ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bhupalpalli: బూడిద దిబ్బలా.. దుబ్బపల్లి

ABN, Publish Date - Jun 21 , 2025 | 04:22 AM

రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంటు (కేటీపీపీ) ఓ గ్రామానికి మాత్రం శాపంలా మారింది. వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్న దాదాపు 500 కుటుంబాల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది.

  • కేటీపీపీతో కాలుష్య కాటు

  • భూపాలపల్లి జిల్లాలోని దుబ్బపల్లి గ్రామంలో..

  • అంధకారంలో 500 కుటుంబాల భవిష్యత్తు

  • పొలాల్లో పూడికలా బూడిద.. పంటలు

  • తీవ్రంగా దెబ్బతిని పడిపోతున్న దిగుబడి

  • ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్న గ్రామస్థులు.. పట్టణాలకు వలసబాట

  • 19 ఏళ్లుగా అతీగతీలేని పునరావాసం

భూపాలపల్లి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంటు (కేటీపీపీ) ఓ గ్రామానికి మాత్రం శాపంలా మారింది. వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్న దాదాపు 500 కుటుంబాల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. మట్టిని నమ్ముకొని పంటలు సాగుచేస్తే చివరకు బూడిద మిగులుతోంది. ఫలితంగా గ్రామంలో భవిష్యత్తు కానరాక, ప్రభుత్వ సాయమూ అందే దాఖలాలు కనిపించక.. బాధితులు వరంగల్‌, హైదరాబాద్‌ వంటి పట్టణాలకు వలసబాట పట్టేలా చేస్తోంది. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం దుబ్బపల్లికి చెందిన 1500మంది జెన్‌కో విసర్జిత వ్యర్థాలతో 15 ఏళ్లుగా సతమతమవుతున్నారు.

మొదటి నుంచీ నిర్లక్ష్యమే..

2006లో కేటీపీపీ ప్లాంటు పనులు ప్రారంభించిన రోజుల్లో చెల్పూరు శివారులోని దుబ్బపల్లికి చెందిన రైతుల నుంచి 900 ఎకరాల భూములను సేకరించారు. కానీ, నిర్వాసితులకు పరిహారం, పునరావాసంపై నిర్లక్ష్యం వహించారు. దాంతో గ్రామాన్ని తరలించే విషయం కాగితాల్లోనే నానుతోంది. 2010లో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత విద్యుత్‌ ఉత్పత్తి కోసం కాల్చిన బొగ్గు కారణంగా బూడిద వ్యర్థాలు.. గాలిలో విరజిమ్ముతుండటంతో పక్కనే ఉన్న దుబ్బపల్లి తీవ్రంగా ప్రభావితమవుతోంది. గ్రామానికి సమీపంలోనే బూడిదను తరలించేందుకు సైలోస్‌ ఏర్పాటు చేయడంతో గ్రామమంతా బూడిదమయం అవుతోంది. 15 ఏళ్లుగా ఇళ్లన్నీ బూడిదతో నిండిపోయి గ్రామస్థులు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉన్న 400 ఇండ్లకు వాస్తవిక మార్కెట్‌ విలువ ప్రకారం స్థలాలకు గజానికి రూ.6500 చొప్పున, నిర్మాణాలకు చదరపు అడుగుల పద్ధతిలో లెక్కించి పరిహారం ఇవ్వాలని బాధితులు కోరారు. అయితే అప్పటి కలెక్టర్‌ కృష్ణాదిత్య రూ.5900 ధర నిర్ణయించారు. ఈ సిఫారసును కూడా అప్పటి ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ అంగీకరించలేదు. చివరకు 2023 డిసెంబరులో గజానికి రూ.4000చెల్లించేలా ఒప్పందం కుదిరింది. దాంతో నాలుగు విడతల్లో మొత్తం 562 మందికి రూ.77.43 కోట్ల మేర పరిహారం చెల్లించారు. అయితే ఇందులో స్థల పరిమాణం విషయంలో అధికారులు కొర్రీలు పెట్టారు. కేవలం నాలుగు గుంటల వరకు గజాల లెక్కన, ఆపైన స్థలానికి ఎకరాల చొప్పున చెల్లిస్తామని మెలికపెట్టారు. అంతేకాకుండా గ్రామంలో 34 ఎకరాలను సేకరించి.. మధ్యలో ఉన్న సర్వేనెంబర్‌ 1141లోని 10 ఎకరాలు, మరోచోట 195 ఎకరాలను వదిలేశారు. మరోవైపు రికార్డుల నమోదులోనూ అవకతవకలు జరిగాయని, ఒకరి స్థలానికి సంబంధించి మరొకరికి పరిహారం చెల్లించారని గ్రామస్థులు చెబుతున్నారు.

అతిగతీ లేని పునరావాసం..

పరిహారం విషయం ఒక కొలిక్కి వచ్చిన దరిమిలా వీలైనంత తొందరగా రికార్డుల సమస్యలను సవరించి మిగిలిన భూములను కూడా సేకరించాలని, తమ గ్రామాన్ని తొందరగా తరలించాలంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగుతున్నారు. దీంతో 2023లో గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు అంగీకరించిన ప్రభుత్వం భూపాలపల్లికి సమీపంలోని రామప్ప కాలనీ పరిసరాల్లో పునరావాసం కోసం స్థలాన్ని కేటాయించింది. అర్హుల జాబితాను కూడా గుర్తించినప్పటికీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి, మౌలిక సదుపాయాల కల్పనకు ఇంతవరకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. దీంతో గ్రామం తరలింపు కార్యరూపం దాల్చడంలేదు. ఫలితంగా గ్రామంలో ఉండలేక.. అటు ఉన్న భూములను అమ్ముకోలేక, పునరావాసం కొలిక్కి రాక వందలాది మంది బతుకుదెరువు వెతుక్కుంటూ ఇతర పట్టణాలకు వలస వెళుతున్నారు. ఈ ప్లాంటు కారణంగా 393 కుటుంబాలకు చెందినవారు నిరాశ్రయులు కాగా, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో 259 కుటుంబాలకు చెందిన 906 మంది సభ్యులను మాత్రమే అర్హులుగా గుర్తించడం వివాదంగా మారింది.

