Mallu Bhatti Vikramarka: అసెంబ్లీకి కాదు.. జనాల్లోకి రావడం లేదు
ABN, Publish Date - Jul 11 , 2025 | 07:29 PM
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకే కాదు.. ప్రజల మధ్యకు రావడం లేదని మండిపడ్డారు.
హైదరాబాద్, జులై 11: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆయన జనాల్లోకి సైతం వెళ్లడం లేదన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ జనాల్లోకి వెళ్తున్నారని గుర్తు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీఆర్ఎస్ నేతల మాటలు మితిమీరి పోయాయంటూ మండిపడ్డారు.
కర్ణాటక తరహాలో తమ ప్రభుత్వంలో పవర్ షేరింగ్ ఏమి లేదని స్పష్టం చేశారు. అందరం కలిసి టీమ్ వర్క్‌గా చేస్తున్నామని వివరించారు. అయితే రూ. 2 లక్షలు దాటిన వారికి రుణ మాఫీ చేయకూడదన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని ఆయన గుర్తు చేశారు. రేషన్ కార్డు ఆధారంగానే కుటుంబంలో రుణ మాఫీ జరుగుతుందని చెప్పారు. సన్నం బియ్యం పథకం విజయవంతమైందని సంతోషం వ్యక్తం చేశారు. గతంలోగా రేషన్ బియ్యం పక్క దారి పట్టడం లేదని తెలిపారు. మహిళలకు మహాలక్ష్మీ పేరిట చేపట్టిన ఉచిత బస్సు పథకానికి మంచి స్పందన వస్తుందని హర్షం వ్యక్తం చేశారు. మరో మూడు వేల బస్సులు కొనేందుకు తమ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని వివరించారు.
ఇక ఫోర్త్ సిటీ పనులు జరుగుతున్నాయన్నారు. మూసి సుందరీకరణ తమ ప్రభుత్వం హయంలో పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. గాంధీ ఘాట్ వరకు సుందరీకరణ జరిగి తీరుతుందని ఆయన కుండ బద్దలు కొట్టారు. అందుకు సంబంధించి అన్ని పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు కూడా వస్తుందన్నారు.
తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేది లేదని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు. పాశమైలారంలోని పారిశ్రామిక వాడలో చోటు చేసుకున్న సిగాచి సంస్థలో ప్రమాదంపై ఇప్పటికే ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ పని తీరు పట్ల ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేశారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!
అసెంబ్లీకి కాదు.. జనాల్లోకి రావడం లేదు
For Telangana News And Telugu News
Updated Date - Jul 11 , 2025 | 08:16 PM