ఆయిల్‌పామ్ సాగుపై రైతులు దృష్టిసారించాలి
ABN, Publish Date - Jun 06 , 2025 | 11:58 PM
ఆయిల్‌పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మండలంలోని పెగడపల్లిలో శుక్రవారం ఆయిల్‌పామ్ తోటను పరిశీలించారు. తోటలోని గెలలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఆయిల్ పరిశ్రమకు తరలించే వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
కాల్వశ్రీరాంపూర్, జూన్ 6(ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మండలంలోని పెగడపల్లిలో శుక్రవారం ఆయిల్‌పామ్ తోటను పరిశీలించారు. తోటలోని గెలలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఆయిల్ పరిశ్రమకు తరలించే వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. రైతులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయిల్‌పామ్ సాగు చేసిన రైతు దంపతులు పత్తి శ్రీలతశ్రీనివాస్‌రెడ్డిలను కలెక్టర్ సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగుచేసే రైతులకు సహకారం అందిస్తుందన్నారు. 2021 సెప్టెంబర్‌లో పెగడపల్లిలో పత్తి శ్రీనివాస్‌రెడ్డి రెండు ఎకరాల్లో 150 మొక్కలు పెట్టారన్నారు. ప్రస్తుతం ఆయిల్ పామ్ గెలలు వచ్చాయన్నారు. నాల్గవ సంవత్సరం నుంచి 25సంవత్సరాలవరకు దిగుబడి వస్తుందన్నారు. ప్రస్తుతం ఇతర దేశాలనుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటుందన్నారు. ఆయిల్ పామ్ తోటలు అధికంగా వేయడంవలన ఆయిల్ మనమే ఉత్పత్తి చేసుకోవచ్చన్నారు. రైతులకు త్వరగా డబ్బులు పడేవిధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం పెగడపల్లిలో నిర్వహించే రెవెన్యూ సదస్సును పరిశీలించారు. వచ్చిన దరఖాస్తులకు విచారణ చేపట్టి పరిష్కరిస్తూ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఉద్యానవనశాఖ అధికారి జగన్మోహన్‌రెడ్డి, పెద్దపల్లి డివిజన్ అధికారి మహేష్, తహసీల్దార్ జగదీశ్వర్‌రావు, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ ఆరెల్లి సుజాతరమేష్, ఆయిల్‌ఫామ్ కంపనీ సీఈవో కళ్యాణ్కర్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మారం, (ఆంధ్రజ్యోతి): మండలంలోని నర్సింగాపూర్ గ్రామ రైతు బద్దం రాంరెడ్డి పండించిన ఆయిల్ పామ్ మొదటి పంటను ఉద్యాన - పట్టు పరిశ్రమ ఆదేశాలతో తిరుమల ఆయిల్ కేమ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు శుక్రవారం కొనుగోలు చేశారు. రైతు అక్కవ్వ రాంరెడ్డిలు 2022 పిబ్రవరిలో రెండు ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటగా రెండు టన్నుల పంట దిగుబడి వచ్చింది. గ్రామంలో 50 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్నారని ఉద్యాన శాఖ అధికారుల సూచనలను పాటిస్తూ పంటను తీస్తున్నామన్నారు. ఆయిల్ పామ్ కంపనీ ప్రతినిధులు, ధర్మారం, జూలపల్లి, ఎలిగేడు ఫీల్డ్ ఆఫీసర్లు మహేష్, హరీష్, అభిలాష్, రైతులు పాల్గొన్నారు.
Updated Date - Jun 06 , 2025 | 11:58 PM