పంటలపైన తీవ్ర ప్రభావం..:

థర్మల్‌ పవర్‌ ప్లాంటు నుంచి ఉత్పన్నమవుతున్న బూడిద వల్ల దుబ్బపల్లి పరిధిలోని దాదాపు 500 ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. గ్రామానికి సమీపంలోనే బూడిదను తరలించేందుకు సైలోస్‌ ఏర్పాటు చేయడంతో గ్రామమంతా బూడిదమయం అవుతోంది. సైలోస్‌ పాయింట్‌నుంచి వెలువడే కాలుష్యంతో పాటు వాగుకు సమీపంలో ఉన్న బూడిద చెరువు కారణంగా పంటలపై బూడిద పేరుకుపోయి దిగుబడి రాకుండా పోతోంది. ముఖ్యంగా వరిపంట.. నారు దశలోనే బూడిద పేరుకుపోయి మొక్కలు చనిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఇక పత్తి, మిరప వంటి వాణిజ్యపంటలు దారుణంగా దెబ్బతింటున్నాయని చెబుతున్నారు. పొలాల్లో పేరుకుపోతున్న బూడిద కారణంగా మొక్కల వేర్లు దెబ్బతిని.. తెగుళ్ల బారిన పడుతున్నాయని, దీంతో రావాల్సిన దిగుబడిలో 25 శాతం కూడా రావడం లేదని పేర్కొంటున్నారు. మరోవైపు గతంలో రెండు పాయలుగా ప్రవహించే మోరంచ వాగు కాస్తా బూడిద వాగు వ్యర్థాల కారణంగా ప్రస్తుతం ఒకే దిశగా ప్రవహిస్తోందని చెబుతున్నారు. రెండేళ్ల క్రితం మోరంచ వాగుకు ఊహించని వరదలు వచ్చినప్పుడు మోరంచ గ్రామం వరదలో చిక్కుకుపోవడానికీ ఇదే కారణమని అంటున్నారు. కాగా, పునరావాసం విషయంలో గత ప్రభుత్వం తాత్సారం చేయడాన్నినిరసిస్తూ దుబ్బపల్లి గ్రామస్థులు అప్పటి ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును నిలదీయగా.. 32 మంది రైతులపై కేసులు పెట్టారు. తమపై నిర్దాక్షిణ్యంగా కేసులు నమోదు చేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని రైతులు వాపోతున్నారు.

పీసీబీ సిఫారసులు బేఖాతరు

కేటీపీపీ బూడిద సమస్యపై గ్రామస్థులు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి ఫిర్యాదు చేయటంతో పీసీబీ బృందాలు గ్రామంలో పర్యటించి కాలుష్యాన్ని అంచనా వేశారు. నిర్ధారిత ప్రమాణాలను పాటించటం లేదంటూ యాజమాన్యానికి మొట్టికాయలు వేయడమే కాకుండా రూ.కోటి జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు. అలాగే పరిసరాల్లోకి బూడిద విస్తరించకుండా సీఎస్పీ ప్రాంతంలో నీటిని వెదజల్లే వాటర్‌ స్ర్పింక్లర్లను ఏర్పాటు చేయాలని పీసీబీ ఆదేశించింది. అయితే పీసీబీ ఆదేశాలు అమలు కాలేదు. ఈ పరిస్థితుల్లో గ్రామస్థులు ఆందోళనలు చేయడంతో ఆర్డీవో నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి గ్రామాన్ని తరలించేందుకు వీలుగా సర్వేలు నిర్వహించారు.

తప్పులు సరిచేసి చెల్లించాలి

కొందరు రైతుల వివరాలు ఒకరివి మరొకరికి మారిపోయాయి. వాటిని రెవెన్యూ అధికారులు రీ సర్వే చేశారు. కానీ, అవార్డులో సరిచేయడం లేదు. ఆర్‌అండ్‌ఆర్‌ జాబితా కూడా పారదర్శకంగా, చట్టానికి లోబడి చేయాలి. రాష్ట్ర అవసరాల కోసం కన్నతల్లిలాంటి భూములను వదులుకున్నాం. మెరుగైన పునరావాసం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి.

- పొనగంటి మలహర్‌రావు, దుబ్బపల్లి

అనారోగ్యాల బారిన పడుతున్నాం

కేటీపీపీ సైలోలు, బూడిద చెరువు నుంచి వెలువడే బూడిదతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఉండలేక, బయటకు పోలేక నరకయాతన అనుభవిస్తున్నాం. ఇప్పటికైనా మాకు పునరావాసం కల్పించి ఇక్కడ నుంచి తరలించాలని కోరుతున్నాం.

- దగ్గు స్వరూప, దుబ్బపల్లి గ్రామస్థురాలు

ఇవి కూడా చదవండి

విశాఖ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

మెట్రో రైలులో అలజడి సృష్టించిన పాము..

Updated Date - Jun 21 , 2025 | 04:22 AM