సార్వత్రిక సమ్మె విజయవంతం
ABN, Publish Date - Jul 10 , 2025 | 12:24 AM
దేశ వ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు బుధవారం తలపెట్టిన సార్వత్రిక సమ్మె జిల్లాలోని అన్ని ప్రభుత్వరంగ పరిశ్రమల్లో విజయవంతమైంది. సింగరేణి ఆర్‌జీ-1, 2, 3 డివిజన్‌లలో కార్మికులు బుధవారం విధులు గైర్హాజరై కేంద్ర ప్రభుత్వ విధానాలపై తమ నిరసను వ్యక్తం చేశారు.
గోదావరిఖని, జూలై 9 (ఆంఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు బుధవారం తలపెట్టిన సార్వత్రిక సమ్మె జిల్లాలోని అన్ని ప్రభుత్వరంగ పరిశ్రమల్లో విజయవంతమైంది. సింగరేణి ఆర్‌జీ-1, 2, 3 డివిజన్‌లలో కార్మికులు బుధవారం విధులు గైర్హాజరై కేంద్ర ప్రభుత్వ విధానాలపై తమ నిరసను వ్యక్తం చేశారు. సింగరేణి పర్మినెంట్ కార్మికులు, ఉద్యోగులే కాకుండా కాంట్రాక్టు కార్మికులు, అవుట్‌సోర్సింగ్ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో సింగరేణి సంస్థకు ఒక రోజు మొత్తం 1.9లక్షల టన్నుల ఉత్పత్తి నష్టం జరిగింది. కార్మికులు కూడా రూ.13కోట్ల వేతనాలను నష్టపోయారు. ప్రస్తుతం సింగరేణి ఈ సమ్మె కారణంగా ఒకే రోజు రూ.72కోట్ల ఉత్పత్తి నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. సింగరేణి యాజమాన్యం కార్మికులను సమ్మెకు దూరంగా ఉండాలని చెప్పినా కార్మికులు యాజమాన్య పిలుపును పెడచెవిన పెట్టారు. బీఎంఎస్ సమ్మెకు దూరం అంటూ ప్రకటించింది. దీంతో బీఎంఎస్‌కు సంబంధించిన కొందరు ఉద్యోగులు, కార్మికులకు నామమాత్రంగా విధులకు హాజరయ్యారు. ఇక సింగరేణిలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, టీబీజీకేఎస్ కార్మిక సంఘాల జేఏసీగా ఏర్పడి సమ్మె విజయవంతానికి దోహదపడ్డారు. విప్లవ కార్మిక సంఘాలు ఐఎఫ్‌టీయూ, ఏఐఎఫ్‌టీయూ, హెచ్‌ఎంఎస్, టీఎన్‌టీయూసీలు కార్మిక సంఘాల ఐక్య వేదికగా పేరున సమ్మె విజయవంతానికి ప్రయత్నించారు. సింగరేణిలోని అన్నీ సంఘాలు ఈ సమ్మెకు సిద్ధం కావడంతో కార్మికవర్గం కూడా సమ్మెలో పాల్గొన్నదని. సమ్మె సందర్భంగా బుధవారం కార్మిక సంఘాలు అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు, ఓసీపీల కార్యాలయాల ఎదుట విధులకు హాజరయ్యే కార్మికులను సమ్మెలో పాల్గొనాలని కోరేందుకు ప్రచారం నిర్వహించాయి. కానీ కార్మికులెవరూ రాకపోవడంతో యైుటింక్లయిన్, గోదావరిఖని పట్టణ కేంద్రాల్లో మానవహారాలుగా ఏర్పడి సమ్మె విజయ సంకేతాల్ని చూపించారు. సమ్మెను విజయవంతం చేసిన కార్మికవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి కార్మికుల హక్కులను కాపాడాలని, లేనిపక్షంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో పని చేసే కాంట్రాక్టు కార్మికులు, రామగుండం ఎన్‌టీపీసీలో పని చేసే కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్‌లో పని చేసే పారిశుధ్య సిబ్బంది ఈ సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలిపింది. విధులకు గైర్హాజర్ అయి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సమ్మెకు సీపీఐ, సీపీఎం, బీఆర్‌ఎస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. సమ్మె సందర్భంగా పారిశ్రామిక ప్రాంతమంతా సెలవు దినంలా కనిపించింది. బొగ్గు బాయిలు, ఓపెన్‌కాస్టులు, సీఎస్‌పీలు, వర్క్‌షాప్‌లు బోసిపోయాయి.
Updated Date - Jul 10 , 2025 | 12:24 AM