రైతులు అధైర్యపడొద్దు
ABN, Publish Date - May 11 , 2025 | 11:56 PM
అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిన రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్పష్టం చేశారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని ఆదివారం పరిశీలించారు.
పెద్దపల్లి టౌన్, మే 11 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిన రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్పష్టం చేశారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని ఆదివారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వర్షం వల్ల ధాన్యం తడిస్తే ధాన్యంపై ఉప్పు నీళ్లు చల్లితే రంగు మారకుండా, గింజ నలుపు రంగులోకి మారకుండా ఉంటుందని సూచించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్, గౌరెడ్డిపేట కేంద్రాల్లో కొంతమేర ధాన్యం తడిసిందన్నారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయిస్తానని, తూకం వేసిన తరువాత బస్తాలను వేరుగా ఉంచితే రైస్‌మిల్లర్లకు పంపించేందుకు చర్యలు తీసుకుంటానని, నిర్వాహకులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. వ్యవసాయ మార్కెట్లో సుమారుగా 16 వేల క్వింటాళ్ల వరకు ధాన్యం వచ్చిందని, ఇందులో 11 వేల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసి మిల్లులకు తరలించినట్లు పేర్కొన్నారు. ధాన్యాన్ని వేగంగా కొనుగోలు పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఎలాంటి కటింగ్ లేకుండా మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తా మన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి నిర్ణీత గడువులోగా చెల్లింపులు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతుల కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మార్కెట్ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, వైస్ చైర్మన్ కూర మల్లారెడ్డి, డైరెక్టర్లు, మాజీ చైర్మన్ జడల సురేందర్, మార్కెట్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు భూషణవేన సురేష్ గౌడ్, నూగిల్ల మల్లయ్య, బూతగడ్డ సంపత్, అమ్రేశ్, పాగాల శ్రీకాం త్, మసూద్, నదీం, బూతగడ్డ అజయ్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Updated Date - May 11 , 2025 | 11:56 PM