పౌరుల హక్కులను కాలరాసిన చీకటి రోజు ఎమర్జెన్సీ
ABN, Publish Date - Jun 25 , 2025 | 11:45 PM
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్నో అకృత్యాలను ఎదుర్కొన్నారని, 1975 జూన్ 25న ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాసారని ఆదిలాబాద్ ఎంపీ జి.నగేష్ మండిపడ్డారు. జాతీయ, రాష్ట్ర పార్టీల పిలుపు మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ రెడ్డి అధ్యక్షతన ఎమర్జెన్సీ చీకటి పాలనకు వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశంలో ఎంపీ హాజరయ్యారు.
పెద్దపల్లిటౌన్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్నో అకృత్యాలను ఎదుర్కొన్నారని, 1975 జూన్ 25న ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాసారని ఆదిలాబాద్ ఎంపీ జి.నగేష్ మండిపడ్డారు. జాతీయ, రాష్ట్ర పార్టీల పిలుపు మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ రెడ్డి అధ్యక్షతన ఎమర్జెన్సీ చీకటి పాలనకు వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశంలో ఎంపీ హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ ఇందిరా గాంధీ పాలనలో విధించిన ఎమర్జెన్సీ చీకటి పాలనకు 50 ఏళ్లు నిండాయన్నారు. నాడు ప్రధానిగా ఇందిరాగాంధీ దేశ ప్రజలపై బలవంతంగా ఎమర్జెన్సీ విధించి వ్యతిరేకంగా పోరాడిన వారిని చిత్రహింసలకు గురిచేసి జైళ్లలో నిర్బంధించారని వివరించారు. హిందువులపై కక్షకట్టి బలవంతంగా 70 లక్షల మందికి కుటుంబ నియంత్రణ చేయించారని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ను ఏనాడు గౌరవించలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో అనేక సార్లు వారికి ఇష్టం వచ్చినట్లు రాజ్యాంగ సవరణ చేశారని, ఆర్టికల్ 356 పేరుతో దేశంలోని అనేక రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలను కూలదోశారన్నారు.
అనేక విధాలుగా అసమర్థ, ప్రజా వ్యతిరేక పాలన కొనసాగించిన కాంగ్రెస్ బీజేపీపై రాజ్యాంగాన్ని మారుస్తారని దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మాత్రమే రాజ్యాంగ సవరణ ద్వారా బీజేపీ ప్రభుత్వం పౌరహక్కులను కాపాడుతోందని గుర్తు చేశారు. ఆనాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారిని సన్మానించారు. ఎమర్జెన్సీ చీకటి పాలనలో నాటి దేశ పరిస్థితులపై ఏర్పాటు చెందిన ఫొటో ఎగ్జిబిషన్ ఎంపీ తిలకించారు. మోహన్ రెడ్డి, కందుల సంధ్యారాణి, పల్లె సదానందం, సత్యప్రకాష్, శ్రీనివాసరావు, జ్యోతి బసు, ఓదెలు, బెజ్జంకి దిలీప్, మౌటం నర్సింగం, సదయ్య గౌడ్, పాల్గొన్నారు.
Updated Date - Jun 25 , 2025 | 11:45 PM