైర్మన్‌లు పుల్లూరి వేణుగోపాల్‌రావు, గోపు విజయభాస్కర్‌రెడ్డి, దుగ్యాల సంతోష్‌రావు, బుద్దినేని వామన్‌రావు, అర్షనపల్లి వెంకటేశ్వర్‌రావు, నరహరి సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, పర్శరాంగౌడ్, తాటిపల్లి రమేష్‌బాబు, పోల్సాని పుల్లారావు, శంకర్, స్వామి, సీఈవోలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
Updated Date - Apr 20 , 2025 | 11:43 PM