కల్వల ప్రాజెక్టును పట్టించుకోరా?
ABN, Publish Date - Jun 25 , 2025 | 12:38 AM
మండలంలోని కల్వల ప్రాజెక్టును పాలకులు పట్టించుకోవడం లేదు. కల్వల ప్రాజెక్టుకు రెండేళ్ల క్రితం గండి పడింది. అప్పటి ప్రజాప్రతినిధుల ఆదేశాలతో అధికారులు తాత్కాలికంగా మరమ్మత్తులు చేసి రైతులకు సాగునీరు అందించారు. గత వర్షాకాలంలో వరద ఉధృతి పెరగడంతో తాత్కాలికంగా నిర్మించిన రింగ్ బండ్ తెగింది.
శంకరపట్నం, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కల్వల ప్రాజెక్టును పాలకులు పట్టించుకోవడం లేదు. కల్వల ప్రాజెక్టుకు రెండేళ్ల క్రితం గండి పడింది. అప్పటి ప్రజాప్రతినిధుల ఆదేశాలతో అధికారులు తాత్కాలికంగా మరమ్మత్తులు చేసి రైతులకు సాగునీరు అందించారు. గత వర్షాకాలంలో వరద ఉధృతి పెరగడంతో తాత్కాలికంగా నిర్మించిన రింగ్ బండ్ తెగింది. ఈ ప్రాజెక్టు కల్వల గ్రామ శివారులో ఉంది. ప్రాజెక్టు ద్వారా శంకరపట్నం మండలంలోని కొన్ని గ్రామాలతోపాటు వీణవంక మండలానికి సాగునీరు అందుతుంది. ఓ వైపు అధికార పార్టీ ఎమ్మెల్యే మరోవైపు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. ఈ ప్రాజెక్టు మరమ్మతులు ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నారుమడులు దున్నుకొని వరి పంట సాగు చేసుకోవడానికి ప్రాజెక్టులో నీరు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ఆలస్యం అవ్వడంతో చేసేదేం లేక రైతులు దిగాలుగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు కింద సుమారు 3,500 ఎకరాల ఆయకట్టు ఉంది. శంకరపట్నం మండలంలోని గద్దపాకకు చెందిన 80 మత్స్యకార కుటుంబాలు ఈ ప్రాజెక్టు మీద ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. ఈ ప్రాజెక్టు గండిపడి రెండేళ్లు అవుతున్నా మరమ్మత్తు చేపట్టకపోవడంతో వారి జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారింది.
రైతులు సొంత ఖర్చుతో తాత్కాలిక మరమ్మతులు
గత యాసంగి సీజన్‌లో ప్రాజెక్టు కింద సాగు చేసుకునే రైతులందరూ కలిసి కొంత డబ్బు జమ చేసి తాత్కాలికంగా గండి పడ్డ ప్రదేశానికి దూరంగా అడ్డుగా కట్ట నిర్మించుకున్నారు. వర్షాలు పడి వరదనీరు ప్రాజెక్టులోకి చేరితే కట్ట తెగే ప్రమాదం ఉంది. కల్వల శివారులో ఈ ప్రాజెక్టును గొలుసు కట్టు చెరువులకు అనుసంధానంగా నిర్మించారు. వర్షాకాలంలో హస్నాబాద్, చిగురుమామిడి, సైదాపూర్, శంకరపట్నం మండలాలో కురిసిన వర్షపు నీరు గొలుసుకట్టు చెరువుల ద్వారా ఏర్పడిన వాగులు, ఒర్రెల ద్వారా వచ్చే నీరు కల్వల శివారులో నిర్మించిన ఈ ప్రాజెక్టులోకి చేరుతుంది.
Updated Date - Jun 25 , 2025 | 12:39 AM