Indiramma Canteens: ఇందిరమ్మ క్యాంటీన్లలో ఆగస్టు 15 నుంచి అల్పాహారం
ABN, Publish Date - Jul 26 , 2025 | 08:01 AM
ఇందిరమ్మ క్యాంటీన్లలో రూ.5కే అల్పాహారం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు వేగవంతం చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15వ తేదీ నుంచి ఉదయం టిఫిన్ వడ్డించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు.
- సూత్రప్రాయంగా నిర్ణయించిన జీహెచ్‌ఎంసీ
హైదరాబాద్ సిటీ: ఇందిరమ్మ క్యాంటీన్లలో(Indiramma Canteens) రూ.5కే అల్పాహారం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు వేగవంతం చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15వ తేదీ నుంచి ఉదయం టిఫిన్ వడ్డించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. రూ.5భోజన కేంద్రాల్లోనే అల్పాహారం అందుబాటులో ఉండనుంది. క్యాంటీన్ నమూనానూ బల్దియా మారుస్తోంది. 40/10, 20/10 పరిమాణాలతో నూతన కేంద్రాలను డిజైన్ చేసింది. ఎక్కువ విస్తీర్ణం ఉంటే వడ్డించేందుకు అనువుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లో ఇప్పటికే ఇందిరమ్మ క్యాంటీన్ నూతన నమూనా ఏర్పాటు పూర్తయ్యింది.
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్దా పనులు తుది దశకు చేరుకున్నాయి. కొత్త నమూనాలో జీహెచ్‌ఎంసీ లోగో, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఫొటోలతో పాటు భోజనం, అల్పాహారం ఫొటోలు ఉన్నాయి. డివిజన్‌కు ఒకటి చొప్పున గతంలో 150 భోజన కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 128 కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. లబ్ధిదారులకు అల్పాహారంగా తృణధాన్యాలతో చేసిన ఇడ్లీ, ఉప్మా, పొంగల్, పూరి వంటివి వడ్డించనున్నారు. వారంలో ఆరు రోజులు అల్పాహారం అందుబాటులో ఉంటుంది. ఆదివారం సెలవు. ఒక్కో టిఫిన్‌కు రూ.19 ఖర్చు కానుండగా లబ్ధిదారుడు రూ.5 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా రూ.14 హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్‌కు జీహెచ్‌ఎంసీ చెల్లించనుంది.
రోజు మెనూ (నోట్- గ్రా- గ్రాములు, ఎంఎల్- మిల్లీ లీటర్లు)
డే-1 మిల్లెట్ ఇడ్లీ-3 (ఒక్కొక్కటి-45 గ్రా), సాంబార్-150 ఎంఎల్, పొడి-15 గ్రా.
డే-2 మిల్లెట్ ఉప్మా- 250 గ్రా, సాంబార్-150 ఎంఎల్, మిక్చర్/చట్నీ-25 గ్రా.
డే-3 పొంగల్- 250 గ్రా, సాంబార్- 150 ఎంఎల్, మిక్చర్- 25 గ్రా.
డే-4 ఇడ్లీ-3 (ఒక్కొక్కటి-45 గ్రా), సాంబార్-75, చట్నీ-75 గ్రా.
డే-5 పొంగల్- 250 గ్రా, సాంబార్- 150 ఎంఎల్, మిక్చర్- 25 గ్రా.
డే-6 పూరి-3 (45 గ్రా.), ఆలు కూర్మ- 100 గ్రా.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
యాదగిరిగుట్ట సత్యదేవుడి వ్రత టికెట్ ధర పెంపు
Read Latest Telangana News and National News
Updated Date - Jul 26 , 2025 | 08:01 AM