ఓట్లు దండుకునేందుకే బీసీల రిజర్వేషన్ల నాటకం
ABN, Publish Date - Jul 12 , 2025 | 11:55 PM
రాష్ట్రంలో బీసీ ఓట్లు దండుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల నాటకం ఆడుతున్నదని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. శనివారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి ఆర్డినెన్స్ తీసుకువస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు అనుమాలు తలెత్తుతున్నాయన్నారు.
గోదావరిఖని, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీ ఓట్లు దండుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల నాటకం ఆడుతున్నదని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. శనివారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి ఆర్డినెన్స్ తీసుకువస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు అనుమాలు తలెత్తుతున్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకే రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పినా, 20నెలలు గడిచినా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో రిజర్వేషన్‌పై తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతి ఆమోదానికి పంపారని, ఇప్పుడు కొత్తగా ఆర్డినెన్స్ పేరుతో మరో మోసానికి తెరలేపిందన్నారు.
మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు పెంచాలని చూస్తే కోర్టులు కొట్టివేసిన విషయం ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. బీసీలకు ద్రోహం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొడుతామని, 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. చట్టబద్దత లేని కుల గణన జరిపిన కాంగ్రెస్ బీసీలను మోసం చేసేందుకు 42శాతం రిజర్వేషన్ అమలును తెరమీదికి తీసుకువచ్చిందని దీనిని బీసీలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నాయకులు నడిపెల్లి మురళీధర్‌రావు, బొడ్డు రవీందర్, నారాయణదాసు మారుతి, కృష్ణవేణి, అంజలి, గాదం విజయ, పిల్లి రమేష్, జిట్టవేని ప్రశాంత్, గుంపు లక్ష్మి, సట్టు శ్రీనివాస్, బుర్రి వెంకటేష్, కోడి రామకృష్ణ, సత్యప్రసాద్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - Jul 12 , 2025 | 11:55 PM